- Home
- Life
- Butter Capital: మన దేశపు వెన్న రాజధాని ఇది.. ఇక్కడ ఇప్పటికీ కవ్వంతో చిలికి వెన్న తయారు చేస్తారు..!
Butter Capital: మన దేశపు వెన్న రాజధాని ఇది.. ఇక్కడ ఇప్పటికీ కవ్వంతో చిలికి వెన్న తయారు చేస్తారు..!
Butter Capital: ఎన్నో రకాల వంటలకు కమ్మనైన రుచిని అందించడంలో వెన్న( బటర్) మందు వరసలో ఉంటుంది. కూరలకు రిచ్ నెస్ తీసుకువస్తుంది. అలాంటి బటర్ కి మన దేశంలో స్పెషల్ గా రాజధాని ఉందని మీకు తెలుసా?

వెన్నకు స్పెషల్ గా రాజధాని..
బటర్ నాన్, బటర్ చికెన్, పన్నీర్ బటర్ మసాలా... ఈ వంటలన్నీ ఎంత రుచిగా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్ లో ఈ వంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఖరీదు కూడా చాలా ఎక్కువే. అంత రుచి, ఖరీదు ఉండటానికి ఆ వంటల్లో కలిపే బటరే కారణం. మనకు ఏ సూపర్ మార్కెట్ కి వెళ్లినా బటర్ దొరికేస్తుంది. అంతెందుకు చాలా మంది ఇంట్లో కూడా చాలా సింపుల్ గా బటర్ చేసేస్తూ ఉంటారు. కానీ, అలాంటి బటర్ కి స్పెషల్ గా మన దేశంలో ఏకంగా ఒక రాజధాని ఉందని తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ ప్లేస్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి?
వెన్న కి రాజధాని...
తమిళనాడులోని ఒక చిన్న పట్టణంలో వెన్న కేవలం ఒక ఆహారం కాదు.. అది ఆ ఊరి గుర్తింపు, తరతరాల వారసత్వం. అందుకే ఆ పట్టణానికి బటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే అరుదైన బిరుదు దక్కింది. ఆ పట్టణం పేరే.. ఊత్తుకుళి. ఇది తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ తయారయ్యే సంప్రదాయ వెన్నను స్థానికంగా ఊత్తుకుళి వెన్నె అని పిలుస్తారు. పురాతన పద్దతుల్లో తయారు చేసే ఈ వెన్నకు ప్రత్యేక రుచి, నాణ్యత వల్ల దీనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఊత్తుకుళి వెన్న ఎందుకంత స్పెషల్..?
సూపర్ మార్కెట్లలో దొరికే ఫాక్టరీ వెన్నలా కాకుండా, ఊత్తుకుళి వెన్నకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఇక్కడ తయారు చేసే వెన్న చాలా మృదువుగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. వెన్న చిలకడానికి ముందు పాలు, మీగడను నిల్వ చేసే సంప్రదాయ పద్ధతి వల్లే దీనికి ఆ అద్భుతమైన రుచి వస్తుంది. ఇక్కడి స్థానిక తయారీదారులు ఇప్పటికీ దీనిని చిన్నచిన్న బ్యాచ్లలో తయారు చేస్తూ, ఆ అసలైన నాణ్యత చెడిపోకుండా కాపాడుతున్నారు.
ఈ వెన్నను ఎలా తయారు చేస్తారు?
ఆధునిక యంత్రాలు వచ్చినా, ఊత్తుకుళిలో ఇప్పటికీ శ్రమతో కూడిన సంప్రదాయ పద్ధతినే అనుసరిస్తున్నారు. ముందుగా తాజా పాలను బాగా మరిగించి, చల్లార్చిన తర్వాత పైన కట్టే మీగడను కొద్ది రోజుల పాటు సేకరిస్తారు.తగినంత మీగడ జమ అయ్యాక, మజ్జిగ నుండి వెన్న వేరయ్యే వరకు దానిని చిలుకుతారు. సంప్రదాయంగా దీనికోసం చెక్క కవ్వం ఉపయోగిస్తారు. అలా వచ్చిన వెన్నను శుభ్రంగా కడిగి, సరైన ఆకృతిలోకి తెచ్చాక విక్రయానికి సిద్ధం చేస్తారు. పాడి పరిశ్రమపై ఆధారపడి మొదలైన ఈ వెన్న తయారీ, నేడు ఊత్తుకుళికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచే వెన్న సరఫరా అవుతోంది.
బటర్ క్యాపిటల్, బటర్ సిటీ.. రెండింటికీ ఉన్న తేడా..
చాలామందికి ఈ విషయంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో వెన్నకు పేరుగాంచిన మరో పట్టణం కూడా ఉంది.
బటర్ సిటీ (Butter City of India): గుజరాత్లోని ‘బార్డోలీ’ పట్టణాన్ని 'బటర్ సిటీ' అని పిలుస్తారు. దక్షిణ గుజరాత్లో పాల సహకార ఉద్యమం, భారీ డెయిరీ పరిశ్రమల అభివృద్ధి వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
బటర్ క్యాపిటల్ (Butter Capital of India): తమిళనాడులోని ‘ఊత్తుకుళి’కి మాత్రం తరతరాలుగా వస్తున్న సంప్రదాయ, నాటు వెన్న తయారీ వారసత్వం వల్ల 'బటర్ క్యాపిటల్' అనే గౌరవం దక్కింది. ఇక్కడి వెన్న రుచి మరెక్కడా మీకు దొరకదు.













