Ants Phobia: చీమల భయంతో మహిళ సూసైడ్, ఏమిటీ చీమల ఫోబియా? ఇది అంత ప్రమాదకరమైనదా?
Ants Phobia: చీమల ఫోబియా ఉన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలో జరిగింది. దీంతో చీమల ఫోబియా గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. చీమలకు భయపడడాన్ని మిర్మెకోఫోబియా అని పిలుస్తారు.

చీమలతో బతకలేక
చీమలతో బతకలేను.. అంటూ ఒక మహిళ భర్తకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కాలివేలితో నలిపేస్తే చచ్చిపోయే చీమకు కూడా భయపడి నిండు ప్రాణాన్ని తీసుకుంది ఆ తల్లి. చిన్న చిన్న చీమలను చూసి కూడా మనిషి భయపడతాడని ఈ సంఘటన చెబుతోంది. అయితే అందరికీ చీమలంటే భయం ఉండకపోవచ్చు. కొంతమందికి బొద్దింకలను చూస్తే భయం. మరికొందరికి గబ్బిలాలను చూస్తే భయం, ఇంకొందరికి ఇంట్లో తిరిగే బల్లులను చూస్తే భయం.. వీటికి రకరకాల ఫోబియాలుగా పేర్లు పెడతారు. అలాగే చీమల ఫోబియా కూడా ఒకటి ఉంది. దీన్ని మిర్మెకోఫోబియా అని పిలుస్తారు.
మిర్మెకోఫోబియా అంటే?
మిర్మెకో ఫోబియా అనేది చీమల పట్ల అసహజమైన విపరీతమైన భయం. మిర్మెక్స్ అంటే చీమ అని గ్రీకులో అర్థం. ఇక ఫోబియా అంటే భయం. చీమలను చూడగానే లేదా తలచుకోగానే కలిగే ఒక రకమైన భయంకరమైన స్పందనను మిర్మెకోఫోబియా అంటారు. ఈ భయం సాధారణంగా చిన్న వయసులోనే ఏర్పడుతుంది. కొన్నిసార్లు చిన్నప్పుడు కలిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా ఇది రావచ్చు. ఉదాహరణకు చిన్నప్పుడు చీమలు విపరీతంగా కుట్టిన అనుభవం ఉన్నా లేక చీమలతో నిండిన ఒక భయంకరమైన ప్రదేశాన్ని చూసినా అది కొంతమంది పై మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి మిర్మేక ఫోబియా లాంటి భయాలు మొదలవుతాయి.
ఇలాంటి లక్షణాలు కలుగుతాయి
కొంతమంది వ్యక్తులకు మిర్మెకా ఫోబియా ఉంటుంది. అలాంటి వారికి చీమలు కనబడగానే ఒళ్లంతా చెమటలు పడతాయి. తలనొప్పి మొదలైపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఇక రోజూ అలాంటి చీమలను చూశారంటే వారికి జీవితం పైన విరక్తిగా అనిపిస్తుంది. వీరు చీమలు ఉన్న ప్రదేశానికి వెళ్లడానికే ఇష్టపడరు. వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ ఫోబియా ఉన్నవారి జీవితాలను చిన్న చీమ కూడా తలకిందులు చేస్తుంది. వంట గదిలో చీమలు కనబడితే చాలు భయంతో ఆ వంటగదికి వెళ్లడమే మానేస్తారు.
ఈ చికిత్స
మిర్మెకో ఫోబియా ఉన్న సంగతిని గుర్తించడమే కష్టం. ప్రతిఒక్కరూ ఇలాంటి ఫోబియాలపై అవగాహన పెంచుకోవాలి. తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్ పోజర్ థెరపీ వంటివి తీసుకోవాలి. మానసిక వైద్య నిపుణులను ఈ ఫోబియా ఉన్నవారు కలిపి తగిన చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యం. అదనంగా యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి చేసుకోవాలి. మానసిక ప్రశాంతతను అందించే పనులను చేసుకోవాలి.
వైద్య సహాయం తీసుకోండి
మిర్మెకో ఫోబియా అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదు. దీనికి చికిత్స ఉంది. కాబట్టి మీ భయాన్ని దాచి పెట్టుకోవద్దు. దాన్ని ఇంట్లో వారికి, అలాగే మీకు సహాయం చేయగల వ్యక్తులకు చెప్పండి. సరైన వైద్య సహాయం తీసుకోండి. ఈ ఫోబియా ఒక మానసిక రుగ్మత మాత్రమే.. పెద్ద వ్యాధి కాదు. లేనిది ఉన్నట్టుగా, జరగరానిది జరిగిపోతున్నట్టుగా భావించే ఒక మానసిక వ్యాధి. చీమను కూడా ఏనుగంత పెద్దదిగా ఊహించుకొని భయపడి పోవడం వల్లే ఈ ఫోబియా వస్తుంది. చిన్న చీమకు భయపడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు లేవు. ఆధునిక వైద్య విధానంలో ప్రతి దానికీ చికిత్స ఉంది. తగిన సమయంలో చికిత్స పొంది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
లక్షల మందికి ఫోబియాలు
ఒక అంచనా ప్రకారం మన ప్రపంచ జనాభాలో సుమారు 7 నుంచి 9 శాతం మందికి వివిధ రకాల ఫోబియాలు ఉన్నాయి. వాటిలో చీమల ఫోబియాతో భయపడుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. నిజానికి ఫోబియాలు ఎంతమందికి ఉన్నాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే చాలా మంది తమకున్న ఫోబియాలను బయట పెట్టరు. సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఏదైనా జీవిని చూసి లేదా పరిస్థితిని ఊహించుకొనిభయం కలిగితే దానికి సైకాలజిస్టుల సహాయాన్ని తీసుకోండి. మీ జీవితం సాధారణంగా మారుతుంది. అందరిలాగే మీరు కూడా సంతోషంగా జీవించగలుగుతారు. అంతే తప్ప చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని ప్రాణాలు తీసుకునేంతవరకు తెచ్చుకోకండి.