`మంజుమ్మల్ బాయ్స్` మూవీ తెలుగు వెర్షన్ రివ్యూ, రేటింగ్
మలయాళంలో సంచలన విజయం సాధించిన `మంజుమ్మల్ బాయ్స్` చిత్రం తెలుగులో విడుదలైంది. మరి అక్కడిలాగా ఇక్కడి ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో చూద్దాం.
మలయాళ చిత్రాలు మరోసారి సౌత్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మంచి కంటెంట్‌తో వచ్చి పెద్ద హిట్ సాధిస్తున్నాయి. ఇటీవల `ప్రేమలు` చిత్రం ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడు మరో ఇండస్ట్రీ హిట్ సినిమా `మంజుమ్మల్ బాయ్స్` కూడా వచ్చింది. ఇది మలయాళంలో తెరకెక్కి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. రెండు వందల కోట్లు వసూలు చేసింది. మలయాళంలో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో డబ్ చేశారు. శనివారం(ఏప్రిల్ 6న) ఈ మూవీ విడుదలైంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మరి మలయాళంలో ఆకట్టుకున్నట్టుగా తెలుగులో మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
కేరళాలోని మంజుమ్మల్ ప్రాంతంలోని ఫ్రెండ్స్ అంతా రోజూ సరదాగా గడుపుతుంటారు. వీరు ఫ్రెండ్ పెళ్లిలో అవతలి టీమ్‌తో గొడవపడి తాడు లాగే పోటీ పెట్టుకుంటారు. అందులో ఓడిపోతారు. ఇక రోజు ఓ హోటల్ వద్ద చేరి బతకానీలు కొడతారు. ఈ క్రమంలో వాళ్లు టూర్ ప్లాన్ చేస్తారు. అనేక ప్రాంతాలు అనుకుని కొడైకెనాల్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. పది మంది కలిసి సుమోలో కొడైకెనాల్ టూర్ వెళ్తారు. ఈ పది మంది పలు రకాలుగా ఉంటారు. కొడైకెనాల్ టూర్ అయిపోయాక పక్కనే ఉన్న గుణ కేవ్స్ కి వెళ్లాలనే ఆలోచన వస్తుంది. అందులోనూ ప్రమాదకరమైన ప్రాంతమైన కేవ్స్ లోపలికి వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్(శ్రీనాథ్ భాషి) అనే స్నేహితుడు కాలు జారి గుహలో పడిపోతాడు. దీంతో ఫ్రెండ్స్ అందరికి చెమటలు పడతాయి. స్థానిక గార్డ్, గైడ్, ఫోటోగ్రాఫర్ ఇలా అంతా మీ ఫ్రెండ్ తిరిగి రాలేడు, అతను చనిపోయినట్టే అని, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని హెచ్చరిస్తారు. కానీ ఫ్రెండ్‌ని తీసుకునే వెళ్తామని కూర్చుంటారు. పోలీస్‌లను, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్‌ని తీసుకొస్తారు. దీంతో ఫ్రెండ్‌ని కాపాడేందుకు చర్యలు చేపడతారు. పోలీసులు లోపలికి వెళ్లేందుకు భయపడుతుంటారు. దీంతో వారి ఫ్రెండే ఆ సాహసం చేస్తాడు. మరి ప్రాణాలకు తెగించి గుహలోపలికి వెళ్లిన స్నేహితుడు ఎవరు? గుహలో పడిపోయి ఫ్రెండ్ గతం తాలుకూ అనుభవాలేంటి? లోపలికి వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చాడా? ఫ్రెండ్‌ని కాపాడుకున్నారా? లేదా? ఆ కేవ్స్ కి, కమల్ హాసన్‌కి సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`మంజుమ్మల్ బాయ్స్` సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సంచలనాలు సృష్టించిన మూవీగా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసింది. అక్కడి సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ లకు సాధ్యం కాని రికార్డులను తిరగరాసింది. పైగా ఇందులో ఎవరూ నోటెడ్ నటుడు లేరు. హీరోగా చెప్పుకునే వాళ్లు ఎవరూ లేరు, అంతా కొత్తవాళ్లే. కంటెంట్ కింగ్ అని నిరూపించింది. మలయాళంలో ఆకట్టుకున్న సినిమాలు ఆల్మోస్ట్ తెలుగు ఆడియెన్స్ ని కూడా అలరిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో మూవీస్ నిరూపించుకున్నాయి. మరి ఆ జాబితాలో `మంజుమ్మల్ బాయ్స్` చేరుతుందా? అంటే కాస్త కష్టమనే చెప్పాలి. అక్కడ ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసింది, కానీ తెలుగు ఆడియెన్స్ కి మాత్రం ఇదేమీ గొప్ప సినిమాగా అనిపించుకోదు. తెలుగులో వచ్చే ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ఒకటిగానే ఉంటుందని చెప్పొచ్చు.
సినిమా మొదటి భాగం మొత్తం కన్‌ఫ్యూజన్, చిరాకుగానే సాగుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఫ్రెండ్ గుహలో పడేంత వరకు సినిమా ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. గుహలో పడ్డాకే అందరి అటెన్షన్ దానివైపు వెళ్తుంది. అప్పటి వరకు అంతా అయోమయంగా అనిపిస్తుంది. స్థానిక నెటివిటీ ప్రధానంగా సాగడంతో అవి మనకు అంతగా ఎక్కవు. ఇక గుణ కేవ్స్ లో ఫ్రెండ్ పడిపోవడంతో కథలో సీరియస్ నెస్ కనిపిస్తుంది. ఆడియెన్స్ కి కూడా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ క్రియేట్ అవుతుంది. అంతలోనే ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ మొత్తం ఫ్రెండ్‌ని కాపాడుకునేందుకు ఇతర ఫ్రెండ్స్ ఎంతగా తపిస్తారనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఎలా కాపాడుకోవాలో తెలియక, ఇతర వ్యక్తులు చెప్పే మాటలతో వాళ్లు భయపడిపోవడం ఆసక్తిని పెంచుతుంది. ఇక పోలీసుల వద్దకు వెళితే ఇన్‌స్పెక్టర్ కొట్టడం, అయినా ఫ్రెండ్ కోసం వాళ్లు నిలబడిన తీరు ఆకట్టుకుంటుంది. పోలీసులు, డిజాస్టర్ టీమ్ వచ్చి సహాయక చర్యలు చేపట్టే తీరు కాస్త ఎంగేజ్ చేస్తుంది, ఆ తర్వాత ప్రాసెస్ అంతా సాగదీతగా అనిపిస్తూ గ్రిప్ తప్పింది. మిగిలిన ఫ్రెండ్స్ అంతా కలిసి తాడుని వదలడం, లాగే సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. అలాగే ఫ్రెండ్‌ని కాపాడుకునేందుకు గుహలోపలికి నీళ్లు పోకుండా ఆపేందుకు చేసే ప్రయత్నం కూడా ఎమోషనల్‌గా అనిపిస్తుంది.
సింపుల్ స్టోరీని ఎంగేజింగ్‌గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఉత్కంఠంగా, ఎమోషనల్‌గా డ్రైవ్ చేసిన తీరు బాగుంది. అయితే తెలుగు ఆడియెన్స్ కి ఇది గొప్ప మూవీగా అనిపించుకుంటుందా? అంటే డౌటే అని చెప్పాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో సినిమాలు చూస్తున్నారు. బయట ప్రచారం జరిగిందంత, ప్రచారం చేసినంత మ్యాటర్ సినిమాలో లేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది ముందే ఊహించేలా ఉంటుంది. సుభాష్‌ని కాపాడేందుకు, మరో ఫ్రెండ్ లోపలికి వెళ్లడం, అక్కడ ఆయన కష్టంగా స్పందించడం, తాడు ఇరుక్కోవడం ఇవన్నీ ఊహించేవే, కాకపోతే లోయలో పడటం, ఒక ఫ్రెండ్ కోసం మిగిలిన స్నేహితులు నిలబడటం, సమస్య కొత్తది కావడమే ఇందులో స్పెషాలిటీ. అంతకు మించి సినిమాలో ఏం లేదు. చాలా లాజిక్ లెస్. కంటెంట్ ఎర్రర్స్ చాలా ఉన్నాయి. 120 అడుగుల లోయలో పడితే బతకడం కష్టం, అది సినిమాటిక్ లిబర్జీ అనుకుందాం, పోయేవాడు కూడా కనీసం ఆక్సీజన్ పెట్టుకోకుండా వెళ్లడం ఆశ్చర్యంగా ఉంటుంది.
నటీనటులు,టెక్నీషియన్లుః
సినిమాలో ఒకరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పలేము. అంతా చాలా సహజంగా చేశారు. కొత్తవాళ్లు, కొత్తవాళ్లలాగే బిహేవ్ చేశారు. ఇందులో అంతా కొత్త వాళ్లు కావడమే సినిమా సినిమా సక్సెస్‌కి కారణం. ఇక గుహలో పడిపోయిన సుభాష్‌గా శ్రీనాథ్ భాషి చాలా బాగా చేశాడు. మొదట్నుంచి ఆయన ప్రవర్తన వింతగానే కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్‌ని కాపాడిన సౌబిన్ షాహిర్ నటన ఆకట్టుకుంటుంది. పెద్దవాడిలా హుందాగా చేశాడు. ఫ్రెండ్ కోసం నిలబడ్డాడు. మిగిలిన పాత్రదారులు ది బెస్ట్ ఇచ్చారు. సినిమాలో కెమెరా వర్క్ స్పెషల్‌గా ఉంటుంది. ప్రారంభంలో కాస్త డల్‌గా అనిపిస్తుంది. కథలో ఇన్‌వాల్వ్ అయ్యాక ఆ లోటు తెలియదు. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం బాగుంది. సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. అలాగని పెద్ద హడావుడి చేసినట్టు ఉండదు, సింపుల్‌గా, లైన్ దాటకుండా, కథని నడిపించేలా డీసెంట్‌గా ఉంది. దర్శకుడు చిదంబరం తన టాలెంట్‌ని చూపించాడు. చిన్న బడ్జెట్‌లో ఒక కథని ఎంత ఈజీగా చెప్పొచ్చో నిరూపించాడు. టెక్నీకల్‌గా ఈ మూవీ తీయడం కాస్త కష్టమే, ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. స్లో నరేషన్ మైనస్‌గా నిలుస్తుంది.
ఫైనల్‌గాః `మంజుమ్మల్ బాయ్స్` మలయాళంలో మెప్పించినంతగా, తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అంటే డౌటే. మన ఆడియెన్స్ కిది ఓటీటీ ఫిల్మ్ లాగే అనిపిస్తుంది.
రేటింగ్‌ః 2.5
నటీనటులుః సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, జీన్ పాల్ లాల్, చందు సలీం కుమార్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహ్మన్.
మ్యూజిక్‌ః సుశిన్ శ్యామ్
కెమెరాః సైజు ఖలీద్
దర్శకత్వంః చిదంబరం