Bheemla Nayak Review: పవన్ 'భీమ్లా నాయక్' మూవీ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈ రోజు విడుదలైంది. చూసివాళ్లంతా సినిమా మాస్ ఫీస్ట్ అంటున్నారు. మరికొందరు శివరాత్రి వరకూ థియేటర్లలో పవన్ కల్యాణ్ శివ తాండవం అని , పవన్ విధ్వంసాన్ని ఆపలేరని చెప్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంది..
లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. ఈ రోజు తెలుగు వాళ్లు ఉన్న ప్రతీ చోటా వినిపిస్తున్న పాట. ఆ పాట వెనక ఉన్న పేరు పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్. వకీల్ సాబ్ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తరువాత పవన్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ , మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్న భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఈ రోజు ( ఫిబ్రవరి 25 న) రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ నేపద్యంలో థియోటర్స్ లో ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అభిమానులు నిన్న రాత్రి నుంచే రచ్చ షురూ చేశారు. సినిమా ఈ రచ్చ కు తగ్గ స్దాయిలో ఉందా...కథేంటి, రీమేక్ కు, తెలుగు వెర్షన్ కు తేడా ఏంటి వంటి విశేషాలు రివ్యూలో చూద్దాం.
కథ
రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ (రానా) ఒక రోజు రాత్రి కార్ లో తన సొంతూరుకు వెళుతూ ఉంటాడు. కారు డ్రైవర్ నడుపుతూంటే .. తను వెనుక సీట్లో నిద్రపోతాడు. ఈ లోగా ఓ చెక్ పోస్ట్ దగ్గర ఆ కార్ ని పోలీస్ లు ఆపుతారు. అది లిక్కర్ ఫ్రీ జోన్. అనుకోకుండా పోలీసుల చెకింగ్ లో డానీ కార్ లో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి. తాను రిటైర్డ్ హవల్దార్ నని, తనకు అవి కోటాలో వచ్చాయని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ ఏరియాలో మధ్య నిషేధం ఉండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..డానీ వారిమీద తిరగబడతాడు. అది పోలీస్ లకు కోపం తప్పిస్తుంది. ఇంతలో పోలీస్ సబ్ ఇన్సిపెక్టర్ భీమ్లా నాయక్ (పవన్) సీన్ లోకి వస్తాడు. భీమ్లా ఓ నిజాయితీ పరుడైన పోలీస్....డానీ మీద చెయ్యి చేసుకొని.. అతడ్ని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళతాడు. డానీ హర్ట్ అవుతాడు. చాలా అవమానంగా ఫీలవుతాడు.
పోలీస్ లు ఎప్పటిలాగే డానీ ఫోన్ లాక్కుని , అతడి కార్ ను సీజ్ చేసి కేస్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈలోగా అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అతడి ఫోన్ ను చెక్ చేస్తూంటే.. డానీకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని అర్దమవుతుంది. అయినా తన డ్యూడీ ప్రకారం అతడి మీద కేస్ ఫైల్ చేసి అతడ్ని కోర్ట్ కు సబ్ మిట్ చేసే తీరతానని చెబుతాడు. దాంతో డానీకు మండిపోతుంది. ఇగో క్లాష్ మొదలవుతుంది. భీమ్లా సస్పెండ్ అయ్యే రీతిలో అతడ్ని ఓ కేస్ లో ఇరికిస్తాడు. అక్కడి నుంచి భీమ్లా కి, డానీకి మధ్య వార్ మొదలవుతుంది. ఇద్దరి వెనక్కి తగ్గని ఇగో ఉన్న వ్యక్తులే. ఈ గొడవలో సుగుణ(నిత్యామీనన్) ఎలా సఫరైంది..చివరికి భీమ్లా, డానీ శత్రుత్వాన్ని విడిచిపెట్టారా..ఫైనల్ గా ఏమైంది అన్నదే మిగతా కథ.
ఎనాలసిస్ ...
తెలుగులో ఇద్దరి హీరోల కథలు వచ్చి ఉండవచ్చు. కానీ ఇలాంటి అరుదైన నేపధ్యం....ఇగో క్లాష్ నేపధ్యంలో కథలు మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే ఇది తెలుగువారికి అతి కొత్త కథ. మళయాళం చూడని వారు అబ్బురపడే కథ. తెరపై పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా రెడీ చేసిన యాక్షన్ కథనం. తమన్ మరోసారి తన సత్తా చూపే అవకాసం ఇచ్చిన సబ్జెక్టు.
ఈ సినిమా మళయాళంలో హిట్ అయ్యిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ మలయాళ సినిమా ని దర్శకుడు సచ్చి అద్బుతంగా తీసారు. అందుకే భాషలకతీతంగా జనాదరణ పొంది, మలయాళ పరిశ్రమకే ఒక మాస్టర్ పీస్ లా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ హక్కులు కొనుగోలు చేసినప్పుడే అందరి దృష్టి ఎవరు ఆ ప్రధాన పాత్రలు రెండూ చేస్తారనే దానిపై పడింది. పవన్, రానా రాగానే ఈ సినిమా సగం సక్సెస్ వచ్చినట్లైందని అనుకున్నారు. ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాన్, ఆర్మి రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించారు. అయితే ఒరిజినల్ వెర్షన్ సినిమాలోని క్లాస్ టచ్ ఈ సినిమాలో మిస్స్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్లుగా మార్పులు,చేర్పులకు లోనైంది.
ఇక ఈ చిత్రం స్క్రిప్టు లో ప్రధాన పాత్రలు రెండు నువ్వా నేనా అని నటించేలా ఒక థ్రిల్లింగ్ స్టోరీ రాసుకోవటమే కలిసి వచ్చింది. తెలుగులోనూ అదే యాజటీజ్ ఫాలో అయ్యారు. అంతేకాదు అంతే ప్రతిభావంతంగా హీరోలు ఇద్దరి పెర్పార్మెన్స్ పీక్స్ లో ఉండే సీన్స్ ను డిజైన్ చేసుకున్నారు. ప్రధాన కథలో సబ్ ప్లాట్స్ ప్రయారిటీ కాస్త తగ్గించి, స్టార్స్ ఇద్దరి మధ్యా నువ్వా...నేనా అన్నట్లు యాక్షన్ తలదన్నే రీతిలో తీర్చిదిద్దాడు. దాంతో సినిమా ఎక్కడా ఆగి బోర్ కొట్టించే పోగ్రాం పెట్టుకోదు. సెకండాఫ్ మీద ఆసక్తి కలిగే రీతిలో ఫస్టాఫ్ ఇంట్రవెల్ వేయటం జరిగింది. అలాగే నెక్ట్స్ సీన్ ఏమిటి..ఏం జరుగుతుంది...ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల్లో కలగజేశాడు. అందుకే ఈ సినిమా మాలీవుడ్ లో టాప్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోయింది. ఇప్పుడు తెలుగులోనూ అదే మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాసం ఉంది. ఈ స్దాయి సక్సెస్ ని చూడకుండానే దర్శకుడు,రచయిత అయిన సచ్చి ఒరిజనల్ మలయాళం సినిమా విడుదలయ్యాక చనిపోవడం విచారకరం.
మలయాళం వెర్షన్ కు తెలుగులో చేసిన మార్పులు..
ఒరిజినల్ సినిమాలో పవన్ పాత్రను బిజూ మీనన్ అనే మలయాళ నటుడు చేశాడు ఆ సినిమాలో ఆయన పాత్రను చాలా క్లాస్ గా చూపించారు. ఎంతో హుందా నటనను కనబరిచారు ఆయన. అయితే దానికి పూర్తి కాంట్రాస్ట్ గా పవన్ పాత్ర తెలుగులో డిజైన్ చేసారు. పవన్ యాక్టింగ్ మాస్ కు నచ్చేలా కాస్త లౌడ్ గా చూపారు.అలాగని ఆ పాత్రకు ఒరిజనల్ పాత్రకు పోలికే లేదని అనలేం. పాత్రలోని సోల్ ని వదలకుండా పవన్ ఆ పాత్రను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారు. ఓ రకంగా పవన్ కళ్యాణ్ పాత్ర డిఫరెంట్ గా చేయడం ఈ సినిమాకు చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి.
ఒరిజనల్ లో ఉన్న లెంగ్త్ ని తగ్గించటం కలిసి వచ్చింది. అక్కడ వర్కవుట్ అయిన స్క్రిప్టు, లీడ్ యాక్టర్స్ ఫెరఫార్మెన్స్, లొకేషన్స్ ఇక్కడా ఉన్నాయి కానీ అంతకు మించి అన్నట్లు డిజైన్ చేసారు. ప్రి క్లైమాక్స్ దగ్గర డల్ అవ్వకుండా యాక్షన్ ప్లాష్ బ్యాక్ పెట్టారు.
రీమేక్ లో ఈ తరహా మార్పులు అవసరమే. మలయాళ దర్శక రచయిత సాచీ అక్కడ మలయాళ ప్రేక్షకులు క్లాస్ గా సెటిల్ గా ఉండే పాత్రను ఇష్టపడతారు కాబట్టి ఆ విధంగా ఆ సినిమాను ఆ సినిమాలోని పాత్రలను తీర్చిదిద్దాడు. అలాచేస్తే తెలుగులో ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. ఈ విషయం గమనించే త్రివిక్రమ్ ఈ మార్పులు చేసినట్లున్నారు. పవన్ పాత్ర కు మాస్ టచ్ ఇచ్చి దానికి తగ్గట్లుగా ఎలివేషన్ పెంచటంతో థియేటర్లో ఓ రేంజి రెస్పాన్స్ వస్తోంది.
పవన్,రానా పోటా పోటీ
ఇలాంటి పాత్రలకు పవన్ తన పవర్ ఫాక్డ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారో తెలిసిందే. మళ్ళీ గబ్బర్ సింగ్ నాటి రోజులు గుర్తు వచ్చాయి. ముఖ్యంగా క్యారక్టరైషన్ లో గ్రాడ్యువల్ గా వచ్చే మార్పులు, సెల్ప్ రెస్పెక్ట్ తో ఇచ్చే రియాక్షన్ ఫెరఫెక్ట్ గా చూపించారు. అందుకే సెకండాఫ్ నిలబడింది. వేరే వాళ్లు అయితే ఖచ్చితంగా తేలిపోయేది. రానా విషయానికి వస్తే అతన్ని ఆ పాత్రకు తీసుకోవటంతో నెగిటివ్ టచ్ వచ్చేసింది. దాంతో ఆ పాత్ర గురించి ఎక్కువ చెప్పకుండానే అహంకారం అనే పదానికి నిర్వచనంలా ఉన్నారు. రానా ని చూస్తుంటే మలయాళంలో ఒరిజనల్ చేసిన పృధ్విరాజ్ సుకుమారన్నే గుర్తుకు వస్తారు.
ఇక మిగతా ఆర్టిస్ట్ లలో పవన్ భార్య సుగుణగా నిత్యామీనన్, రానా తండ్రిగా సముద్ర ఖని, రానా భార్యగా సంయుక్తా మీనన్,రానా డ్రైవర్ గా రఘుబాబు, ఎమ్మల్యే నాగరాజుగా రావు రమేష్,లాయర్ గా హర్షవర్దన్, ఎమ్మల్యేగా తణికెళ్ళ తన పాత్రలకు ప్రాణం పోసారు. హైపర్ ఆది,సునీల్ ఛల్తాహై. బ్రహ్మానందం జడ్జిగా గెస్ట్ రోల్ పర్ఫెక్ట్ ఆప్షన్.
దర్శకత్వం..మిగతా విబాగాలు
మనకి ఆ మేకింగ్ స్టైల్ ...స్క్రీన్స్ మీద వర్కవుట్ అయినవి చూస్తూంటే Italian filmmaker Sergio Leone చేసిన వెస్ట్ మూవీస్ గుర్తు వస్తాయి. అవే పవన్ కు నచ్చినట్లు ఉన్నాయి. మెయిన్ క్యారక్టర్స్ పవన్,రానాలు ఇద్దరూ Clint Eastwood,Lee Van Cleef అనిపిస్తారు. అలాగే ఈ స్క్రిప్టులో ఇంకో గొప్పతనం ఏమిటి అంటే ఓ మహిళా పాత్రలకు కావాల్సినంత స్పేస్ ఇస్తాడు.
ఇక అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాగర్ చంద్ర. మరోసారి ఈ సినిమాతో ఇద్దరి హీరోలను ఎలా హ్యాండిల్ చేయచ్చో....మాస్ సీన్స్ ని ఎలా, ఎంత ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయచ్చో చూపించారు. త్రివిక్రమ్ రాసిన తెలుగు వెర్షన్ స్క్రిప్టుకు పూర్తి న్యాయం చేసారనిపిస్తోంది. మన ఆడియన్స్ టేస్ట్, పవన్, రానా ల స్ట్రెంత్ ని చూసుకుని సీన్స్ చేసారని అర్దమవుతోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదరకొట్టాడు. ముఖ్యంగా 'లా లా భీమ్లా' సాంగ్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది.
రవి కె చంద్రన్ కెమెరా వర్క్...సినిమాకు ఓ ప్రక్కన క్లాస్ లుక్ ఇస్తూనే రగ్గడ్ గా అనిపించింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అడవి సీన్స్ హైలెట్ గా ఉంటాయి.ఎడిటింగ్ కూడా స్మూత్ గా ఎక్కడా విసుగు చెందనీయకుండా సాగింది. కాకపోతే ఫస్టాఫ్ లో కాస్త స్లో నేరేషన్ తగ్గిస్తే బాగుండేది. త్రివిక్రమ్ డైలాగులు గురించి కొత్తగా చెప్పుకునేదేముంది. ఆయన మాటల మాంత్రికుడే.అడవిని తగలెట్టడం చూశా
పులిని వేటాడటం చూశాకానీ, ఆ పొద్దు వేరు దొరా!' వంటి డైలాగులు ఇట్టే ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పవన్ సినిమాల్లో ఎప్పుడూ బాగుంటాయి. ఇప్పుడూ అంతే.
Bheemla nayak
ప్లస్ లు
పవన్ పవర్ ఫుల్ ఫెరఫార్మెన్
రానా పోటా పోటీ నటన
ప్రీ క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్
టైటిల్ సాంగ్
మైనస్ లు
ఫస్టాఫ్ స్లోగా సాగటం
ఒరిజనల్ లో ఉన్న డ్రామా తగ్గించటం
ఫైనల్ థాట్ :
పవన్ కు ఇది మరో 'గబ్బర్ సింగ్'...రానాకి ఇది మరో 'బాహుబలి'
Rating:3.5
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Bheemla nayak
ఎవరెవరు..
బ్యానర్:సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
విడుదల తేదీ: 25, పిబ్రవరి 2022