రజనీకాంత్ `లాల్ సలామ్` మూవీ రివ్యూ, రేటింగ్..
రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ రూపొందించిన `లాల్ సలామ్` మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సూపర్‌స్టార్ రజనీకాంత్ గతేడాది `జైలర్` చిత్రంతో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆయన ముఖ్య పాత్రలో `లాల్ సలామ్` అనే మూవీ తెరకెక్కింది. రజనీ కూతురు, దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. గతంలో ఆమె రెండు సినిమాలు చేసింది. అవి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు తన తండ్రి రజనీతో కలిసి కమర్షియల్ మూవీ `లాల్ సలామ్` చేసింది. విష్ణు విశాల్, విక్రాంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీవిత రాజశేఖర్ కీలక పాత్రలో మెరిసింది. లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియెన్స్ ని అలరించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
1993లో కసుమూరు అనే గ్రామంలో హిందూ, ముస్లీంలు కలిసి జీవిస్తుంటారు. మతాలు అనే భేదాలు లేకుండా కలిసి మెలిసి ఉంటారు. ఆ ఊర్లో క్రికెట్ చాలా ఫేమస్. తరచూ క్రికెట్ పోటీలు జరుగుతుంటాయి. అవి రసవత్తరంగా ఉంటాయి. అందులో ముంబాయిలో భాయ్‌గా చెలామణి అయ్యే మోయిదీన్(రజనీకాంత్) కొడుకు శంషుద్దీన్ పాల్గొంటాడు. దానికోసం ఆయన ముంబయి నుంచి ఆ ఊరు వస్తాడు. ప్రత్యర్థి టీమ్‌లో గురు(విష్ణు విశాల్) మెయిన్ ఆటగాడిగా ఉంటాడు. అతన్నీ ఢీ కొట్టేందుకు శంషుద్దీన్‌ని దించుతారు. కానీ ఆ పోటీలో గురు టీమ్ గెలుస్తుంది. ఆ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. ఇద్దరు కొట్టుకుంటారు. ఈ ఇద్దరి మధ్య చిన్నప్పట్నుంచి గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఇద్దరు పేరెంట్స్ మంచి స్నేహితులు. ఓ రోజు జరిగిన గొడవలో గురు తండ్రి చనిపోతాడు. అది మోయిదీన్ చేయించాడని అంతా అనుకుంటారు. గురు ఊర్లో చాలా గొడవల్లో పాల్గొనడంతో ఆయన్ని వెలేస్తారు. ఏకంగా అమ్మ(జీవిత) కూడా గురుని వెలేస్తుంది. అనంతరం మరోసారి గురు, శంషుద్దీన్ టీమ్‌ల మధ్య పోటీ పడుతుంది. ఆ పోటీలో జరిగిన గొడవల్లో శంషుద్దీన్ చేతి నరికేస్తాడు గురు. దీంతో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకుంటాయి. మరి ఈ విషయం తెలిసి మొయిదీన్ ఏం చేశాడు? క్రికెట్ పోటీలు మతాల మధ్య ఘర్షణలకు ఎలా కారమయ్యాయి? ఈ గొడవలు పెట్టింది ఎవరు? కపిల్ దేవ్‌కి ఈ కథకి సంబంధమేంటి? అనంతరం ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది తర్వాత జరిగే కథ ఇది. ఆ పరిణామాలు అంతకు ముందు కలిసి ఉండే హిందూ, ముస్లీంల మధ్య ఎలాంటి చిచ్చుపెట్టాయి. వాటిని ఆసరాగా తీసుకుని కొందరు రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టారో తెలియజేసే చిత్రమిది. అయితే ఆ పరిణామాలను డైరెక్ట్ గా చెప్పకుండా జస్ట్ అలా లైటర్ వేలో ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఏ మతమైనా మనం ఇండియన్స్ అని, మతాలు వేరైనా దేవుడు ఒక్కడే అని, తమ మధ్య ఐకమత్యాన్ని ఎవరూ చాటి చెప్పాలని ఉద్దేశ్యంతో దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఇది ముప్పై ఏళ్లనాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మరోసారి మధ ఘర్షణలు పెరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలను మతాలుగా విడగొట్టి అధికారం దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. అది తెలియక వారి కుయుక్తులకు అమాయక జనం బలవుతున్నారు. ఆ విధంగా ఈ మూవీ ఇప్పటి పరిస్థితులకు కూడా అద్దం పడుతుందని చెప్పొచ్చు.
అయితే దాన్ని అంత ఎఫెక్టీవ్‌గా చెప్పలేకపోయింది దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్. అదే సమయంలో సినిమాలో రజనీకాంత్‌ని గెస్ట్ రోల్ అని చెబుతూ వచ్చారు. కానీ ఆయనదే మెయిన్ రోల్. సినిమా మొత్తం ఆ పాత్ర సాగుతుంది. ఓ రకంగా ఫుల్ లెన్త్ రోల్ అని చెప్పొచ్చు. కానీ రజనీకాంత్ వంటి బిగ్గెస్ట్ స్టార్‌ని పెట్టుకుని చాలా వీక్ నరేషన్‌తో, వీక్ స్క్రిప్ట్ తో సినిమా తీయడమే పెద్ద మైనస్. అదే ఈ మూవీలో పెద్దలోటు. ఫస్టాఫ్.. విలేజ్‌లో క్రికెట్ పోటీలు, వాటి కారణంగా జరిగే గొడవలు, ఘర్షణలను ప్రధానంగా చూపించారు. క్రికెట్ పోటీలో నాటకీయత పండలేదు, కేవలం సీన్లుగానే కనిపిస్తాయి. పైగా వీరి మధ్య గొడవల్లో కాన్ల్ఫిక్ట్ ని కూడా బలంగా చూపించలేకపోయారు. దీంతో సినిమాలో సంఘర్షణలో తేలిపోయింది. అవి సాగదీతగా అనిపిస్తాయి. బోర్ తెప్పిస్తాయి. సినిమాకి డ్రామా, ఎమోషన్ చాలా ముఖ్యం. ఈ రెండూ ఇందులో లోపించాయి. అందుకే చాలా సీన్లు తేలిపోయాయి.
ఓ వైపు క్రికెట్ పోటీల గొడవలు, మరోవైపు విష్ణు విశాల్ కారణంగా గొడవలు, ఇంకోవైపు జాతరకి సంబంధించిన తేరు(రథం) గొడవలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతుంటాయి. వాటిమధ్య కనెక్టివిటీ దెబ్బతీస్తుంది. అదే కన్‌ఫ్యూజన్ అంటే మరోవైపు ముంబయిలో పెద్ద డాన్ అయిన మొయిదీన్ ఊర్లోనే ఉంటూ అక్కడక్కడే తిరగడం వంటి సీన్లు కథని ముందుకు సాగనివ్వకుండా చేస్తాయి. అది సినిమాపై ఆసక్తిని తగ్గిస్థాయి. మరోవైపు ఊరి రాజకీయ నాయకుడు పెట్టే గొడవలు అంతగా పండలేదు. మరోవైపు జీవిత పాత్ర ప్రతిసారి ఏడుస్తూ కనిపించడం, అలాంటి సీన్లు కంటిన్యూగా రావడం కూడా కొంత చిరాకు పెట్టిస్తుంది. సెకండాఫ్ మొత్తం తేరు తయారు, జాతర చేసుకోవడం వంటి దాని చుట్టూతే తిరుగుతుంది. దానికోసమే చందాలు వసూలు చేయడం, క్రికెట్ ఆడటం చూపించారు. చివరికి ముంబయిలో ఘర్షణలు, అక్కడ మొయిదీన్‌కి ఉన్న వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చారు. ఇలా ఒకదానితో ఒకటికి లింక్ లేకుండా కలపడం కాస్త చిరాకు పెట్టిస్తుంది. అంతేకాదు కపిల్ దేవ్ పాత్రని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఇక ఫైనల్‌గా హిందూ, ముస్లీం కలిసి జాతర చేసుకునే ఎలిమెంట్లు మతాల మధ్య ఘర్షణ వద్దు, మనం మనం ఒక్కటే అనే సందేశం బాగుంది. కానీ దాన్ని ఇంకా బాగా చెప్పాల్సిందే. చాలా సింపుల్‌గా ముగించారు. ఓవరాల్‌గా సందేశం బాగున్నా, దాన్ని చెప్పిన తీరు అంతగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడం మైనస్.
నటీనటులు, టెక్నీషియన్లుః
గురుగా విష్ణు విశాల్ బాగా చేశాడు. పాత్రలో లీనమై చేశాడు. అతని పాత్రనే సినిమాని నడిపిస్తుంది. శంషుద్దీన్ పాత్రలో విక్రాంత్ సైతం బాగా మెప్పించాడు. పర్‌ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. మొయిదీన్ పాత్రలో రజనీ అదరగొట్టాడు. కానీ ఆయన పాత్రని బలంగా రాసుకోలేకపోయింది దర్శకురాలు. జీవిత రాజశేఖర్ కొత్త తరహా పాత్రలో మెప్పించింది. సెంథిల్‌తోపాటు ఇతర పాత్రలు ఓకే అనిపించాయి. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. కానీ పాటల్లోగానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లోగానీ ఏమాత్రం ఆయన మార్క్ మ్యూజిక్ కనిపించలేదు. ఏమాత్రం హైలైట్ కాలేదు. విష్ణు రంగస్వామి కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా చాలా షార్ప్ చేయాల్సింది. ఎంచుకున్న కథ ఓకే, కానీ దాన్ని ఇంకా బాగా చెప్పొచ్చు. నేటి జనరేషన్‌కి ఆకట్టుకునేలా చెప్పడంలో సక్సెస్ కాలేదు. డ్రామా, ఎమోషన్స్ పై ఫోకస్ పెట్టాల్సింది. వాటిని పండించడంలో ఆమె విఫమలయ్యింది. దీంతో సినిమా `లాల్ సలామ్` అనిపించలేకపోయింది.
ఫైనల్‌గాః `లాల్ సలామ్`.. అని చెప్పలేం.
రేటింగ్‌ః 2.25
నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, సెంథిల్ తదితరులు.
కథ, ఛాయాగ్రహణం: విష్ణు రంగసామి
రచన: విష్ణు రంగసామి, ఐశ్వర్య రజనీకాంత్
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్