Shekar:రాజ 'శేఖర్' రివ్యూ
2018లో వచ్చిన మలయాళ చిత్రం జోసెఫ్..అప్పట్లో సూపర్ హిట్. ఆ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ‘శేఖర్’ కథ ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతికి ఇచ్చింది?మాతృకకు భంగం కలకుండా..తెలుగు ప్రేక్షకుల తగ్గట్టుగా ఏయే ఏయే మార్పులు చేశారో చూద్దాం.
యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ ఒక టైమ్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చాడో ఓ జనరేషన్ కు బాగా గుర్తు. అయితే కాలంతో పాటు ఆయన పరుగెత్తలేదు. గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు ఈ యాంగ్రీమ్యాన్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకుని తాజాగా శేఖర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మళయాళ సినిమాకు రీమేక్ కావటంతో సినిమాపై మంచి నమ్మకాలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో తన హిట్ ట్రాక్ లోకి రాజశేఖర్ వెళ్లగలిగారా...తన భార్య దర్శకత్వం, తన కూతురు మరో కీలక పాత్రలో వచ్చిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ పిల్మ్ ఆయన కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడుతుంది. అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
రిటైర్డ్ పోలీస్ శేఖర్ కి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మంచి పేరు. రిటైరైనా ఇప్పటికీ అతన్ని కేసులలో పిలుస్తూంటారు. క్రైమ్ జరిగిన కొద్ది సేపట్లోనే తన తెలివితో, పరిశీలనా జ్ఞానంతో క్రిమినల్స్ ఎవరో ఇట్టే కనిపెట్టేస్తాడు. అలాంటి శేఖర్ కు జీవితంలో ఆనందం ఉండదు. తన భార్య తో డైవర్స్. కూతురుతో కలిసి ఉంటూంటాడు. పర్శనల్ కారణాలతో తాగుడుకి బానిస అవుతాడు. ఇలా జీవితం గడిపేస్తున్న శేఖర్ కు ఓ రోజు అతని కుమార్తె సైతం యాక్సిడెంట్ లో మరణిస్తుంది. మరికొద్ది రోజులకు డైవర్స్ తీసుకున్న భార్య సైతం మరణిస్తుంది. కుమార్తె మృతి విషయంలో శేఖర్ కు అనుమానం వస్తుంది. దాంతో సంఘటనా స్దలానికి వెళ్లి క్లూలు వెతుకుతాడు. కొద్దిపాటి ఇన్విస్టిగేషన్ చేస్తాడు. ఈ క్రమంలో అది యాక్సిడెంట్ డెత్ కాదు ప్లాన్ చేసి చంపారనే విషయం అర్దమవుతుంది. దాంతో ఎవరు తన కుమార్తెను చంపారు అనే విషయంలో లోతుగా వెతకడం మొదలెడతాడు. ఈ ఇన్విస్టిగేషన్ లో అతనికి తెలిసిన విషయాలేమిటి...ఆమెను ఎవరు చంపారు..ఎందుకు చంపారు. అలాగే శేఖర్ బార్య కు మరణమా లేక అది మర్డరేనా ..ఈ విషయాలు వెనక ఉన్న పెద్ద స్కామ్ ని ఎలా ఛేధించాడు. అసలేం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది...
మళయళంలో బాగున్న సినిమాలు ఆహా ఓటిటిలో తెలుగులోకి వచ్చి భలే ఉన్నాయనిపించుకుంటున్నాయి. అలాగని వాటినన్నిటినీ తెలుగులోకి రీమేక్ చేస్తే ఎంతవరకూ నచ్చుతాయో చెప్పలేము. ఎందుకంటే అవి మళయాళ సినిమాలు అని తెలుసు..స్లోగా ఉంటాయని తెలుసు...అక్కడ నేటివిటికి తగ్గట్లే కథ నడుస్తుందని గుర్తుంచుకుని చూస్తాం. అదే తెలుగు రీమేక్ చేస్తే తెలుగు నేటివిటి ఆశిస్తాం. ఇక్కడ మన సినిమాలాగే ఉండాలనుకుంటాం. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని కొందరు రీమేక్ లు చేస్తారు. సక్సెస్ కొడతారు. మరికొందరు డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్ కొన్నాం, సక్సెస్ అయిన సినిమానే కదా...జనం ఎక్కడైనా ఒకటే కదా అని అని మక్కీకి మక్కీ, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్లి పోతారు. అవి కాస్తంత ఇక్కడ మార్కెట్ లో తడబడతాయి. ఈ రెండో కేటగిరికి చెందిన రీమేకే ఇది. మళయాళంలో వచ్చి సక్సెస్ అయిన జోసఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తెలుగుకు పెద్దగా మార్పులు లేకుండా చేసేసారు. దాంతో ఫస్టాఫ్ సినిమా మొత్తం డెడ్ స్లోగా నడుస్తుంది. దానికి తోడు సెకండాఫ్ లో హీరో లక్ష్యానికి తగిన ఎమోషనల్ సపోర్ట్ కోసం ...ఇక్కడ సాగతీత పోగ్రామ్ లతో కథలోకి వెళ్లకుండా శేఖర్, అతని,భార్య, అతని కూతురు మధ్య సీన్స్, పాటలు నడుపుకుంటూ పోయారు. రాజశేఖర్ ...ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి యంగ్ ఏజ్ గెటప్ లో కు వెళ్లి పాటలు పాడితే చూసే ఓపిక ఇప్పటితరం ప్రేక్షకులకు లేదు. ఆ విషయం మర్చిపోయి సీన్స్ చేసారు.
మరో విషయం ఈ సినిమా థ్రిల్లర్ అని ఫిక్స్ అయ్యి వస్తే ...ఫ్యామిలీ ఎమోషన్స్ తో విసిగించినట్లు అనిపించింది. సెకండాఫ్ కథలోకి వెళ్లేదాకా సహన పరీక్షే. మళయాళంలోనూ అదే జరిగింది. అయితే అక్కడ ఆడియన్స్ వేరు. వారి సహన శక్తి వేరు. మనవాళ్లు కట్ టు కట్ అన్నట్లు సీన్స్ చూడటానికి అలవాటు పడ్డారు. మరీ కేజీఎఫ్ లాంటి సినిమాలు వచ్చాక వారు చూసే థోరణి సైతం మరింత మారింది.ఆ విషయం గుర్తు పెట్టుకోకపోతే సినిమాలు టీవి సీరియల్స్ తలపిస్తాయి. వెబ్ సీరిస్ లను గుర్తు చేస్తాయి. శేఖర్ స్క్రిప్టులో ఉన్న విషయమే ఉన్నంతలో కాపాడండి. సెకండాఫ్ టైట్ గా ఉన్న స్క్రీన్ ప్లే, ఎండ్ ట్విస్ట్ కాస్త ఉత్సాహం తెప్పిస్తాయి. ఏదైమైనా ఫస్టాఫ్ ని కూడా అంతే రేసీగా నడిపితే బాగుండేది. కేవలం తన భార్య, కూతురుపై ఉన్న ఎమోషన్ ఉంది అని చెప్పటానికి గంట సేపు స్క్రీన్ టైమ్ వాడటం ...ప్రేక్షకుడుని ఇబ్బంది పెట్టడమే. ఫస్టాఫ్ లో కూడా మరో కేసు తీసుకుని..దాన్ని థ్రిల్లింగా సాల్వ్ చేస్తూ మెల్లిగా అసలు కథలోకి వస్తే బాగుండేది. తెలుగుకు ఖచ్చితంగా మార్పులు చేర్పులు అవసరం అని భావిస్తే ఈ సమస్య ఏర్పడేది కాదు.
ప్లస్ పాయింట్స్:
రాజశేఖర్ తన వయస్సుకు తగ్గ లుక్, నటన
ఒరిజనల్ లో ఉన్న థ్రిల్లింగ్ పాయింట్
మైనస్ పాయింట్స్:
తెలుగు నెటివిటి మిస్సవడం.
ఫస్టాఫ్ లో వచ్చే రోటిన్ సీన్స్
స్లో నరేషన్
టెక్నికల్ గా ..
.ఈ సినిమా స్దాయికి తగ్గ స్టాండర్డ్స్ లోనే ఉంది. అయితే మేకింగ్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలా చేయకపోవటంతో ఫస్టాఫ్ లో చాలా ఎమోషన్ సీన్స్ టీవి సీరియల్ ని చూస్తున్న భావన కలిగించాయి. కెమెరా,ఎడిటింగ్ వర్క్ బాగుంది. . సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ నారగాని విజ్యువల్స్ లొకేషన్ బ్యూటీని బాగా పట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం సోసో గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లు లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మరీ కాలుక్యులేటెడ్ గా ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ కు చెక్కినట్లుగా అటూ ఇటూ కాకుండా కంటెంట్ మాత్రమే డెలివరి అయ్యేలా డైలాగులు రాయాలి. ఆ విషయంలో లక్ష్మీభూపాలమాస్టరీ చేసారని అనిపిస్తుంది.
నటినటుల్లో ... శేఖర్ పాత్రలో రాజశేఖర్ బాగా చేసారు. కానీ ఆయన శారీరకంగా బాగా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన భార్యగా నటించిన మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటి సారి తెలుగు సినిమాలో చేసినా ఎక్కడా అలా అనిపించలేదు. శివానీ రాజశేఖర్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర ఇలా ఎవరికి వారు తమ పరిధిమేరకు బాగానే నటించారు.
shekar
ఫైనల్ థాట్
మళయాళ జోసెఫ్ చూడనివాళ్లు తెలుగులో దాన్ని చూద్దామనుకుంటే ఓ ఆప్షన్. అంతకు మించి ఈ సినిమా నుంచి ఏమి ఎక్సెపెక్ట్ చేయలేం.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
Shekar Telugu Movie Review
సినిమా: శేఖర్ నటీనటులు: రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివానీ రాజశేఖర్, సమీర్, కిశోర్, ప్రకాష్‌రాజ్, అభినవ్ గోమటం, తుమ్మల ప్రసన్నకుమార్, కవిత తదితరులు దర్శకత్వం: జీవితా రాజశేఖర్
నిర్మాత: బీరం సుధాకర రెడ్డి
సమర్పణ: వంకాయలపాటి మురళీకృష్ణ
మాటలు: లక్ష్మీభూపాల
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
సంగీతం: అనూప్
రూబెన్స్ విడుదల: 20.05.2022