World Brain Day 2022: మెదడు ఆరోగ్యానికి ఈ ఆరు పనులు అత్యవసరం..
World Brain Day 2022: కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బ్రెయిన్ హెల్త్ తో ముడి పడి ఉంటుంది. అందుకే దీన్ని ఎప్పుడూ హెల్తీగా ఉంచుకోవాలి.

నేడు World Brain Day. ప్రతి ఏడాది జులై 22 ను ప్రపంచ మెదడు దినోత్సవంగా World Federation of Neurology (WFN) జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రోజు మన ఆరోగ్యానికి మెదడు ఆరోగ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.
మెదడు ఆరోగ్యంపైనే మన శరీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మెదడు పనితీరు బాగుంటేనే మనం అన్ని విధాలా బాగుంటాం. అయితే కొన్ని రకాల మానసిక సమస్యలు బ్రెయిన్ హెల్త్ ను దెబ్బతీస్తాయి. ఆందోళన, నిరాశ వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా ప్రమాదకారకాలు.
ముఖ్యంగా ఒక వ్యక్తి జీవనశైలి మెదడు ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని రకాల చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా మెదడు పనితీరును మెరుగ్గా మార్చేయొచ్చు. ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు, సమతుల్య ఆహారం, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చిత్తవైకల్యం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే మనం చేయాల్సిన ఆ ఆరు పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటమే కాదు.. బ్రెయిన్ హెల్త్ కూడా బాగుంటుంది. వ్యాయామం వల్ల భావోద్వేగ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఆలోచనలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా ఇది జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాకులత, చిత్తవైకల్యం, ఆందోళన వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిద్ర
ప్రతిఒక్కరూ 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్ర శరీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. నిద్రలేమి సమస్య వల్ల అధిక బరువు, డయాబెటీస్, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది.
విశ్రాంతి
రెస్ట్ లెస్ గా పనిచేయడం వల్ల శరీరం అలసిపోవడమే కాదు.. చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడి తగ్గేందుకు రోజూ ధ్యానం, యోగా లాంటివి చేయడానికి కాస్త సమయం కేటాయించండి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
smoking
స్మోకింగ్
సిగరేట్ తాగే వారి Cerebral cortex స్మోకింగ్ చేయని వారికంటే చాలా సన్నగా ఉన్నట్టు ఓ పరిశోధనలో తేలింది. Cerebral cortex బ్రెయిన్ భాగం. స్మోకింగ్ వల్ల మెదడుపై విపరీతమైన చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే అధిక రక్తపోటు, రక్తనాళాల సమస్యకు కూడా కారణమవుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన డైట్
ఆరోగ్యకరమై ఆహారాలు గుండె పనితీరే కాదు బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపెడతాయి. ముఖ్యంగా ఇవి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే మెదడును పనితీరును షార్ప్ గా చేసే విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఖనిజాలు, తృణధాన్యాలను రెగ్యులర్ గా తీసుకోండి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
నీళ్లను ఎక్కువగా తాగాలి
నీళ్లు మెదడు కణాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి సహాయపడతాయి. అంతేకాదు మెదడు పనికి ఆటంకం కలిగించే విషపదార్థాలను, మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతాయి. అంతేకాదు నీళ్లు మెదడుకు పోషకాలను రవాణా చేస్తుంది. మన బాడీని హైడ్రెట్ గా కూడా ఉంచుతుంది. నీళ్ల వల్లే మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తాయి. నీళ్లే మన శరీరంలో పేరుకు పోయిన మలినాలను, విషాలను బయటకు పంపుతుంది. అందుకే నీళ్లను పుష్కలంగా తాగండి.