Telugu Riddles: మెదడుకు మేత.... ఈ పొడుపు కథలకు సమాధానాలు చెప్పగలరా?
Telugu Riddles: మన తెలుగు సంస్కృతిలో మాటల్లోనే ఓ మాయ ఉంటుంది. ఆ మాయలో భాగమే పొడుపు కథలు. ఈ కాలం పిల్లలకు పొడుపు కథలు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. మన చిన్నతనంలో వీటితో సరదాగా ఆటలు కూడా ఆడుకునేవారు. పొడుపు కథలు విప్పడం అంత సులువేమీ కాదు.

పొడుపు కథ అంటే ఏమిటి..?
పొడుపు కథ అనేది సాధారణంగా ఓ చిన్న కథ. కానీ దానిలో ఓ రహస్య అర్థం దాగి ఉంటుంది. బుద్ధికి పరీక్ష పెట్టడానికి అడిగే చిలిపి ప్రశ్న. దీనికి సమాధానం కనుక్కోవడం మెదడుకు మంచి వ్యాయామం లాంటిది. మరి.... ఇప్పుడు మేం కొన్ని పొడుపు కథలు అడుగుతాం.. వాటికి సమాధానాలు చెప్పుకోండి చూద్దాం....
పొడుపు కథల ప్రశ్నలు....
1.వంకర టింకర సొ, దానికి తమ్ముడు అ, మిరుగుడ్ల మి..
2.మూడు కళ్లు ఉంటాయి త్రిమూర్తి కాదు. నిండా నీళ్లు ఉంటాయి కుండ కాదు... ఏమిటిది?
3. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది. కాళ్లు లేవు కానీ నడుస్తుంది.. ఏమిటది?
4. ఎర్రటి పండు... పురుగైనా వాలదు.
5. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది.. మా ఇంటికి వచ్చింది.. తైతక్కలాడింది.
6. దిబదిబలాడేవి రెండు, దిబ్బెక్కి చూసేవి రెండు, ఆలకించేవి రెండు, అంది పుచ్చుకునేవి రెండు.. అది ఏమిటి?
7. తండ్రి కొడుకులు పొలం వెళితే... అత్తా కోడళ్లు భోజనం తీసుకువెళ్లి... ఎవరి నాన్నకు వాళ్లు అన్నం పెట్టారు..? ఎలా?
పొడుపు కథలకు సమాధానాలు...
1.వంకర టింకర సొ.. సొంటి, దానికి తమ్ముడు అల్లం, మిరుగుడ్ల మిరియాలు
2. కొబ్బరికాయ
3. మేఘాలు
4. నిప్పు, సూర్యుడు
5. కవ్వం
6. కాళ్లు, కళ్లు, చెవులు, చేతులు.
7. తాత,తండ్రి, కూతురు, మేనత్త
పొడుపు కథలు ఈ కాలం పిల్లలకు ఎందుకు చెప్పాలి? వీటితో ప్రయోజనం ఏంటి?
పొడుపు కథలు వినోదాన్ని పంచుతాయి. అంతేకాకుండా... పిల్లల్లో ఆలోచనా శక్తి పెరగడానికి, విశ్లేషణా సామర్థ్యం, మాటల్లో చమత్కారం పెరగడానికి సహాయపడతాయి. ఇక.. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్లు, గ్యాడ్జెట్లలో, స్క్రీన్లలో మునిగిపోతున్నారు. కనీసం కుటుంబంతో సమయం కూడా గడపడం లేదు. అలాంటి పిల్లలకు వీటిని పరిచయం చేస్తే... వారికి కూడా ఆసక్తి పెరుగుతుంది. తెలుగు భాష పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది.