- Home
- Entertainment
- Movie Reviews
- చిరంజీవి చేతిలో చావు దెబ్బలు తిన్న మోహన్ బాబు.. `కొదమసింహం` మూవీ రీ రిలీజ్ రివ్యూ
చిరంజీవి చేతిలో చావు దెబ్బలు తిన్న మోహన్ బాబు.. `కొదమసింహం` మూవీ రీ రిలీజ్ రివ్యూ
Kodamasimham Movie Re Release Review: చిరంజీవి కౌబాయ్ గా నటించి ఏకైక మూవీ `కొదమసింహం`ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కొదమసింహం` మూవీ రీ రిలీజ్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి 1990లో హీరోగా పీక్‌లో ఉన్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకుని తిరుగులేని సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన చేసిన సాహసం `కొదమసింహం`. ఎందుకంటే ఇది కౌబాయ్ మూవీ. తెలుగులో కృష్ణ చేసిన `మోసగాళ్లకి మోసగాడు` తర్వాత చిరంజీవి అలాంటి కౌబాయ్ జోనర్‌లో ఈ చిత్రం చేశారు. దీనికి కె మురళీమోహన రావు దర్శకత్వం వహించగా, రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల నాగేశ్వరరావు నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ రచన సహకారం అందించారు. ఈ చిత్రం 1990 ఆగస్ట్ 9న విడుదలైంది. అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే చిరంజీవి స్థాయి హిట్ కాదని చెప్పొచ్చు. ఈ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 35ఏళ్ల తర్వాత మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియెన్స్ ఆ మూవీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు శుక్రవారం(నవంబర్ 21)న ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంది. ముందుగా మీడియాకి షో ప్రదర్శించారు. మరి 4కే కన్వర్జేషన్, 5.1డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ మూవీ ఎలా ఉంది? ఇప్పటి తరం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`కొదమసింహం` మూవీ స్టోరీ
భరత్(చిరంజీవి) కౌబాయ్, ఖిలాడీలకే పెద్ద ఖిలాడీ. కిరాయి రౌడీగా పనిచేస్తుంటారు. ఫారెస్ట్ ప్రాంతంలో పేరెంట్స్ (గొల్లపూడి, అన్నపూర్ణమ్మ)తో నివసిస్తుంటాడు. పబ్‌లో పెద్ద రౌడీ అయిన గజపతి(టైగర్ ప్రభాకర్) మనుషులతో గొడవ అవుతుంది. వాళ్ల తమ్ముళ్లని కొడతాడు. తమ వ్యాపారాలకు అడ్డు వస్తున్నాడని చెప్పి భరత్‌ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. ఓ రాత్రి సమయంలో భరత్ ఇంటిపై దాడి చేస్తారు. ఇందులో తల్లిదండ్రులను కోల్పోతాడు. తండ్రి చనిపోతూ భరత్ జన్మరహస్యం చెబుతాడు. నువ్వు మా బిడ్డవి కాదు, సుడిగాలి(మోహన్ బాబు) దొంగతనం చేసి నిన్ను తీసుకొచ్చాడు. నగల కోసం నిన్ను చంపబోతుంటే మేమే కాపాడి పెంచుకున్నామని, నువ్వు ఎవరి బిడ్డవో సుడిగాలికి తెలుసు అని చెబుతాడు. దీంతో ఆ సుడిగాలి కోసం వేట కొనసాగిస్తాడు భరణ్. సుడిగాలి పెద్ద దొంగ, పెద్ద కంపు బ్యాచ్. నెల రెండు నెలలయినా స్నానం చేయడు, ఆయన కంపుని భరించలేక జనాలు భయపడి పారిపోతారు. రెగ్యూలర్‌గా స్థానిక పబ్‌కి వచ్చి వెళ్తుంటాడని, గజపతికి సహాయకుడిగా ఉంటాడని తెలుసుకుని గజపతి వద్దకు వెళ్తాడు. గజపతితో ఫైట్ చేసి సుడిగాలిని పట్టుకుంటారు. దీంతో ఆయన అసలు రహస్యం చెబుతాడు. వాళ్లమ్మ స్థానిక రాజు(రంగనాథ్) వద్ద బంధీగా ఉందని, తండ్రిపై దేశద్రోహం కేసు ఉందని తెలుసుకుంటాడు. కొహినూర్ డైమాండ్ దొంగతనం కేసు ఏంటి? తల్లి ఎందుకు శిక్ష అనుభవిస్తుంది? చివరికి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు భరత్ చేసిన పోరాటమేంటి? మేయర్‌పై తండాల రాణి బిజిలి(రాధ) ఎందుకు పగతో ఊగిపోతుంది? వారి కథేంటి? అనేది సినిమా.
`కొదమసింహం` మూవీ ఎలా ఉందంటే?
`కొదమసింహం` 4కే కన్వర్జేషన్‌లో చాలా క్వాలిటీగా ఉంది. కొత్త సినిమాని తలపిస్తుంది. టెక్నీకల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంది. అప్పట్లోనే ఈ రేంజ్‌లో సినిమా చేశారంటే మామూలు విషయం కాదు, చిరంజీవి సాహసానికి, దర్శక నిర్మాతల రిస్క్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మేకింగ్ పరంగానూ ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. కాస్ట్యూమ్స్ పరంగానూ కొత్తగా ఉంటుంది. సినిమా చాలా స్టయిలీష్‌గా ఉంటుంది. చిరంజీవి లుక్ మాత్రం అదిరిపోయింది. ఆయన గన్స్ వాడే విధానానికి అభిమానులు ఊగిపోతారని చెప్పొచ్చు. యాక్షన్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇక పాటలు సినిమాకి పెద్ద అసెట్. `స్టార్ స్టార్ మెగాస్టార్` పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్. రాజ్ కోటి అదిరిపోయే ఆల్బమ్ అందించారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, డ్రామా బాగుంది. ఇందులో మోహన్ బాబు, చిరంజీవి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు, అందులోనే కామెడీని మేళవించిన తీరు, చిరంజీవి చేతిలో మోహన్ బాబు దెబ్బలు తినే సీన్లు మాత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ఈ సీన్లని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు.
`కొదమసింహం`లో హైలైట్స్, మైనస్‌లు
కానీ మెగాస్టార్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతుంది. ఇది రెగ్యూలర్ కమర్షియల్ మూవీ కాకపోవడంతో చిరంజీవి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయినట్టుగా ఉంటుంది. కేవలం మోహన్ బాబు పాత్రకే పరిమితం చేశారు. ఆయన పాత్ర ద్వారానే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. దీంతో డ్రైగా సాగినట్టుగా ఉంటుంది. అదే సమయంలో టేకింగ్ కూడా కాస్త స్లోగా ఉంటుంది. రీ రిలీజ్ కోసం కొంత ట్రిమ్ చేశారు. దీంతో చాలా సీన్లు కట్, కట్ లాగా అనిపిస్థాయి. క్లైమాక్స్ యాక్షన్ సీన్లు బాగుంటాయి. తల్లి సెంటిమెంట్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ విజువల్స్ మాత్రం సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. లొకేషన్లు, లాంగ్ షాట్స్ వాహ్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. హార్స్ పై రైడ్‌తో కూడిన యాక్షన్స్ మరో హైలైట్‌గా చెప్పొచ్చు.
`కొదమసింహం` మూవీ నటీనటులు
కౌబాయ్ భరత్ గా స్టయిలీష్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టారు. తెరపై ఆయన్ని చూస్తూ ఉండిపోవచ్చు. స్టయిలీష్ లుక్, యాక్షన్, ముఖ్యంగా గన్స్ ని వాడే విధానం అదిరిపోయింది. మొదటిసారి ఆయన చిన్న గెడ్డంతో చేసిన మూవీ ఇది. ఆ లుక్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక సుడిగాలి పాత్రలో మోహన్ బాబు రెచ్చిపోయి చేశారు. తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్ చేశారు. చిరంజీవి పెంచిన తల్లిదండ్రులుగా గొల్లపూడి, అన్నపూర్ణమ్మ ఫర్వాలేదనిపించారు. భరత్ అసలు తండ్రిగా కైకాల సత్యనారాయణ పాత్ర కీలకంగా ఉంటుంది. కథని మలుపుతిప్పే పాత్ర ఆయనదే అని చెప్పొచ్చు. బిజిలిగా రాధ డీ గ్లామర్ లుక్‌లో కనిపించి అదరగొట్టింది. యాక్షన్ తోనూ కట్టిపడేసింది. పాటల్లో మాత్రం డాన్సులతో దుమ్ములేపింది. మరో హీరోయిన్ గా సోనమ్ గ్లామరస్‌గా మెప్పించింది. పబ్‌లో కామెడీ రోల్ లో సుధాకర్ కాసేపు నవ్విస్తారు. మెయిన్ విలన్‌గా గజపతి విలనిజం బాగా పండింది. మేయర్‌గా బాలీవుడ్ నటుడు ప్రాణ్ పాత్ర కూడా స్పెషల్‌గా నిలుస్తుంది. బార్ హోనర్‌గా అల్లు రామలింగయ్య కాసేపు నవ్విస్తే, బార్ అటెండర్‌గా వాణి విశ్వనాథ్ గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. రాజుగా రంగనాథ్ మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించేలా ఉంటాయి.
`కొదమసింహం` టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
రాజ్ కోటి పాటలు సినిమాకి పెద్ద అసెట్. ఆడియెన్స్ చేత డాన్సులు చేయిస్తాయి. కెఎస్ హరి విజువల్స్ మరో అసెట్. తెలుగు సినిమాల్లో అప్పటి వరకు ఇలాంటి విజువల్స్ చూసి ఉండరేమో. దర్శకుడు మురళీ మోహన్ రావు టేకింగ్ అదిరిపోయింది. మేకింగ్స్ కూడా చాలా రిస్క్ తో కూడినది. వారి డేర్‌ని అభినందించాల్సిందే. అలాగే నిర్మాతలు చేసిన డేర్ కూడా అభినందనీయం. సినిమాని చాలా రిచ్‌గా, రియాలిటీకి దగ్గరా తీయడం విశేషం. పరుచూరి బ్రదర్స్ డైలాగ్‌లు కూడా ఆకట్టుకుంటాయి.
`కొదమసింహం` మూవీ రికార్డులు
`కొదమసింహం` తెలుగు సినిమాల్లో అప్పటి వరకు వచ్చిన వాటిలో అత్యధిక బడ్జెట్ మూవీ కావడం విశేషం. ఏకంగా రూ.3.5-4కోట్లు ఖర్చు చేశారట. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో నైజాంలో అత్యధిక వసూళ్లని రాబట్టింది. దాదాపు నలబై లక్షలు వసూలు చేసిందట. 35ఏళ్ల క్రితం ఆ కలెక్షన్లు అంటే మాటలు కాదు. అంతేకాదు వంద రోజుల వేడుకకి రజనీకాంత్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే `జగదేక వీరుడు అతిలోక సుందరి` మూవీ ప్రభంజనం తర్వాత వచ్చిన మూవీ కావడంతో దాన్ని మించి ఉంటుందని భావించారు. కానీ ఆ విషయంలో ఆడియెన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారని టాక్. కాకపోతే మొదటివారం కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఈ మూవీని `హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ` పేరుతో ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం.
ఫైనల్ రిపోర్ట్
`కొదమసింహం`4కే లో విజువల్స్ పరంగా, క్వాలిటీ పరంగా చాలా బాగుంది. చిరంజీవి కౌబాయ్ పాత్ర కోసం, యాక్షన్స్, విజువల్స్, పాటల కోసం చూడగలిగే మూవీ.

