Reuse Frying Oil: డీప్ ఫ్రై చేశాక మిగిలిన నూనెను పారేయకుండా తిరిగి ఇలా ఆరోగ్యంగా వాడొచ్చు
పకోడి, సమోసా వంటి డీప్ ఫ్రైలు చేసిన తరువాత నూనె మిగిలిపోవడం సహజం. ఆ నూనె మళ్లీ కూరలకు, వేపుళ్లకు తిరిగి వాడకూడదని చెబుతారు. ఆ నూనెను ఆరోగ్యానికి హానికరం అనుకుని చాలా మంది పారబోస్తారు. కానీ ఆ నూనెను మళ్ళీ ఎలా వాడొచ్చో తెలుసుకోండి.

వంటనూనె ఎందుకు వాడకూడదు?
వంటల్లో నూనె చాలా ముఖ్యమైనది. కూరల నుండి పకోడీల వరకు దాదాపు అన్నీ నూనెలో వేయించాల్సినవే. వంట చేసిన తర్వాత కొన్నిసార్లు కళాయిలో నూనె మిగిలిపోవడం సహజం. మిగిలిన నూనెను వాడలే పారేయలేక ఎంతో మంది సతమతమవుతూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడటం వల్ల హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. కాబట్టి వంట నూనెను మళ్ళీ మళ్ళీ వంటలకు వాడకుండా, అలాగని పారేయకుండా ఏం చేయాలో తెలుసుకోండి. దీన్ని తిరిగి ఉపయోగించవచ్చు.
లూబ్రికెంట్‌లా వాడుకోవచ్చు
వాడేసిన వంట నూనెను ఇంట్లో చిన్న చిన్న పనులకు లూబ్రికెంట్ లా వాడుకోవచ్చు. తలుపుల మధ్య వచ్చే శబ్ధాలను తగ్గించడానికి, యంత్రాల భాగాలకు లూబ్రికెంట్ లా రాయడానికి వాడవచ్చు. తరువాత వస్త్రంతో తుడిచివేయాలి. ఇది చవకైన పద్ధతి కూడా.
సలాడ్ డ్రెస్సింగ్ లో
వంట నూనెను సలాడ్ డ్రెస్సింగ్ గా వాడుకోవచ్చు. వెనిగర్, ఆకుకూరలు, హెర్బ్స్ వంటి వాటిపై ఆరోగ్యకరమైన, రుచికరమైన డ్రెస్సింగ్‌ను తయారు చేయవచ్చు. ఇది ఆహారానికి రుచినిపెంచడమే కాకుండా నూనెను సరిగ్గా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. అయితే ఆలివ్ నూనె, కొబ్బరి నూనెతో మాత్రమే ఇలా చేయండి.
ఎరువుగా వాడుకోవచ్చు
మిగిలి పోయిన నూనెను మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. దీన్ని నీటిలో కలిపి మొక్కల వేర్లకు లేదా ఆకులకు స్ప్రే చేయవచ్చు. నూనెలో ఉండే నత్రజని, భాస్వరం వంటి పోషకాలు మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. కానీ, ఎక్కువ మొత్తంలో వాడితే మొక్కలకు హాని కలిగించవచ్చు. మిగిలిన నూనెను నీటిలో కలిపి మాత్రమే వేయాలి. నేరుగా పోస్తే మొక్కలు పాడవుతాయి.
కంపోస్ట్ గా వాడండి
వంట నూనెను కంపోస్ట్ గా వాడుకోవచ్చు. ఇది భూమిలోని సూక్ష్మజీవులకు శక్తినిస్తుంది. సేంద్రీయ వ్యర్థాలను త్వరగా కుళ్ళిపోయేలా చేసి, పోషకాలతో కూడిన మట్టిని తయారు చేస్తుంది. నూనె మొత్తం తక్కువగా ఉండాలి. దానిని ఇతర వ్యర్థాలతో బాగా కలిపి వేయాలి. లేదంటే కీటకాలు ఆకర్షితమవుతాయి.