Male river in India: భారతదేశంలో ఒకే ఒక్క మగనది ఏది? నదులకు స్త్రీల పేర్లే ఎందుకు?
Male river in India: మనదేశంలో నదులు ఎక్కువ. మనం నదులను దేవతలతో సమానంగా కొలుస్తారు. అయితే మనదేశంలో అన్ని నదులకు మహిళల పేర్లే ఉన్నాయి. కానీ ఒకేఒక్క నదికి మాత్రం మగ పేరు ఉంది. అదేంటో తెలుసా?

మనదేశంలో నదులు
మన దేశంలో ప్రతి నది ఒక దేవత. నదిని తల్లిలా భావిస్తారు. గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి వంటి నదులు కేవలం జలప్రవాహాలే కాదు కోట్లాది భారతీయులకు ప్రాణాధారం. అయితే ఈ నదుల మధ్యలో ఒక నది మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. అన్ని నదులు స్త్రీల పేర్లే పెట్టుకుంటే.. ఈ నది మాత్రం పురుషుని పేరును కలిగి ఉంది. అందుకే దీన్ని మగనదిగా భావిస్తారు. అదే బ్రహ్మపుత్రా నది. ఇది మన దేశంలోని ఒకే ఒక్క మగనదిగా పరిగణిస్తారు.
బ్రహ్మపుత్రా నది ప్రత్యేకత
‘బ్రహ్మపుత్రా’ అనే పేరు సంస్కృతంలో బ్రహ్మ కుమారుడు అనే అర్థం వస్తుంది. ఆ పేరు పురుష లింగానికి చెందినది. కాబట్టి నది కూడా మగనదిగానే పరిగణిస్తారు. అందువల్లే ఈ నది ఇతర నదుల్లా దేవత కాదు, దేవుడుగా చెప్పుకోవాలి. టిబెట్‌లోని మానసరోవర్ సరస్సు సమీపంలోని హిమాలయ పర్వత ప్రాంతంలో ఇది పుట్టింది. టిబెట్ లో ఈ నదిని యార్లంగ్ సాంగ్పో అనే పేరుతో పిలుస్తారు. అక్కడి నుంచి ఇది తూర్పు దిశగా ప్రవహించి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా బంగ్లాదేశ్‌లో ప్రవేశించి, చివరగా గంగా నదితో కలసి బంగాళాఖాతంలో కలుస్తుంది.
అసోంలో వరదలు
ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదులలో ఒకటి. వర్షాకాలంలో ఈ నది ఉగ్రరూపం దాలుస్తుంది. ఎన్నోసార్లు అసోంలో తరచూ భారీ వరదలకు కారణమవుతుంది. బ్రహ్మపుత్రా నది ప్రవాహం, దానికున్న శక్తి చూసి దీన్ని మగనదిగా చెప్పుకోవడం మన సంప్రదాయంలో భాగమైంది.
స్త్రీల పేర్లే ఎందుకు?
భారతీయ సంస్కృతిలో నదులను తల్లులుగా, దేవతలుగా పూజించే సంప్రదాయం వేల సంవత్సరాలనుండి కొనసాగుతోంది. నీటిని జీవనదాతగా భావించి మన పూర్వీకులు అలా నదిని దేవతలుగా భావించడం మొదలుపెట్టారు. పూజలు చేసి ప్రార్థనలు చేస్తారు. నది పంటలకు నీరు ఇస్తుంది. మనకు తాగునీటిని అందిస్తుంది. భూమిని సస్యశ్యామలం చేస్తుంది. ఈ స్వభావం తల్లిని గుర్తు చేస్తుంది. అందుకే నదులను స్త్రీలుగా పరిగణించేవారు. భారతీయ తత్వంలో శక్తి అనే భావన స్త్రీ రూపంలోనే ఉంటుంది. సృష్టికి మూలం శక్తి కాబట్టి, జీవాన్ని ప్రసాదించే నదులను స్త్రీగా గుర్తించారు.
నదులెంతో ప్రత్యేకం
నదులు భారతదేశంలో కేవలం భౌగోళిక వ్యవస్థలో భాగం మాత్రమే కాదు.. అవి మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, జీవన విధానానికి మూలం. ప్రతి నది తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు జీవనాధారం. గంగా నది ఉత్తర భారతానికి, గోదావరి నది దక్షిణ భారతానికి, కావేరి తమిళనాడుకు జీవనదాతలుగా ఉన్నాయి. బ్రహ్మపుత్రానది మాత్రం తన ఉగ్రశక్తితో, శక్తివంతమైన ప్రవాహంతో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆ నదిని పురుష శక్తిగా భావిస్తారు.