- Home
- Entertainment
- Movie Reviews
- `లిటిల్ హార్ట్స్` మూవీ రివ్యూ, రేటింగ్.. మౌళి ఫన్ వర్కౌట్ అయ్యిందా?
`లిటిల్ హార్ట్స్` మూవీ రివ్యూ, రేటింగ్.. మౌళి ఫన్ వర్కౌట్ అయ్యిందా?
మౌళి తనుజ్, శివానీ నగరం జంటగా నటించిన `లిటిల్ హార్ట్స్` మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

`లిటిల్ హార్ట్స్` మూవీ రివ్యూ
సోషల్ మీడియాలో పాపులర్ అయిన మౌళి తనుజ్ `90 మిడిల్ క్లాస్ బయోపిక్` చిత్రంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు `లిటిల్ హార్ట్స్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీవాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. నేడు శుక్రవారం(సెప్టెంబర్ 5) విడుదలైన ఈ మూవీని గురువారం రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ లో ఏఏఏలో వీకించాను. టీనేజ్ ఫన్‌తో వచ్చిన ఈ మూవీ ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`లిటిల్ హార్ట్స్` కథ ఏంటంటే?
అఖిల్(మౌళి)కి చదువు అబ్బదు, పెద్ద అవారా బ్యాచ్. కానీ అఖిల్‌ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చూడాలనేది వాళ్ళ నాన్న గోపాల్ రావు (రాజీవ్ కనకాల)కల. చదువు ఎక్కక అత్తెసరు మార్కులతో ఇంటర్ పాస్ అవుతాడు. కానీ ఎంసెట్‌లో తప్పుతాడు. దీంతో అప్పటి వరకు ఉన్న లవర్ కూడా హ్యాండిస్తుంది. ఇంజనీరింగ్ చేసి, సాఫ్ట్ వేర్ కావాలని వాళ్ల నాన్న బలవంతంగా ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తాడు. కోచింగ్ సెంటర్లో కాత్యాయని(శివాని) పరిచయం అవుతుంది. ఆమెకి తొలి చూపులోనే పడిపోతాడు అఖిల్. కాత్యాయనికి బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ కావడంతో వారి ఒత్తిడి మేరకు తను కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కాత్యాయని మధ్య క్లోజ్ నెస్ పెరగడంతో తనకి ప్రపోజ్ చేస్తాడు అఖిల్. కానీ తను అఖిల్ కంటే మూడేళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. అఖిల్ హార్ట్ బ్రేక్ అవుతుంది. మరి నచ్చిన పిల్ల కోసం, నచ్చని ఇంజనీరింగ్ కోసం అఖిల్ ఏం చేశాడు? కాత్యాయనిని పడేయడం కోసం అఖిల్ ఏం చేశాడు? చివరికి వీరి లవ్ ట్రాక్ ఎలాంటి టర్న్ లు తిరిగింది. నచ్చిన కెరీర్ కోసం ఈ ఇద్దరు ఏం చేశారు? ఈ చిన్న గుండెల ప్రేమ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.
`లిటిల్ హార్ట్స్` మూవీ విశ్లేషణ
కాలేజ్ టీనేజ్ కుర్రాళ్ల కథలతో వచ్చే సినిమాలకు కథలతో సంబంధం లేదు. కామెడీ వర్కౌట్ అయితే చాలు. ఆడియెన్స్ కి నచ్చుతుంది. సందర్భానుసారంగా జనరేట్ అయ్యే కామెడీ, డైలాగ్‌తో కూడిన కామెడీ చాలా సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. `జాతిరత్నాలు`, `టిల్లు స్వ్కేర్`, `మ్యాడ్` సినిమాలు ఈ కోవకు చెందినవే. వీటిని నిబ్బా నిబ్బి కామెడీ అంటుంటారు. కథ లేకుండా జస్ట్ రోస్టింగ్ కామెడీతో, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో పంచ్‌లు వేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంటారు. ఇలాంటి సినిమాలు యువతని బాగా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఎక్కడం కష్టం కానీ, టీనేజ్ కుర్రాళ్లు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి కామెడీతో వచ్చిన సినిమానే `లిటిల్ హార్ట్స్`. నేటి యువతరాన్ని బేస్ చేసుకుని వారు ఎలా బిహేవ్ చేస్తారు? వారి చదువులు, ప్రేమలు, ఫ్రెండ్స్ తో దోస్తానం ఎలా ఉంటుందనేది ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ ఎక్కువగా జీయో సిమ్‌ల హవా సాగే సమయంలో నడుస్తుంది. వాట్సాఫ్ లు లేని సమయంలో ఫేస్ బుక్‌లో చాటింగ్ చేసుకునే టైమ్‌లో నడుస్తుంది. ఆ సమయంలో ఫేస్ బుక్‌లో చాటింగ్, ఫ్రెండ్స్ తో రాయబారాలు, ఫ్రెండ్స్ అంతా కలిసి వేసేచిల్లర వేషాలు ? బస్ పాస్ లేకపోయినా బిల్డప్ కొట్టడాలు, షాప్‌కి వెళ్లి చాక్లెట్లు కొట్టేయడాలు ఇవన్నీ అంతే సహజంగా, అంతే ఫన్నీగా చూపించారు. చాలా వరకు ఇలాంటి చదువు రానీ, పేరెంట్స్ కోసం ఇష్టం లేని చదువులు చదివే పిల్లలు ఉంటారు. వీరంతా చదువును పక్కన పెట్టి పోరీలకు లైన్ వేయడం, వారిని ప్రేమలో పడేయడం చేస్తుంటారు. ఈ సినిమా మొత్తం ఈ ఎలిమెంట్ల చుట్టూనే తిరుగుతుంది. అఖిల్ జర్నీని తెలియజేస్తుంది. తండ్రి సాఫ్ట్ వేర్ అని కలలు కంటుంటే, ఇష్టం లేని చదువు చదవలేక తనకు ఇష్టమైన పనులు చేస్తూ అఖిల్ పాత్ర చేసే డ్రామాలు, చిల్లర వేషాలు, లవర్స్ కోసం అబద్దాలు చెప్పడం, చదువుతున్నట్టుగా యాక్ట్ చేయడం వంటి అంశాలను ఇందులో చాలా సహజంగా చూపించారు. చాలా మంది స్టూడెంట్స్ కి ఈ అంశాలు బాగా కనెక్ట్ అవుతాయి. అదే సమయంలో లవ్ స్టోరీ కూడా చాలా సహజంగా ఉంది. కోచింగ్ సెంటర్లలో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
`లిటిల్ హార్ట్స్` హైలైట్స్, మైనస్‌లు
సినిమా ఫస్టాఫ్ రియాలిటీకి దగ్గరగా ఉండే సన్నివేశాలతో కామెడీని బాగా రాసుకున్నారు. పంచ్ డైలాగ్‌లతో సాగే ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. టీనేజ్‌లో లవ్ ట్రాక్, పేరెంట్స్ ఒకటి కోరుకుంటే, పిల్లలు మరోటి చేయడం వంటి సన్నివేశాలు, పేరెంట్స్ నుంచి తప్పించుకునేందుకు, వారిని కళ్లు కప్పి చేసే ఎదవ వేషాలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. సినిమా ఫస్టాఫ్ అంతా హిలేరియస్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ లో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈ సందర్భంగానూ ఫన్ బాగానే పండింది. ఇక సెకండాఫ్‌లోనూ ప్రేమ కోసం పడే బాధలు, ప్రయత్నాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే అక్కడ కాస్త జోరు తగ్గింది. ఆ స్థాయి ఫన్ వర్కౌట్ కాలేదు. కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక చాలా సన్నివేశాల్లో ఫస్ జనరేట్ అయినా ఆ డోస్ తగ్గిపోయింది. అయితే సినిమాలో మౌళి పాత్ర చేసే అల్లరి కంటే అతని ఫ్రెండ్ మధు పాత్ర చేసిన కుర్రాడి కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కామెడీకి అసలైన హీరో అతనే అని చెప్పాలి. అతను చేసే పంచ్ డైలాగ్‌లతోనే కామెడీ వర్కౌట్ అయ్యింది. అతనే సినిమాని తనభుజాలపై మోశాడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మౌళి తమ్ముడి లవ్ ట్రాక్ కూడా హిలేరియస్‌గా ఉంటుంది. ఆ సమయంలోనూ మధు పాత్ర వేసే పంచ్ లు బాగా పేలాయి. దీనికితోడు నచ్చని పని చేయోద్దని, నచ్చని చదువులు చదవొద్దు అని, పేరెంట్స్ కూడా తమ ఇష్టాలను పిల్లలపై రుద్దొద్దు అని చెప్పే సందేశం బాగుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్నంత ఫన్ సెకండాఫ్‌లో మిస్ అయ్యింది. కొంత డైవర్ట్ లాగా అనిపిస్తుంది. మరోవైపు సినిమాలో కథ ఆశించలేం. ఇంకోవైపు డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఓవర్‌గా ఉన్నాయి. కామెడీ పరంగా వర్కౌట్ అయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడేలా ఉన్నాయి.
`లిటిల్ హార్ట్స్` మూవీలోని నటీనటుల పర్‌ఫెర్మెన్స్
అఖిల్ పాత్రలో మౌళి తనుజ్ అదరగొట్టాడు. తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు. సినిమాని హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చాడు. తన నటన, డైలాగ్‌లు, ఎక్స్ ప్రెషన్స్ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రేమ కోసం తను పడే పాట్లు, పేరెంట్స్ ని మేనేజ్ చేసేందుకు చేసే దొంగపనులు, ఫ్రెండ్స్ తో చేసే అల్లరి, బిల్డప్‌లు వంటి సీన్లలో రెచ్చిపోయాడు. ఇక కాత్యాయని పాత్రలో శివానీ నగరం చాలా బాగా చేసింది. ఓపెన్ అయి నటించింది. అంతే బాగా కామెడీ పండించింది. ఇక మౌళి ఫ్రెండ్ మధు పాత్రలో నటించిన కుర్రాడు మాత్రం రెచ్చిపోయాడు. తన పంచ్ డైలాగ్‌లు, సెటైర్లతో నవ్వులు పూయించాడు. సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. మౌళిని డామినేట్ చేశాడు. మౌళి తండ్రిగా రాజీవ్ కనకాల పాత్ర కూడా అదిరిపోయేలా ఉంది. నవ్వులు పూయించేలా ఉంటుంది. మదర్‌గా అనితా చౌదరి చాలా బాగా చేసింది. ఇక హీరోయిన్ తండ్రిగా కాంచి అదరగొట్టాడు. ఆయన కామెడీ బాగుంటుంది. తల్లిగా సత్య కృష్ణ ఫర్వాలేదనిపించింది. మౌళి తమ్ముడిగా చేసిన కుర్రాడు కూడా రెచ్చిపోయాడు. మౌళి మరో ఫ్రెండ్ కూడా ఫర్వాలేదనిపించాడు. ఇలా పాత్రల పరంగా అందరూ పర్‌ఫెక్ట్ గా సూట్ అయ్యారు. కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు.
`లిటిల్ హార్ట్స్` టెక్నీషియన్ల పనితీరుః
సినిమాకి మ్యూజిక్ కీలక భూమిక పోషించింది. సింజిత్ యెర్రమల్లి సంగీతం అదిరిపోయింది. పాటలు అంతే బాగున్నాయి. అదే సమయంలో ఆర్‌ఆర్ కూడా అదిరిపోయింది. సూర్య బాలాజీ విజువల్స్ ఆకట్టుకునేలా ఉంది. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. శ్రీధర్ సొంపల్లి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. నిడివి కూడా ఎక్కువ లేకపోవడంతో ఎడిటింగ్ వర్క్ పరంగా వంక లేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. కాకపోతే పెద్దగా బడ్జెట్ కూడా కాలేదని లొకేషన్లని బట్టి చూస్తే అర్థమవుతుంది. చాలా మ్యానేజ్ చేశారు. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ ఎంచుకున్న కథ, డైలాగ్‌లు హిలేరియస్ అని చెప్పొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మూవీ వారిని కనెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హిలేరియస్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే ఇప్పుడు కామెడీ అంటే డబుల్ మీనింగ్‌లు, బూతులే అనేట్టుగా మారింది. ఇందులోనూ అదే ఫాలో అయ్యారు. కామెడీని జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఫైనల్‌గాః హిలేరియస్ ఫన్. కుర్రాళ్లకి మంచి టైమ్ పాస్ మూవీ.
రేటింగ్‌ః 3