- Home
- Entertainment
- Movie Reviews
- Mass Jathara Movie Review: మాస్ జాతర మూవీ రివ్యూ, రేటింగ్.. రవితేజ ఇలా చేస్తాడనుకోలే !
Mass Jathara Movie Review: మాస్ జాతర మూవీ రివ్యూ, రేటింగ్.. రవితేజ ఇలా చేస్తాడనుకోలే !
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన `మాస్ జాతర` మూవీ శుక్రవారం సాయంత్రం నుంచి విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? రవితేజకి కమ్ బ్యాక్ ఇచ్చిందా అనేది చూద్దాం.

మాస్ జాతర మూవీ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో అనే టాక్ ఉండేది. ఆయన సినిమాలు మినిమమ్‌గా ఆడేవి. కానీ ఇటీవల కాలంలో ఆ టాక్ పోయింది. ఆయన సినిమాలు రొటీన్‌గా ఉంటున్నాయనే విమర్శ ఉంది. పైగా వరుసగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేస్తున్నాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో `మాస్ జాతర` అనే చిత్రంలో నటించారు. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించడం విశేషం. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సాయి సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం (అక్టోబర్ 31) సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో విడుదలైంది. నిజానికి శుక్రవారం ఉదయం నుంచే షోస్ పడాల్సి ఉంది. కానీ `బాహుబలి ది ఎపిక్` కోసం ఒక్క రోజు గ్యాప్ ఇచ్చారు. ఎట్టకేలకు ఈ సాయంత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ అలరించేలా ఉందా? రవితేజకి హిట్ పడిందా? శ్రీలీల మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మాస్ జాతర మూవీ కథ ఏంటంటే?
లక్ష్మణ్(రవితేజ) రైల్వే ఇన్‌స్పెక్టర్. వరంగల్‌లో డ్యూటీ చేస్తుంటాడు. చాలా స్టిక్ట్ ఆఫీసర్ కూడా. ఆయనకు అమ్మానాన్న లేరు. తాత(రాజేంద్రప్రసాద్)తో కలిసి ఉంటాడు. తాత చాలా రొమాంటిక్. తన ఏజ్ గ్రూప్ ఆడవాళ్లతో పులిహోర కలుపుతుంటాడు. లక్ష్మణ్‌కి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి కాలేదు. తాతనే అన్ని సంబంధాలు చెడగొడుతుంటాడు. ఎందుకంటే లక్ష్మణ్ పెళ్లి చేసుకుంటే తనని దూరం పెడతాడని, ఓల్డేజ్ హోమ్ లో ఉంచుతాడేమో అనే భయం. అయితే లక్ష్మణ్‌కి అల్లూరి జిల్లాలోని అడవివరంకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆ ఏజెన్సీ ప్రాంతమంతా గంజాయి స్మగ్లర్ శివుడు(నవీన్ చంద్ర) కంట్రోల్‌లో ఉంటుంది. అతను చాలా క్రూరమైన వ్యక్తి. ఆయన పేరు చెబితేనే అందరికి హడల్. పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. తనకు ఎదురు తిరిగిన పోలీస్‌లను లేపేస్తుంటాడు శివుడు. అందుకే ఎవరూ ఆయనతో పెట్టుకోరు. ఇద్దరు ఎస్‌ఐలు అలాంటి సాహసం చేయగా, వారిని దారుణంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్.. శివుడిని ఎదుర్కోవాలనుకుంటాడు. గంజాయిని రైల్వేల్లో సరఫరా చేస్తున్నారని తెలిసి దాన్ని పట్టుకుంటాడు. దీంతో విషయం శివుడికి తెలుస్తుంది. మరి శివుడు ఏం చేశాడు? శివుడిని లక్ష్మణ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో తులసి(శ్రీలీల) ఏం చేస్తుంది? ఆమె పాత్రలోని ట్విస్ట్ ఏంటి? రైల్వే పోలీస్ అయిన లక్ష్మణ్.. ఇతర విషయాల్లో ఎందుకు ఇన్ వాల్వ్ అవుతున్నాడు? తన వెనుక ఎవరున్నారు? చివరికి శివుడిని లక్ష్మణ్ ఎలా ఎదుర్కొన్నాడనేది మిగిలిన సినిమా.
మాస్ జాతర మూవీ విశ్లేషణః
ప్రస్తుతం రెగ్యూలర్ కమర్షియల్ మూవీస్‌కి కాలం చెల్లింది. అలాంటి చిత్రాలను ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. చాలా కొత్త కాన్సెప్ట్ తో కూడిన చిత్రాలు, థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్, మంచి కామెడీ చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. మైథాలజీ, ఫాంటసీ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఈ క్రమంలో వాటిని కాదని పూర్తి కమర్షియల్ పంథాలో రూపొందిన మూవీ `మాస్ జాతర`. వింటేజ్ రవితేజని ఆవిష్కరిస్తూ దర్శకుడు భాను భోగవరపు ఈ మూవీని రూపొందించారు. రవితేజ మాస్, కామెడీ స్టయిల్‌ని, ఆయన వింటేజ్ డాన్సులను, డాన్సులే కాదు, పాటలను కూడా పెట్టి ఈ మూవీని రూపొందించారు. కథ పరంగా చాలా రెగ్యూలర్ కమర్షియల్ మూవీని తలపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం దర్శకుడు చాలా వరకు కష్టపడ్డాడు. కామెడీ, ఫైట్లు, అదిరిపోయే పాటలు ఇలా అన్నింటిని సమపాళ్లలో మేళవించి ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో కామెడీ పరంగా కొంత వరకు బాగానే అనిపించింది. కథ సాగే విధానం ఊహించేలా ఉంది. రెగ్యూలర్, రొటీన్ మూవీ అనిపించుకుంది. రవితేజ చాలా వరకు తన మార్క్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. వింటేజ్ కామెడీతో అలరించారు. అందులోనూ `ఇడియట్`ని ఎక్కువగా ఫాలో అయినట్టు తెలుస్తోంది. స్టయిల్, మ్యానరిజం, యాక్షన్, పాటలు, డైలాగులు, చివరికి డాన్సులు కూడా అదే స్టయిల్‌ని ఫాలో కావడం విశేషం. కాకపోతే చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి అలాంటి సీన్లు రావడంతో అభిమానులు, ఆడియెన్స్ వాటిని ఎంజాయ్ చేస్తారు. పాత సినిమాల పాటలు ఆకట్టుకుంటాయి.
మాస్ జాతర మూవీ హైలైట్స్, మైనస్‌లు
ఫస్టాఫ్ అంతా కామెడీతోపాటు యాక్షన్‌తో సాగుతుంది. రవితేజ, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. డైలాగ్ లు ట్రెండీగా ఉంటాయి. నేటి జనరేషన్‌ని ప్రతిబింబించేలా ఉన్నాయి. అవి యూత్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ ముందు యాక్షన్ సీన్ ఆకట్టుకుంది. శ్రీలీలతో లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. కానీ ఆమె పాత్రలోని ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. అది ఎక్కువ కామెడీని పంచిందని చెప్పొచ్చు. సెకండాఫ్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. కథ సీరియస్‌గా వెళ్తోంది. మెయిన్ విలన్ ఎంట్రీఇవ్వడం, ఆయనతోనే గొడవకు దిగడం, వార్నింగ్‌లు ఇచ్చుకోవడం ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌లో హైపర్ ఆది, అజయ్ ఘోష్‌లతో రవితేజకి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. జాతర సీన్ హైలైట్‌గా నిలుస్తుంది.
అయితే సినిమా కథ చాలా రొటీన్. నేపథ్యం మారింది గానీ, కథనం పాతదే. దీంతో రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. కథలో మెయిన్ ఎమోషన్ తగ్గిపోయింది. కామెడీ కూడా చాలా చోట్ల బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది. కామెడీ సీన్లు పండలేదు, అందులోనూ సహజత్వం మిస్ అయ్యింది. ఎమోషనల్ సీన్లు పండలేదు. వార్నింగ్ సీన్లలోనూ డ్రామా తగ్గిపోయింది. సీన్ బై సీన్ పేర్చుకుంటూ పోయారు తప్పితే, కంటిన్యూటీ లేదు. వాటిలో ఫీల్ లేదు. అందుకే ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు. వింటేజ్ రవితేజని చూపించినా, కథ, కథనం పాతదే కావడంతో ఆ కిక్ మిస్ అయ్యింది.
మాస్ జాతర నటీనటుల ప్రదర్శన
లక్ష్మణ్ పాత్రలో రవితేజ రెచ్చిపోయారు. ఫన్నీగా ఉంటూనే సీరియస్‌గా మారడం, ప్రత్యర్థులను ఎదుర్కోవడం, యాక్షన్ సీన్లలో రెచ్చిపోయారు రవితేజ. డాన్సుల్లో మాత్రం అదరగొట్టారు. `ఇడియట్` మూవీని గుర్తు చేశారు. కొన్నిచోట్ల `విక్రమార్కుడు` స్టయిల్‌ని చూపించాడు. ఏదేమైనా మాస్ మహారాజా అదరగొట్టాడు. శ్రీలీల పాత్ర అలరిస్తుంది. నవ్విస్తుంది. ఆమె పాత్రలోని ట్విస్ట్ నవ్వులు పూయిస్తుంది. ఆమె తండ్రిగా నరేష్ ఆకట్టుకున్నారు. నవ్వించే ప్రయత్నం చేశాడు. శివుడిగా నవీన్ చంద్ర వాహ్ అనిపించాడు. భయంకరంగా కనిపించారు. భయపెట్టించారు. ఎస్ ఐగా మురళీ శర్మ బాగా చేశాడు. హైపర్ ఆది, అజయ్ ఘోష్‌ల కామెడీ నవ్విస్తుంది. సముద్రఖని కాసేపు మెరిశారు. బుల్లితెర స్టార్స్ భరణి, ఇమ్మాన్యుయెల్, రచ్చ రవి, నవ్యసామి కాసేపు మెరిసినా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
మాస్ జాతర మూవీ టెక్నీషియన్ల పనితీరు
భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఫర్వాలేదు. పాటలు మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. `ఇడియట్`లోని పాటని రీమిక్స్ చేసిన తీరు బాగుంది. దాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ లోని పాటలు కూడా అలరిస్తాయి. బిజీఎం కొన్ని చోట్ల బాగుంది. మరికొన్ని సీన్లలో రొటీన్‌గా ఉంది. విధు అయ్యన్న కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. అయితే ఫీల్, ఎమోషన్స్ మిస్ అయ్యాయి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు భాను భోగవరపుకిది తొలి మూవీ. ఇప్పుడు కొత్త దర్శకులు తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు డిఫరెంట్ కథలతో వస్తున్నారు. కానీ భాను మాత్రం రెగ్యూలర్ కమర్షియల్ మూవీతో రావడం ఆశ్చర్యపరుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్లని బాగా డీల్ చేశారు. కానీ కామెడీ, ఎమోషన్స్ లో సక్సెస్ కాలేకపోయారు. డ్రామాని పండించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ మూవీ రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది, కానీ సాధారణ ఆడియెన్స్ అంతగా ఎక్కదని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
`మాస్ జాతర` రెగ్యూలర్ కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ. కొన్ని సీన్లలో రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు.
రేటింగ్: 2.5