Thank You:నాగ చైతన్య “థాంక్యూ” రివ్యూ
నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదల అయ్యింది. మరి ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎలా ఉంది ?, చైతు మెప్పించాడా? లేదా ?
'జీవితంలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎవ్వరూ ఎదగలేరు. సక్సెస్ కాలేరు. మన సక్సెస్ కు కారణమైన వాళ్లను అస్సలు మరిచిపోకూడదు..' అనే సందేశంతో ఓ సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ...అసలు ఇలాంటి పాయింట్ ని ఎలా స్టోరీగా తయారు చేసి తెరకెక్కించారనే ఆసక్తి కలుగుతుంది. అయితే ఆ ఇంట్రస్ట్ థియేటర్ దాకా మనని డ్రైవ్ చేస్తుందా లేదా అనేది అసలు కీలకం. గత కొంతకాలంగా మాస్ సినిమాలు అదీ పెద్ద స్టార్స్ వి తప్పించి మొదటి రోజు ఓపినింగ్స్ ఉండటం లేదు. ఇలాంటి సంధి సమయంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ డ్రామా బాగుందని మౌత్ టాక్ వస్తేనే జనాలు ధైర్యం చేస్తారు. మరి ఈ సినిమా ఎలా ఉంది...సినిమాలో కథేంటి...చైతుకు ఈ సారైనా దిల్ రాజు హిట్ ఇచ్చారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
అభిరామ్ (నాగచైతన్య) తను, తన పనులు, తన లోకం అన్నట్లు ఉండే ఈ జనరేషన్ వ్యక్తి. అమెరికా వచ్చి అతను ఓ యాప్ తయారు చేసి సక్సెస్ చేసి తన కలలను పండించికుంటాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతాడు. కార్పోరేట్ ప్రపంచంలో దూసుకుపోతున్న అతను మెల్లి మెల్లిగా వర్కోహాలిక్ గా, ఇగోఇస్టిక్ గా తయారవుతాడు. ఇక ప్రియ (రాశి ఖన్నా) అతనితో ప్రేమలో ఉంటూ...ఆర్దికంగా పూర్తి స్దాయి సపోర్ట్ ఇస్తుంది. అయితే అభి ఇవన్నీ పట్టించుకునే స్దితిలో ఉండదు. కెరీర్, గ్రోత్ అంటూ ఓ విధమైన సెల్ఫ్ సెంట్రిక్ యాటిట్యూడ్ తో తన చుట్టూ ఉన్న అందరూ దూరం అవుతూంటారు. ఈ విషయం గుర్తించడు. జీవిత వేగంలో కొట్టుకుపోతూంటాడు.
చివరకు ఓ రోజు ప్రియ కూడా దూరం అయ్యిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. ప్రశాంతంగా కూర్చుని తనతో తనే మాట్లాడుకుంటాడు. తను ఈ స్దాయిలో ఉండటానికి కారణమైన వాళ్లను మర్చిపోయానని, వదిలేసానని, అందుకే వాళ్లు తనను వదిలేసారని అర్దం చేసుకుంటాడు. ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటాడు. తను ఈ రోజు ఈ స్దాయిలో ఉండటానికి ప్రత్యక్ష్యంగా,పరోక్షంగా కారణమైన వాళ్ళందిరికీ కృతజ్ఞతలు చెప్దామని నిర్ణయించుకుంటాడు. దాంతో వాళ్లందరినీ కలవటానికి ఓ భావోద్వోగమైన ప్రయాణం మొదలెడతాడు. జ్ఞాపకాల్లోకి వెళ్తాడు... తన కాలేజీ రోజుల నుంచి ఇప్పటిదాకా తన జీవితంలోకి వచ్చింది ఎవరు.. వాళ్లందరినీ అభి కలవగలిగాడా, ప్రియతో తన లవ్ స్టోరీ చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఓ క్యారక్టర్ జర్నీని స్టోరీ ఐడియాగా మార్చి సినిమా చెయ్యటం ఎప్పుడూ బాగుంటుంది. ఎక్కువ లీనం అవ్వటానికి అవకాసం దొరుకుతుంది. అయితే ఇది క్యారక్టర్ డ్రివెన్ స్టోరీ నే. కానీ కేజీఎఫ్, పుష్ప, డీజే టిల్లు లాంటిది కాదు. ఆ సినిమాల్లో మెయిన్ క్యారక్టర్ కథలో సంఘటనలు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. వాటిని రికార్డ్ చేస్తే సరిపోతుందనిపిస్తుంది. క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ ముఖ్యంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మీదే ఆధారపడి వుంటాయి. అంత మాత్రాన అదొక్కటే కథను క్రియేట్ చేయలేదు. క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ లో ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండూ కలగలసి వుంటాయి. అప్పుడే అది యాక్టివ్ పాత్రగా పరుగెడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రత్యర్ధి పాత్ర వుండదు.
తనకు తన ఏటిట్యూడే ప్రత్యర్ది. అలాంటనప్పుడు ఆ ఏడిట్యూడ్ ని ఎదుర్కోవటానికి అతను థాంక్స్ చెప్పటం అనే పోగ్రామ్ పెట్టుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. ఆ ధాంక్స్ చెప్పే ప్రాసెస్ నుంచి కాంప్లిక్ట్ పుట్టాలి. కానీ అదేమీ జరగలేదు. దాంతో ఫీల్ గుడ్ కాస్తా బోర్ లడ్డులా మారింది. దానికి తోడు ప్రారంభ ఎపిసోడ్ నుంచే కథ జర్నీ ఎటు, ఎక్కడ ముగియబోతుందనే విషయమై క్లారిటీ వచ్చేలా సీన్స్ డిజైన్ చేసారు. ఎమోషనల్ పే ఆఫ్ ..క్లైమాక్స్ లో చేసారు కానీ అప్పటిదాకా మనం ఓపిగ్గా వెయిట్ చేయాలి. అంటే అంతగా ఎంగేజింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే రాసుకోగలగాలి. అదే జరగలేదు.
ఫస్టాఫ్ మంచి ఎమోషన్స్, సెంటిమెంట్స్ నింపారు. అయితే సోల్ సెర్చింగ్ మిషన్ పై హీరో బయిలుదేరటం చాలా సార్లు చూసేసిందే అనిపించింది. దాంతో ఎక్సైటింగ్ మిస్సైంది. సెకండాఫ్ కు వస్తే....చాలా ప్లాట్ గా కథ సాగింది. క్లైమాక్స్ కాస్తంత ఎమోషన్ గా ఉండటం ఉన్నంతలో మేలు అనిపించింది. మహేష్ అభిమానిగా వచ్చే సీన్స్ కు మాత్రం థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాగున్నవి :
చైతూ ఎక్సప్రెషన్స్
పీసీ శ్రీరామ్ విజువల్స్
రన్ టైమ్
బాగోలేనివి :
ఊహకు అందే కథ,కథనం
ఎక్కడా హై ఇచ్చే ఎమోషన్స్ లేకపోవటం
మ్యూజిక్
టెక్నికల్ గా ..
దర్శకుడుగా విక్రమ్ కె కుమార్ సినిమా అంటే ఏదో ఒక విభిన్నత ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం. అలాగే అందమైన విజువల్స్, ఫీల్ గుడ్ సీన్స్ కు ఆయన పెట్టింది పేరు. అయితే ఆయన ఈ సినిమాలో సంపూర్ణంగా తనను తాను ఆవిష్కరించుకోలేదు. స్క్రిప్టు పరంగా ప్రేమమ్, ఆటోగ్రాఫ్ సినిమాలు గుర్తు వస్తాయి. ఇలాంటి సినిమాలకు అవసరమైన కెమెరా వర్కు కుదిరింది కానీ, మ్యూజిక్ సెట్ కాలేదు. పాటలు గుర్తుండేవి లేవు...బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్లుంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డైలాగులు ఇంకాస్త బాగుంటే సీన్స్ బాగా ఎలివేట్ అయ్యేవి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటన విషయానికి వస్తే.... 16 ఇయర్స్ నుంచి 36 ఏళ్ల వరకు త్రీ వేరియేషన్స్ లో కనిపించం ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలెంజింగ్. నాగచైతన్య మాత్రం ఎక్కడా వంక పెట్టలేని విధంగా చేసుకుంటూ పోయారు. ముఖ్యంగా 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య చాలా కష్టపడ్డారని అర్దమవుతుంది. ఇక రాశి ఖన్నా పాత్ర వరల్డ్ ఫేమస్ లవర్ లో ఆమె పాత్రకు ఎక్సటెన్షన్ లాగ అనిపిస్తుంది. మాళవిక నాయక్, అవికా గోర్ అలా చేసుకుంటూ వెళ్లిపోయారు అంతే.
ఫైనల్ థాట్
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, ప్రేమమ్ చిత్రాలు రాకముందు ఈ సినిమా వచ్చుంటే బాగుండేది..గొప్పగా అనిపించేది.
Rating:2.5
---- సూర్య ప్రకాష్ జోశ్యుల
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ తదితరులు
కథ, మాటలు: బి.వి.ఎస్.రవి
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్: పి.సి.శ్రీరామ్
ఎడిటర్ : నవీన్ నూలి
నిర్మాతలు : దిల్‌రాజు, శిరీష్
సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి
దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
విడుదల తేదీ : 22,జూలై 2022.