Yoga Day 2022: ఈ యోగాసనాలతో నిత్య యవ్వనం మీ సొంతం..!
Yoga Day 2022: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండటమే కాదు.. మిమ్మల్ని నిత్య యవ్వనంగా కూడా ఉంచుతాయి. ఇందుకోసం ఈ ఆసనాలను రెగ్యులర్ గా వేయాల్సిందే మరి..!

Yoga Day 2022: యోగా మనకు ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ప్రాణాంతకమైన రోగాలు సైతం తొలగిపోతాయి. అలాగే పని ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో సమస్యలు దూరమవుతాయి. అందుకే యోగాను క్రమం తప్పకుండా చేయాలని యోగా నిపుణులు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. యోగా వల్ల మరో సూపర్ బెనిఫిట్ కూడా ఉంది.. ఏంటంటే.. క్రమం తప్పకుండా కొన్ని రకాల ఆసనాలను వేయడం వల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. మీ వయసెంత ఉన్నా.. మీరు మాత్రం యూత్ లాగే కనిపిస్తారు. అంతేకాదు వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలైన కీళ్ల నొప్పులు, అలసట, శక్తి లేకపోవడం, బలహీనత వంటి సమస్యలను సైతం పోగొడతాయి. ఇందుకోసం ఎలాంటి యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
శవాసనం (Savasana)
ఈ శవాసనం వేయడం చాలా సులువు. అందుకే ఈ ఆసనం చాలా మందికి ఇష్టం. రకరకాల యోగాసనాలు వేసిన తర్వాత చాలా మంది తప్పకుండా శవాసనాన్ని వేస్తుంటారు. వెల్లకిలా పడుకుని ఈ ఆసనం వేస్తారు. ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మలబద్దకం సమస్య పోతుంది. నిద్రలేమి సమస్య ఉండదు. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తానాసనం (Uttanasana)
ఈ ఉత్తానాసనం రక్తప్రసరణను మెరుగుపర్చడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం వల్ల శరీర వెనుక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి సమస్యలున్నా ఇట్టే తగ్గించేస్తుంది. వెన్ను నొప్పితో బాధపడేవారికి ఈ ఆసనం చక్కటి ఫలితాన్నిస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
భుజంగాసనం (Bhujangasana)
వెన్నుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఈ ఆసనం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వెన్ను నొప్పి, వెన్నెముక గాయం వంటి సమస్యలను ఈ ఆసనం తొందరగా తగ్గిస్తుంది. ఈ ఆసనం క్రమం తపపకుండా వేయడం వల్ల వెన్నెముఖ బలంగా తయారవుతుంది. అలాగే చెస్ట్ పై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ ఆసనంలో భాగంగా పొత్తికడుపును సాగదీస్తాం. దీనివల్ల మీరు నిటారుగా నిలబడతారు.
తడాసనం ( Thadasanam)
ఈ ఆసనాన్ని పెద్ద వయసు (60 ఏండ్లు) వారు కూడా సులువుగా వేయొచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్త మెరుగుపడటంతో పాటుగా స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ ఆసనం వంగిన కాళ్ల భాగం, ఛాతి, వీపు భాగాలను సరిచేస్తుంది.
బద్ద కోనాసనం (Baddha Konasana)
దీనినే సీతాకోకచిలుక భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని ఉదయం పరిగడపున మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం మూత్రపిండాల సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది.