చైతూ ‘కస్టడీ’ తెలుగు మూవీ రివ్యూ
నాగ చైతన్య వెంకట్ ప్రభు ఊహించని విధంగా ఈ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమాలో నిజం కోసం వెతికే పోలీస్ గా నాగ చైతన్య కనిపిస్తారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో రివ్యూలో చూద్దాం.
Custody movie Review
యాక్షన్ సినిమాలు చెయ్యాలని ప్రతీ హీరోకు ఉంటుంది. అలాగే రొమాంటిక్, ఫ్యామిలీ సినిమాలు ఇమేజ్ ఉన్న అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన చైతుకు ఉంది. అప్పుడప్పుడూ అడపా దడపా యాక్షన్ సినిమాలు ట్రై చేస్తూనే ఉన్నాడు. అయితే తడాఖా తప్పించి ఏమీ కలిసి రాలేదు. ఇప్పుడు మరో సారి ‘కస్టడీ’ అంటూ ఛేజింగ్ లతో కూడిన ఓ యాక్షన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. సరోజ, ‘మానాడు’ , గోవా వంటి చిత్రాలతో ఆకట్టుకున్న కోలీవుడ్ దర్శకుడు వెంకట ప్రభు (Venkay prabhu movie)ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న చైతూ ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అక్కినేని అభిమానులను 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదని ఆల్రెడీ నాగ చైతన్య హామీ ఇచ్చారు. సో, ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు సక్సెస్ సాధిస్తుంది? కథేంటి, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? చూద్దాం. (Custody review)
Custody Movie Review
స్టోరీ లైన్:
1990లో జరిగే ఈ కథ సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ సిన్సియర్ కానిస్టేబుల్ (నాగచైతన్య) డ్యూటీ ని నిజాయితీగా చేసి ఓ నిజాన్ని బయిటపెట్టే ప్రాసెస్ లో ఏం జరిగింది..ఏ ఇబ్బందులు వచ్చాయనేది చెప్తుంది. ఓ రోజు శివ డ్యూటీ ముగించుకొని మరో కానిస్టేబుల్‌తో కలిసి వెళ్తూంటే ఓ కారు వచ్చి వీరి స్కూటర్‌ని గుద్దుతుంది. ఆ కారులో రాజు(అరవింద స్వామి), , సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ఉంటారు. రాజు బాగా మద్యం సేవించి ఉండడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకొస్తారు. అయితే రాజుని తెల్లారి సీబీఐ కోర్టులో హాజరు పరచాలని జార్జ్ చెప్తూంటాడు. అది శివ నమ్మడు. ఈ లోగా రాజు, జార్జ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారనే విషయం తెలుసుకొని ఐజీ నటరాజన్(శరత్ కుమార్) సీన్ లోకి వస్తాడు. అతనితో సహా కొంతమంది రౌడీలు స్టేషన్ కు వస్తాడు.
Custody Movie Review
వాళ్ల టార్గెట్ రాజుని చంపడమే.అందుకు శివ అడ్డుపడతాడు. తను ఎలాగైనా తెల్లారి కోర్టుకి రాజుని హాజరుపరుస్తానంటాడు.ఈ లోగా మరో విషయం రివీల్ అవుతుంది. ఐజీ నటరాజన్ ని పంపించింది మరెవరో కాదు ముఖ్యమంత్రి దాక్షాయణి(ప్రియమణి). ఆమెకు రాజుని అర్జెంటుగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది. అసలు రాజు ఎవరు..అతనికి ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్ ఏమిటి.. రాజుని చంపకుండా రక్షించిన శివ.. బెంగళూరు కోర్టులో హాజరు పరిచాడా? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఛాలెంజ్ లు ఏంటి?అలాగే ఈ కథకు డ్రైవింగ్ స్కూల్‌లో పనిచేసే రేవతి(కృతిశెట్టి) కి లింక్ ఏమిటి అనేదే మిగతా కథ.
Custody Movie Review
ఎనాలసిస్ :
అజిత్ తో గాంబ్లర్, రీసెంట్ గా మానాడు వంటి హిట్స్ ఇచ్చిన తమిళ డైరక్టర్ వెంకట ప్రభుకు ఇక్కడా అభిమానులు ఉన్నారు. ఆయన చిన్న ప్లాట్ తీసుకుని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో చెప్తారని పేరు. రేసీగా పరుగులు పెట్టే స్క్రీన్ ప్లే కు పేరు ఉన్న ఆయన ఈ సినిమాకు థియేటర్ నుంచి జనాలు బయిటకు పరుగులుపెట్టేలా స్క్రిప్టు రాసారు. కోర్ ఐడియాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా ముఖ్యమంత్రినే ఢీకొట్టి ఆమె రహస్యాలు బయిటపెట్టే వ్యక్తిని కోర్టుకు అప్పగించాలనుకోవటం ఇంట్రస్టింగ్ గానే ఉంది. అయితే ఆమె విలనా కాదా,అసలు ఈ కథలో విలన్ ఎవరు అనేది మనకు స్పష్టంగా ఎక్కడా చెప్పరు. దాంతో ఏదో ముసుగులో గుద్దులాటలా ,హీరో పోరాటం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ...సాగుతూంటుంది. ఎక్కడిక్కకడ ఫైట్స్, ఛేజ్ లు పెట్టుకున్నారే కానీ వాటిని కలిపే ఎమోషన్ ని తీసుకోలేదు. అరవింద్ స్వామి పాత్ర పూర్తి విలన్ గానూ మార్చలేదు. అలాగని నెగిటివ్ షేడ్స్ లేకుండాను లేవు. దాంతో హీరో తో మనం జర్నీ చేయటం కష్టమవుతుంది. అతను పరుగులు పెడుతుంటే ఎవరితో అతను ఫైట్ చేస్తున్నాడు..ఎవరిని సేవ్ చేస్తున్నాడు..ఎవరినుంచి సేవ్ చేస్తున్నాడనే క్లారిటీ దొరక్క మనం కన్ఫూజ్ అవుతూంటాయి.
Custody Movie Review
దానికి తోడు హీరోకు పర్శనల్ కాజ్ పెట్టాలని ఓ ప్లాష్ బ్యాక్ పెట్టారు. అది రెండు వారాల క్రితం వచ్చిన ఏజెంట్ ప్లాష్ బ్యాక్ ను గుర్తు చేసేలా సాగుతుంది. ఏదో వీడియో గేమ్ చూసినట్లు తీస్తే ఎలా ?మరోకటి ఈ సినిమా ఈ కథని తొంబైల్లో సెట్ చేయటం వలన కలిసొచ్చిందేమో తెలియదు. కొన్ని సార్లు అరవింద్ స్వామి హీరో అనుకుని జనం విజిల్స్ వేస్తున్నారంటే నాగచైతన్య క్యారక్టర్ ఎంత దారుణంగా డిజైన్ చేసారో అర్దమవుతుంది. ఇది చాలదన్నట్లు తమిళ హీరో రాంకీ ని తీసుకొచ్చి మొన్న కమల్ విక్రమ్ లాగ అతనో ఏజెంట్ అని బిల్డప్ ఇచ్చి గన్ ఫైట్ పెట్టారు. తమిళంలో విజిల్స్ పడటానికి ఈ ప్రయత్నం చేసారోమో ..అదేదో ఓ సీనియర్ తెలుగు హీరోని ఎవరినైనా తెచ్చినా బాగుండేది. అలాగే తమిళ హీరో జీవాని తమిళ మార్కెట్ కోసం తెచ్చినట్లు ఉన్నారు. అదీ జీవంలేని జీవితం చాలించే పాత్రే.
Custody Movie Review
ఇవన్నీ ఇలా ఉంటే మరో ప్రక్క కోర్టుకు హాజరపరచాటనికి టైమ్ ఇంకా పది గంటుల ఉంది, ఏడు గంటలు ఉంది అని అర్దం వచ్చేలా టైమ్ మెన్షన్ చేస్తూ వేయటంతో ..ఈ సినిమా పూర్తవటానికి ఇంకా ఆరు, ఏడు గంటలు టైమ్ ఉందేమో అనే భయం కూడా ఒక్క క్షణం కలుగుతుంది. విలన్స్ మూలంగా ఎలాగూ భయం పుట్టలేదు. ఈ టైమ్ వేయటం వల్ల ఆ రకంగా భయపెట్టాడు డైరక్టర్. ఏదైమైనా ఈ సినిమా కథంతా ఒకెత్తు..లవ్ ట్రాక్ ఒకెత్తు. ఆ లవ్ ట్రాక్ ఓ ట్రాప్ లాంటిదని..కావాలని డిజైన్ చేసారని నాకు అనిపించింది. లవ్ సీన్స్ బాగా బోర్ ఉంటే మిగతా యాక్షన్ సీన్స్ బోర్ కొట్టినా ...అబ్బే అంత బోర్ లేదని.పెద్ద గీత ముందు చిన్న గీత స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారని అనిపించింది.
Custody Movie Review
ఆ విధంగా నటించారు..
ఈ కథ తనలోని ఆర్టిస్ట్ ని బయిటకు తీసుకువస్తుందని చైతు ఒప్పుకుని ఉండవచ్చు. అదే జరిగింది కూడా. చాలా చోట్ల స్క్రిప్టు సహకరించకపోయినా తను మాత్రం సినిమాకు సహకరించాడు. తన నటనతో సీన్స్ లో బోర్ ని కూడా కొంత తగ్గించగలిగాడు. ఇక ఈ సినిమాలో కృతిశెట్టి ది నామ మాత్రపు పాత్ర. నన్ను పెళ్లి చేసుకో..చేసుకో..అని అరిగిపోయిన టేప్ రికార్డ్ లా (ఇది ఆ కాలం నాటి కథే)తిరుగుతూంటుంది. అంతకు మించి ఏమీ లేదు. వెన్నెల కిషోర్ క్యారక్టర్ అయితే ఇలాంటి హీరోయిన్ ని పెళ్ళి చేసుకోబోయి ఆగిపోయిన పెళ్లి కొడుకు క్యారక్టర్స్ తో గిన్నిస్ బుక్ ఎక్కాలనే ప్లాన్ ఉందేమో అని డౌట్ వస్తుంది. ఇక శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ఇలా సీజనర్ ఆర్టిస్ట్ లు నల్లేరుపై నడకలా చేసుకుంటూ పోయారు. పెద్దగా శ్రమపడకుండా.
టెక్నికల్ గా..
స్క్రిప్టు ఫెయిల్యూర్ అయిన సినిమా ఇది. దాంతో మిగతా శాఖలు ఎంత గొప్పగా ఉన్నా అవేమీ మనకు సంతృప్తి ఇవ్వవు. ఇక ఎంతో ఎక్సపెక్ట్ చేసే ఇళయరాజా పాటలు, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం రెండూ బాగోలేదు. పాటలు వచ్చినప్పుడు విసుగెత్తించే ఆ యాక్షన్ సీన్స్ బెస్ట్ అనిపిస్తాయి. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఇందులో ఎంత తగ్గిస్తే జనం అంత ఆనందపడుదురు. సెకండాఫ్‌లో ఇంక ఎప్పటికి అవ్వవా అనిపించే ట్రైన్ సీక్వెన్స్ వంటివి అయితే మరీను. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నచ్చినవి:
చైతూ, అరవింద్ స్వామి ఫెరఫార్మన్స్
కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు
నచ్చనవి:
ఎక్కడా రిలీఫ్ లేకపోవటం
థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు సరపడ కాన్సెప్టు లేకపోవటం
ఛేజ్ సీన్స్ రిపీట్ అవ్వటం
ఎంటర్టైన్మెంట్ లేకపోవటం
ఫైనల్ థాట్:
ఈ మాత్రం సినిమా మన తెలుగు డైరక్టర్స్ తీయలేరా....ప్లాఫ్ కావాలంటే ఇవ్వలేరా..ఇందుకు తమిళ దర్శకులనే తీసుకోవాలా?, చైతు లాంటి మంచి ఆర్టిస్ట్ ఎందుకిలా టాలెంట్ వృధా చేస్తున్నారు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: స్టన్ శివ, మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సమర్పణ: పవన్ కుమార్
Run time: 147 నిమిషాలు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేదీ: మే 12, 2023.