`మిరల్` మూవీ రివ్యూ, రేటింగ్
`ప్రేమిస్తే` భరత్ తాజాగా `మిరల్` చిత్రంతో వస్తున్నారు. వాణి భోజన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నేడుశుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`ప్రేమిస్తే` భరత్ తెలుగు ఆడియెన్స్ కి కనిపించి చాలా రోజులవుతుంది. ఆ సినిమా తర్వాత ఆయన ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండేళ్ల క్రితం `హిట్` చిత్రంలో మెరిసినా ఆ మూవీ ఆడలేదు. ఇప్పుడు తమిళ డబ్బింగ్ మూవీ `మిరల్`తో వస్తున్నాడు. భరత్‌కి జోడీగా వాణి భోజన్ నటించగా, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలో నటించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో సి హెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం(మే 17) విడుదలైంది. హర్రర్, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని భయపెట్టిందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
హరి(భరత్) ఓ కంస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఓ రోజు తన భార్య రమ(వాణి భోజన్)కి భయాంకరమైన కల వస్తుంది. రాత్రి కారులో ప్రయాణిస్తుండగా దెయ్యం తరహాలో మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తి హరిని కొట్టి పడేస్తాడు. ఆ తర్వాత కారు అద్దాలు పగలగొట్టి రమని కూడా కొట్టినట్టుగా కల వస్తుంది. దీంతో అప్పట్నుంచి రమ భయపడుతుంది. అంతేకాదు తన వెనకాల ఏదో తిరుగుతున్నట్టు, మాస్క్ వేసుకుని ఎవరో చంపడానికి వస్తున్నట్టుగా భయపడుతుంది. డాక్టర్‌కి చూపించగా అంతా నార్మల్‌గానే ఉంటుంది. భార్య కొడుక్కు ధైర్యం చెప్పి ఆఫీస్‌కి వెళ్తాడు హరి. అక్కడ కంస్ట్రక్షన్ వద్ద పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. పెద్ద పిల్లర్ తన కారుపై పడుతుంది. కొద్దిలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు హరి. దీంతో ఆ భయం నుంచి ఇంటికి వచ్చేస్తాడు హరి. ఆ సమయంలోనే తన అత్తగారు ఫోన్ చేస్తారు. ఆమెకి ముందే ఈ విషయం చెప్పడంతో జ్యోతిష్యుడికి చూపించగా, ఈ ఇద్దరి జాతకంలో దోషం ఉందని, కలిసి ఉంటే ప్రమాదం అని చెబుతాడు. దీంతో ఊర్లో ఇష్టదైవాన్ని మొక్కుకునేందుకు అత్తగారింటికి వస్తారు. అయితే ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది రమ తండ్రి(కేఎస్ రవికుమార్)కి నచ్చలేదు. దీంతో వారి మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ ఇన్నేళ్లకి కూతురు, అల్లుడు రావడంతో కాసేపట్లోనే కలిసిపోతారు. అంతేకాదు వారికి తన ఆస్తులు కూడా రాసిస్తారు. అయితే అర్జెంట్‌గా హరికి తమ క్లయింట్ నుంచి కాల్ వస్తుంది. ఆ రాత్రినే బయలు దేరాల్సి వస్తుంది. అర్థరాత్రి ఓ చోట రోడ్ డైవర్షన్ పెడతారు. దీంతో రాంగ్ రూట్‌లో వెళ్తారు. అక్కడ గతంలోనే ఓ ఫ్యామిలీని దెయ్యాలు చంపేశాయనే నానుడి ఉంటుంది. అయినా వినకుండా వెళ్తారు. మధ్యలోకి వెళ్లాక కారు పక్చర్ అవుతుంది. అప్పట్నుంచి వారిని దెయ్యం వెంటాడుతుంది. అక్కడి నుంచి హర్రర్ ఎలిమెంట్లు పీక్‌లోకి వెళ్తాయి. మరి దెయ్యం వీరిని ఎందుకు వెంటాడుతుంది? దాన్నుంచి భార్య, కొడుకుని కాపాడుకునేందుకు హరి ఏం చేశాడు? తన ఫ్రెండ్ తనకు చేసిన ద్రోహం మేంటి? హరి ఎలా కక్ష్య తీర్చుకున్నాడనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ఇటీవల కాలంలో హర్రర్ సినిమాల్లో దెయ్యానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానికి అన్యాయం జరగడంతో దెయ్యంగా మారి ఓ పాత పడాబడ్డ ఇంట్లో ఉంటూ ఆ భవంతిలోకి వచ్చిన వారిని వెంటాడుతుంది. వారిలోకి వచ్చి తాను ఎవరిపైనే అయితే పగ తీర్చుకోవాలనుకుంటుంది, ఆ పని చేస్తుంటుంది. ఈక్రమంలో హర్రర్ ఎలిమెంట్లు భయానకంగా ఉంటాయి. అయితే ఎంతగా భయపెడితే, హర్రర్ఎలిమెంట్లు పండితే సినిమా సక్సెస్ రేంజ్ ఆ స్థాయిలో ఉంటుంది. అందులో ట్విస్ట్ లు, టర్న్ లు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. అయితే దానికి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ ఫార్మాట్‌కి దూరంగా వెళ్లారు. అయితే హర్రర్ ఎలిమెంట్లతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. చివరి నిమిషం వరకు హర్రర్‌లా సాగుతుంది. ఆ తర్వాత థ్రిల్లర్ గా టర్న్ తీసుకుని రివేంజ్ డ్రామాగా ముగుస్తుంది. ఈ సరికొత్త పంథాని ఫాలో అయిన తీరు బాగుంది.
ఇక సినిమాలో హర్రర్ ఎలిమెంట్లు బాగా పండాయి. సినిమా కథకి మించిన హర్రర్ ఎలిమెంట్లతో భయటపెట్టారు మేకర్స్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ కథ పరంగా సక్సెస్ కాలేకపోయారు. కథ ఒకలా సాగి చివరికి ఇచ్చిన ట్విస్ట్ ఆడియెన్స్ కి మతిపోయేలా చేస్తుంది. అంతా తూచ్ అనేలా చేస్తుంది. ప్రారంభం నుంచే హర్రర్ ఎలిమెంట్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ని కొనసాగిస్తూనే మూవీని నడిపారు. ప్రారంభంలో కలలో వచ్చిన సీన్ నిజంగానే జరిగిందనేంతగా రక్తికట్టించి చివరకి అది కల అని చెప్పడంతో ఆ కిక్ మిస్ అవుతుంది. ఆ తర్వాత వాణి వెంట ఏదో పడటం కూడా కాసేపు భయపెడుతుంది. ఆ తర్వాత నార్మల్‌గానే సాగుతుంది. అదే సమయంలో కొంత అసహజంగా అనిపిస్తుంది. సీరియల్ ని తలపించేలా సన్నివేశాలు సాగుతాయి. స్లో నెరేషన్ కొంత చిరాకు పెడుతుంది.
మొదటి భాగంలో సస్పెన్స్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక సెకండాఫ్‌లో అసలు హర్రర్ ఎలిమెంట్లు వెంటాడుతుంటాయి. అర్థరాత్రిలో తిరుగు ప్రయాణంలో వీరు రాంగ్ రూట్‌లో వెళ్లడం, అక్కడ దెయ్యాలు ఎటాక్ చేయడం ఉద్యంతం ఉత్కంఠభరితంగా బయపెట్టేలా ఉంటుంది. కానీ చివర్లో ఇచ్చిన సినిమా ఆ భయం తాలుకూ ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఆడియెన్స్ ని ఫూల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఫైనల్‌గా జరిగిన కథ రివీల్ చేసినప్పుడు రివేంజ్ సన్నివేశాలకు జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా వేరేలా చెబితే బాగుండేది, కానీ హీరోహీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడమనేది పెద్ద మిస్టేక్‌గా చెప్పొచ్చు. అప్పటి వరకు ఉన్న హర్రర్ ఫీల్ మొత్తం పోతుంది. సినిమాపై ఆడియెన్స్ లో అభిప్రాయం కూడా మారిపోతుంది. మేకర్స్ అక్కడే పెద్ద తప్పు చేశారు. లేదంటే సినిమా మంచి హర్రర్ మూవీగా నిలిచేది. దీంతోపాటు చాలా లాజిక్‌లను వదిలేశారు. జాతకాల్లో దోషం, ఇష్టదైవాన్ని కొలవడం, అద్దం ఎలిమెంట్లకి సంబంధించిన అంశాలకు లాజికల్ గా లేవు. ఇవన్నీఆడియెన్స్ ని కన్‌ఫ్యూజ్ చేసే ఎలిమెంట్లుగా నిలిచిపోతాయి. వాటికి సరైన క్లారిటీ ఇవ్వలేదు.
నటీనటులుః
ఇందులో హరి పాత్రలో గౌతమ్ బాగా చేశారు. చాలా సెటిల్డ్ గా కనిపించాడు. భయపడే సీన్లుగానీ, దెయ్యం వెంబడించే సమయంలో ఆయన యాక్టింగ్‌గాని అదిరిపోయింది. సినిమాని సింగిల్‌గా తన భుజాలపై మోశాడని చెప్పచ్చు. ఇక రమ పాత్రలో వాణి భోజన్ కూడా బాగా చేసింది. భయపడే సీన్లలో ఆమె అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది. ఎంగేజ్ చేస్తుంది. కేఎస్ రవికుమార్ తన పాత్రని ఈజీగా చేశాడు. కానీ ఆయన డబ్బింగ్ చిరాకు పెట్టేలా ఉంది. ఇక హీరో ఫ్రెండ్గా రాజ్ కుమార్ ఓకే అనిపించాడు. ఆయన భార్యగా కావ్య ఫర్వాలేదనిపించింది. హీరోయిన్ తల్లి పాత్రలో మీరా కృష్ణన్ ఉన్నంతలో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
టెక్నీషియన్లుః
ఫ్రెండ్ చేసిన మోసాన్ని హర్రర్ ఎలిమెంట్ల రూపంలో చెప్పాలనుకునే దర్శకుడి ఆలోచన అభినందనీయం. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్‌లో ముగింపు పలికిన తీరు పెద్ద మిస్టేక్‌గా మారింది. సినిమాని నడిపించి తీరు విషయంలోనూ దర్శకుడు తన ప్రతిభ కనబరిచాడు. కానీ ట్విస్టే కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయాడు. అదే సినిమా ఫలితాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. ఆ విషయంలో మేకర్స్ ఇంకా బెటర్ ఆలోచన చేయాల్సింది. సినిమాకి ప్రసాద్ ఎస్‌ఎస్ మ్యూజిక్, బీజీఎం పెద్ద ప్లస్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశారు. ఆడియెన్స్ ని బయటపెట్టడంలో సక్సెస్ అయ్యింది. సురేష్ బాలా కెమెరా వర్క్ బాగుంది. రాత్రి సమయంలో సీన్లు చాలా సహజంగా ఉన్నాయి. సినిమా నిడివి తక్కువే. అది రిలీఫ్‌నిచ్చే అంశంగా చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్‌గాః `మిరల్` భయపెట్టి తూచ్ అనిపించినట్టుగా ఉంది.
రేటింగ్‌ః 2.25
నటీనటులు : భరత్, వాణి భోజన్, K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు.
టెక్నీషియన్లుః
బ్యానర్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్పణ : శ్రీమతి. జగన్మోహిని & జి డిల్లి బాబు
నిర్మాత : సిహెచ్ సతీష్ కుమార్
దర్శకుడు: ఎం శక్తివేల్
కథ-స్క్రీన్ ప్లే: ఎం శక్తివేల్
మ్యూజిక్ కంపోజర్: ప్రసాద్ ఎస్ ఎన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ బాలా
ఎడిటర్: కలైవానన్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: మణికందన్ శ్రీనివాసన్
యాక్షన్ కొరియోగ్రఫీ : డేంజర్ మణి
కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీదేవి గోపాలకృష్ణన్
కాస్ట్యూమర్: M మొహమ్మద్ సుబియర్
మేకప్: వినోద్ సుకుమారన్
VFX సూపర్‌వైజర్: కిరణ్ రాఘవన్ (రెసోల్ FX)
ఆడియో : థింక్ మ్యూజిక్
PRO : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)