#Highway: 'హైవే' తెలుగు మూవీ రివ్యూ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మూవీ హైవే. టాలీవుడ్‌లో మిడిల్‌క్లాస్ మెలోడీస్, పుష్పక విమానంలాంటి మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్.. ఇప్పుడో క్రైమ్ థ్రిల్లర్‌తో ఆడియెన్స్‌ను థ్రిల్ చేయడానికి వస్తున్నాడు.
Highway Movie Review
మనకు సైకో థ్రిల్లర్ సినిమాలు తక్కువే. అవన్నీ బీ గ్రేడ్ సినిమాలుగా భావించి హీరోలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే రాక్షసుడు చిత్రం వచ్చాక ఆ టైప్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. సరిగ్గా వర్కవుట్ చేస్తే భారీ ఎత్తున హిట్ అవుతుందని అందరికి నమ్మకం కలిగింది. ఆ క్రమంలో మన ముందుకు వచ్చిన చిత్రమే హైవే. విజయ్ దేవరకొండ తమ్ముడుగా పరిచయమైన ఆనంద్ ఇప్పుడిప్పుడే తనకంటూ ముద్ర వేసుకుంటున్నారు. అతను చేసిన సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని భావిస్తాము. అందులోనూ డైరక్టర్ ...గతంలో కళ్యాణ్ రామ్ కు '118' హిట్ ఇచ్చినవాడు. దాంతో ఖచ్చితంగా సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం. మన అంచనాలకు తగ్గట్లే సినిమా కొత్తగా ఉందా...అసలు కథేంటి సినిమా వర్కవుట్ అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్ సిటీలో ఓ సైకో కిల్లర్ దాస్ (అభిషేక్ బెనర్జీ) ఒంటిరిగా అమ్మాయి కనపడితే నిర్మాన్యుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అతి క్రూరంగా చంపేస్తుంటాడు. ఇప్పటికి ఐదు హత్యలు చేసాడు. యధావిథిగా ఆ హత్యలు మీడియా, అన్ని వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూంటాయి. ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకునేందుకు ఏసీపి ఆశా భరత్(సయామీ ఖేర్) ప్రయత్నిస్తుంటుంది.
మరోవైపుఫొటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ) ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ప్రెండ్ సముద్రం (సత్య) తో కలిసి వైజాగ్ నుండి బెంగళూరు హైవేలో బయలుదేరుతాడు. మరో ప్రక్క మంగళూరులో ఉన్న తన తండ్రిని కలుసుకోవడానికి తులసి (మానస రాధాకృష్ణన్) ఒంటరిగా బయలుదేరుతుంది. మధ్యలో బస్ మిస్ కావడంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది పరిచయంలోనే తులసితో విష్ణు ప్రేమలో పడి పాటలు పాడుకుంటారు. ఇక విష్ణు , తులసిని మంగళూరు కి దగ్గర వున్న ఒక బస్ స్టాప్ లో దింపేసి వెళ్ళిపోతాడు. తులసి ఎక్కిన బస్ బ్రేక్ డౌన్ అవుతుంది. రాత్రిపూట బస్ స్టాప్ లో ఒంటరిగా మిలిగిపోయిన తులసి సైకో చేతికి చిక్కుతుంది. అప్పుడు ఏమౌతుంది...విష్ణు ఆమెను మళ్లీ కలుస్తాడా...చివరకు ఏమైందనేది మిగతా కథ.
ఎనాలసిస్ ...
రెగ్యులర్ గా సైకో కిల్లర్ చిత్రాలు ఓ ఫార్మెట్ లో సాగుతూంటాయి. ఓ సీరియల్ కిల్లర్ వరస మర్డర్స్ చేసుకుంటూ పోతూంటాడు. అతనికి మోటో ఉండచ్చు లేకపోవచ్చు. అతన్ని పట్టుకోవటానికి పోలీస్ లు రంగంలోకి దిగుతారు. ఈ లోగా హీరోయిన్ ని అతను టార్గెట్ చేస్తాడు. హీరో వచ్చి ఆ సైకో నుంచి ఎలా రక్షించాడు. పోలీస్ లు కూడా చెయ్యలేని పనిని అతను ఎలా చేసాడన్నట్లు సాగుతూంటాయి. అయితే ఇదేంతా ఓల్డ్ పాట్రన్. ఈ ఫార్ములాలో కథ చెప్తే ...అడుగడుక్కీ కథ ఎలా వెళ్లబోతుంది అనేది చూసే వాడికి అర్దమైపోతుంది. ఆ క్రమంలో వ్చచే థ్రిల్స్ పెద్దగా కిక్ ఇవ్వవు. ఎక్సపెక్ట్ చేసేస్తారు. న్యూ జనరేషన్ డైరక్టర్స్ అందుకే ఈ జానర్ వైపు వెళ్లటానికి ధైర్యం చేయటం లేదు. చేస్తే ..కొత్త నేపధ్యం, నేటివిటి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జాగ్రత్తగా పేరుస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన విక్రాంత్ రోణా (సుదీప్) సక్సెస్ కు అదే కారణం. అలాంటి క్రియేటివిటి ఈ సినిమాలో మిస్సైంది.
ఈ సైకో కిల్లర్ జానర్ ఫిల్మ్ కు గాడ్ ఫాధర్ లాంటి చిత్రం .... 2010 టైమ్ లో వచ్చిన కొరియన్ సినిమా ఐ సా ది డెవిల్. ఈ సినిమా లో కంటెంట్ తెలిసినా చూసిన ప్రతీ సారి ఒళ్ళు జలదరిస్తుంది. ఆ సినిమా ....అలాంటి ఫీల్ కాదు కదా అందులో పావు వంతు కూడా క్రియేట్ చేయదు. వెళ్తూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడా ఏ కుదుపు లేకుండా హైవే పై వెహికిల్ వెళ్తున్నట్లు...ఏ మలుపు లేకుండా కథనం సాగుతుంది. ఇలాంటి జానర్ సినిమాలు ఓటిటికు కూడా ఓల్డ్ అయ్యిపోయాయి. ఇక్కడ కూడా ఏదన్నా కొత్త దనం చూపకపోతే వర్కవుట్ కావటం లేదు. అదే ఈ సినిమాలో మిస్సైంది. ఈ సినిమాలో పెద్దగా మనని ఎక్సైట్ చేసేవి, థ్రిల్ చేసే సంఘటనలు కానీ కనపడవు. కొన్ని జిమ్మిక్ లు ఉంటాయి. కాన్సెప్టు కనపడదు. అలాగే కథలో ఎలాగో టెన్షన్ ఎలిమెంట్ పెద్దగా పేల లేదు... హీరోయిన్ ...సీరియల్ కిల్లర్ కు దొరికిన తర్వాత వచ్చే సీన్స్ లో అయినా ఏమన్నా విషయం ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తాం అదీ ఉండదు. ముఖ్యంగా ఇలాంటి కథలో antagonist క్యారక్టరైజేషన్ మనని హాంట్ చేస్తే వర్కవుట్ అవుతుంది. ఏదైమైనా థ్రిల్లర్ కు కావాల్సిన మిస్టరి వాతావరణం ఎస్టాబ్లిష్ కాలేదు. క్లైమాక్స్ లో వచ్చే పులి ఎపిసోడ్ అయితే దారుణం.
టెక్నికల్ గా...
ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత ఫెరఫెక్ట్ గా సింక్ అయితే అంత సినిమా లేస్తుంది. సైమన్ కె కింగ్ స్వరపరిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు కావాల్సిన మూడ్ క్రియేట్ చేసింది. పాటలు అనవసరం. సినిమాటోగ్రఫీ , డైరక్షన్ చేసిన కేవీ గుహన్ ...సినిమాటోగ్రాఫర్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఇక దర్శకునిగా పెద్దగా కాన్సర్టేట్ చేయలేదనిపించింది. స్క్రిప్టు సహకరించి ఉంటే బాగుండేది. సినిమాలో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాజిక్స్ ,ముగింపు ఇవన్నీ పదిహేనేళ్ల క్రితంవి. ఎడిటర్ కు పూర్తి స్వేచ్చ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా చోట్ల తేలిపోయాయి .
నటీనటుల్లో ...
మెయిన్ లీడ్ ఆనంద్ దేవరకొండ , హీరోయిన్ మానస రాధా కృష్ణన్ ఇద్దరూ మంచి సింక్ లో ఉన్నారు. ఆనంద్ దేవరకొండ... గత చిత్రాల కన్నా బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. నేచురల్ గా నటించాడు. సైకో పాత్రలో అభిషేక్ బెనర్జీ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని చూపించాడు. సయామీ ఖేర్ ఫిట్నెస్, పోలీస్ పాత్రకు సెట్ అయ్యింది. మిగతా వాళ్లు ఛల్తాహై.
ఫైనల్ థాట్
ఈ కిల్లర్ మన టైమ్ ని కిల్ చేయటానికి కూడా పనికి రాడు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating : 2/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, అభిషేక్ బెనర్జీ, రమ్య పసుపులేటి, 'స్వామి రారా' సత్య, జాన్ విజయ్ తదితరులు
మాటలు : మిర్చి కిరణ్, సాయి కిరణ్ సుంకోజు
స్క్రీన్ ప్లే : ఖైలాష్, సుధాకర్ కె.వి.
సంగీతం : సైమన్ కె. కింగ్
నిర్మాత : వెంకట్ తలారి
రైటర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ : కె.వి. గుహన్
విడుదల తేదీ: ఆగస్టు 19, 2022
ఓటీటీ వేదిక : ఆహా