రుహానీ శర్మ `హర్` మూవీ రివ్యూ.. ఆమె సాహసం ఫలించిందా?
`చిలసౌ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యిందీ బ్యూటీ. `హిట్`, `డర్టీ హరీ`, `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రాలతో మెప్పించిన రుహానీ శర్మ.. ఇప్పుడు తనపంథా మార్చి లేడీ ఓరియెంటెడ్ మూవీ `హర్`(ఛాప్టర్ 1) చిత్రం చేసింది. నేడు శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రల తీరుతెన్నుల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యేవారు. ఎంతో ఎక్స్ పీరియెన్స్, టాలెంట్ ఉంటే తప్ప లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసేవారు కాదు, అవి కూడా చాలా అరుదు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కొత్త ట్రెండ్ ఊపందుకుంది. హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలోనే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా, అనుపమా పరమేశ్వరన్, కీర్తిసురేష్, సాయిపల్లవి వంటి వారు ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నారు. తాజాగా మరో యంగ్ బ్యూటీ రుహానీ శర్మ ఆ పంథానే ఎంచుకుంది. `చిలసౌ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యిందీ బ్యూటీ. `హిట్`, `డర్టీ హరీ`, `నూటొక్క జిల్లాల అందగాడు` చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు తనపంథా మార్చి లేడీ ఓరియెంటెడ్ మూవీ `హర్`(ఛాప్టర్ 1) చిత్రం చేసింది. అయితే ఇది మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ఇటీవల కాలంలో ఈ కాన్సెప్ట్ మూవీస్ చాలా వస్తున్నాయి. ఆదరణ పొందుతున్నాయి. మరి రుహానీ శర్మ ప్రధాన పాత్రలో `హర్` సినిమాతో చేసిన సాహసం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
విశాల్ పసుపులేటి(వినోద్ వర్మ), స్వాతి(అభిజ్ఞ) అనే జంట మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత తీసుకుంటుంది ఏసీపీ అర్చనా ప్రసాద్(రుహానీ శర్మ). ఈ జంట మర్డర్ కేసు అర్చనాకి పెద్ద ఛాలెంజ్‌గా మారుతుంది. ఎలాంటి క్లూస్ దొరక్కపోవడంతో కేసు ముందుకు సాగదు. ఈ క్రమంలో ఈ కేసుకి కేశవ్ అనే టెర్రరిస్ట్ కి సంబంధం ఉందనే విషయం తేలుతుంది. ఆ కేశవ్‌ని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో అర్చనా ప్రియుడు శేషాద్రి కన్నుమూస్తాడు. ఇలా వరుస హత్యల వెనకున్న మిస్టరీ ఏంటి? దాన్ని అర్చన ఎలా ఛేదించింది? శేషాద్రి మరణానికి కారణం ఏంటి? ఈ కేసులో ఓ పోలీస్ ఆఫీసర్‌కి సంబంధం ఏంటి? మరి ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఛేదించబడింది? ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు, టర్న్ లు ఏంటనేది మిగిలిన కథ.
విశ్లేషణః
సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది చాలా వరకు మేకర్స్ సేఫ్ జోన్. అదే సమయంలో క్రియేటివిటీ చాటుకునే జోనర్ కూడా. దాన్ని ఎంత ఎంగేజింగ్‌గా, ఎంత ట్విస్ట్ లతో తీసుకెళ్తే ఫలితం అంతా బాగుంటుంది. కథలు రొటీనే అయినా, దాన్ని నడిపించే తీరు ఇక్కడ చాలా ముఖ్యం. చాలా వరకు మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ స్వ రాఘవ్.. `హర్` చిత్రంతో తన మార్క్ ని చూపించే ప్రయత్నం చేశాడు, తానేంటో తెలియజేసే ప్రయత్నం చేశాడు. కొత్త పంథాని ఎంచుకోవడం ఈ సినిమాకి ప్రధాన బలం. అదే సమయంలో నటి రుహాని శర్మకి ఓ పెద్ద టెస్ట్ లాంటిది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో సినిమాకి కథనే బలంగా ఉండాలి. అది ఎంత బలంగా ఉంటే, ఎంత ఎంగేజింగ్‌గా చెబితే ఆడియెన్స్ అంతగా కనెక్ట్ అవుతారు. ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
మైండ్ గేమ్‌తో సాగే థ్రిల్లర్ చిత్రమిది. స్క్రీన్‌ప్లేతో గేమ్ ఆడుకున్నాడు డైరెక్టర్. దాన్ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా జంట హత్యల కేసుతో ప్రారంభమవుతుంది. అందులో భాగంగా ఒక్కో మిస్టరీని ఛేదించే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. దీనికితోడు పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేసే తీరు కూడా ఎంగేజ్ చేస్తుంది. అయా సీన్లు చాలా వరకు సహజంగా ఉంటాయి. దీంతో ఆడియెన్స్ మరింతగా కనెక్ట్ అవుతారు. రొటీన్ హీరో, విలన్ ఛేజింగ్‌లు కాకుండా ఏది రైట్, ఏది రాంగ్ అనేది తేల్చే విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని ఇందులో చూపించారు. అది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. మంచి సమాచారంగానూ ఉపయోగపడుతుంది. దీనికితోడు సినిమాలో విలన్‌కి, రుహానికి మధ్య ఉన్న కాన్‌ఫ్లిక్స్ తో కూడిన ట్విస్ట్ హైలైట్ గా ఉంటుంది.
అయితే దోపిడి దొంగల ఎపిసోడ్‌లో రుహానీ శర్మ హంతకులను కనిపెట్టే సీన్‌ని మరింతగా బలంగా రాసుకోవాల్సిందే. ఆయా సీన్లు సర్ప్రైజింగ్‌గా ఉంటే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు, వాహ్ అనే ఫీలింగ్‌ని పొందుతారు, ఆ కిక్ ఇవ్వకపోతే సీన్ తేలిపోయింది. `హర్` మూవీలో అదే జరిగింది. దానిపై దర్శకుడు ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. విలన్‌ని కనిపెట్టడం వరకు ఇందులో చూపించారు. అయితే ఎలా పట్టుకున్నారనేది సీక్వెల్‌లో ఉండబోతుంది. ఈ సినిమాలో పోలీస్ వ్యవస్థలోని లోపాలను కూడా బట్టబయలు చేశారు. అయితే ఈ సినిమా రొటీన్‌గానే సాగడం మైనస్‌గా చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసేశామనే ఫీలింగ్ కలుగుతుంది. ట్విస్ట్ లపై ఫోకస్ పెట్టాల్సింది. అలాగే ఇన్వెస్టిగేషన్‌లో వచ్చే ల్యాగ్ బోర్ తెప్పిస్తుంది.
నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు..
రుహానీ శర్మ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో సక్సెస్ అయ్యింది. తన పాత్రకి న్యాయం చేసింది. సినిమాని తన భుజాలపై మోసింది. ఆ విషయంలో ఆమెకి వందకి వంద మార్కులు వేయాల్సిందే. తన పరంగా ది బెస్ట్ ఇచ్చింది. తాను చేయగలనని నిరూపించింది. అయితే కొంత మాస్ యాంగిల్ ఉంటే బాగుండేది. వీరితోపాటు వికాస్ వశిష్ట, అభిజ్ఞ, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్ లు సైతం ఇతర పాత్రల్లో ఫర్వాలేదనిపించారు. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. పవన్ సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అసెట్ అవుతుంది. రఘు సంకురాత్రి, దీపల(డబుల్ అప్ మీడియాస్) నిర్మాణ విలువలకు కొరత లేదు. దర్శకుడు శ్రీధర్ స్వరాఘవ్ ఈ సినిమాని మరింత బలంగా రాసుకునే, మరింత ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ లతో తెరకెక్కిస్తే ఇంకా బాగుండేది.
ఫైనల్‌గాః సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.
రేటింగ్‌ః 2.75