- Home
- Life
- world health day 2022: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అస్సలు విస్మరించకూడదు..
world health day 2022: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అస్సలు విస్మరించకూడదు..
world health day 2022: ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు పెద్దలు. అవును మరి ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ఎలాంటి పనులనైనా అలవోకగా చేయగలుగుతాం. మరి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..

World Health Day
world health day 2022: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పదం మనం ఎప్పటినుంచో వింటున్నదే అయినా.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారు నూటికి పదిమందికంటే ఎక్కువగా ఉండరేమో కదా.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు నిత్యం సూచిస్తునే ఉంటారు. అయితే మనం ఏం చేస్తున్నాం.. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అంటూ ఆయుష్షును తగ్గించే, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలనే తీసుకుంటున్నాం.
ఇకపోతే నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రతి ఏడాది లాగే ఈ ఇయర్ ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం.. ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడం.
ఈ ఏడాది థీమ్ ‘మన భూమి, మన ఆరోగ్యం’. ఈ భూమిపై ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య నిపుణులు కొన్నిచిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
క్రమం తప్పకుండా వ్యాయామం.. మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు శారీరక శ్రమ ఎంతో అవసరం. ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు డ్యాన్స్ లేదా ఆటలు లేదా రోజు వారి కార్యకలాపాలు చేయొచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పోషకాహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. పోషకాహారం తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా బావుంటుందని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.
ప్రశాంతమైన నిద్ర.. నిద్రతోనే మన శరీరంలో తిరిగి పునరుత్తేజంగా మారుతుంది. అంతేకాదు ప్రశాంతంగా నిద్రపోతే మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
చెడు అలవాట్లను విడిచిపెట్టండి.. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి దూరంగా ఉన్నప్పుడే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
మంచి అలవాట్లను పెంపొందించడం.. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండే అలవాట్లనే అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ కాసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి బయటపడతారు. తద్వారా మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా ప్రతికూల ఆలోచనలు కూడా రావు.