టైప్ 2 డయాబెటీస్ రాకూడదంటే.. ఈ స్నాక్స్ తినండి
టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా జీవనశైలిలో మార్పుల వల్లే వస్తుంది. అందుకే లైఫ్ స్టైల్ ని మెరుగ్గా ఉంచుకోవాలి. అయితే కొన్ని ఆహారాలను తింటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొన్నేండ్ల నుంచి మన దేశంలో కూడా డయాబెటీస్ రోగుల సంఖ్య పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. డయాబెటిస్ లో అత్యంత సాధారణ రకం.. టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్.. డయాబెటిస్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో 2021 లో 74.2 మిలియన్ల డయాబెటీస్ పేషెంట్లు ఉంటే.. ఈ సంఖ్య 2045 నాటికి 124.9 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడైంది.
diabetes
జెనెటిక్స్, కుటుంబ చరిత్రతో పాటు, వయస్సు, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారంతో పాటుగా కొన్ని అలవాట్లు మధుమేహానికి ప్రమాద కారకాలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర, రక్తపోటు, రక్త లిపిడ్ స్థాయిలను మెరుగ్గా ఉంచడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. లేదా ఆలస్యం చేయవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడానికి మీరు మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన మూడు స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం పప్పులు
టైప్ -2 డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి బాదం పప్పులు బాగా సహాయపడతాయి. రోజూ 30 గ్రాముల బాదం పప్పులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటైన బాదం పప్పులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గడంతో పాటుగా.. కార్డియోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిరూపించబడింది. బాదం పప్పులను మీ ఆహారంలో చేర్చడానికి ఎన్నో మార్గాలున్నాయి.
వేరుశెనగ
వేరుశెనగలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక అధ్యయనం ప్రకారం.. వేరుశెనగలను తినడం వల్ల భోజనం చేసిన తర్వాత.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. ఇవి ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. తర్వాత భోజనంలో తక్కువగా తినడానికి సహాయపడుతుంది. మరొక అధ్యయనంలో.. ఆరు వారాల పాటు వేరుశెనగలు తిన్న వ్యక్తుల్లో.. గోధుమలను తిన్న వారి కంటే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది. వేరు శెనగలను సలాడ్ రూంలో తీసుకోవచ్చు.
పెరుగు
ఆరోగ్యకరమైన ఆహారంలో పెరుగు ఒకటి. నిజానికి మన శరీరానికి పెరుగు చేసే మేలు ఎంతో.. పెరుగు పెద్దలలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. పెరుగు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 14 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. అయితే రుచిగా ఉంటుందని పెరుగులో చక్కెర వేసుకోకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే సాదా పెరుగును మాత్రమే తినండి.