Maida Making: మైదాలో కలిపే రసాయనం ఇదే, అందుకే ఆ పిండి అంత తెల్లగా ఉంటుంది
మైదా పిండి (Maida) ఉపయోగించి ఎన్నో స్వీట్లను తయారుచేస్తారు. వైద్యులు చెబుతున్న ప్రకారం మైదాపిండితో చేసిన ఏ ఆహారాన్నీ తినడం మంచిది కాదు. మైదా పిండిలో కొన్ని రకాల రసాయనాలను కడుపుతారు. ఆ రసాయనాలు ఏంటో తెలుసుకోండి.

మైదా పిండి తక్కువ ధరకే
మైదాపిండి ఎలా తయారవుతుందో చాలామందికి తెలియదు. కానీ ఆ పిండి తక్కువ ధరకే వస్తుంది కాబట్టి చిటికెలో కొనేస్తారు. దానితో అనేక రకాల స్వీట్లు కూడా చేసుకోవచ్చు... పూరీలు, కేకులు, బ్రెడ్లు వంటివి తయారు చేస్తారు. నిజానికి మైదాపిండితో ఉండే ఇలాంటి ఆహారాలను తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మైదాపిండిలో వాడే రసాయనాలు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మైదాపిండి ఎలా తయారవుతుంది?
మైదాపిండి మూలం గోధుమలే. గోధుమపిండిని తయారు చేసేందుకు గోధుమలను మిల్లులో వేసి పిండి చేస్తారు. దీంట్లో ఎలాంటి రసాయనాలు కలపరు. కాబట్టి గోధుమపిండి రంగు కూడా క్రీమ్ కలర్లో ఉంటుంది. అదే మైదాపిండి తళ తళలాడుతూ తెల్లగా కనిపిస్తుంది. ఇందుకోసం ముందుగా గోధుమలను తీసుకొని పాలిష్ చేస్తారు. పాలిష్ లో భాగంగా గోధుమలపై ఉన్న పై పొరలను చాలా వరకు తీసేస్తారు. నిజానికి గోధుమలోని పై పొరల్లోనే పోషకాలన్నీ ఉంటాయి. పై పొరలన్నీ తీసేసాక మిగిలిన గోధుమలను పిండి ఆడతారు. ఆ పిండి కూడా తెల్లగా ఉండదు. క్రీమ్ కలర్ లోనే ఉంటుంది.
ఈ రసాయనాలు కలుపుతారు
ఇప్పుడు వచ్చిన ఆ పిండిని తెల్లగా మార్చేందుకు కొన్ని రకాల రసాయనాలను కలుపుతారు. క్లోరిన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్, అజెడోకార్బోనోమైడ్ వంటివన్నీ కలుపుతారు. అవి కలిపిన తర్వాత మైదా మరింత మృదువుగా వచ్చేందుకు పొటాషియం బ్రోమేట్ ను కలుపుతారు. ఇవన్నీ కలిపిన తర్వాతే మైదా తెల్లగా, మృదువుగా వస్తుంది. ఇలాంటి రసాయనాలు కలిపిన మైదాను మనం స్వీట్ల రూపంలో, పూరీల రూపంలో తినేస్తూ ఉంటాము.
మైదా తింటే పురుగులే చచ్చిపోతాయి
నిజానికి మైదాతో చేసిన ఆహార పదార్థాలను తినకపోతేనే ఆరోగ్యం. దీనిలో కలిపే రసాయనాల వల్ల ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మైదా పిండిలో బ్రోమేట్ వాడతారు. బ్రోమేట్ అనేది క్యాన్సర్ కారకమని ఎప్పుడో గుర్తించారు. దీనిపై చాలా చోట్ల నిషేధం కూడా ఉంది. నిజానికి మైదా తిన్న తర్వాత ఎన్నో రకాల పురుగులు మరణిస్తాయి. మైదా పిండిని నీటిలో కలిపితే జిగటగా మారుతుంది. దాన్ని ఒకప్పుడు గోడలకు పోస్టర్లు అతికించడానికి కూడా ఉపయోగించేవారు.
వీటిని తినకండి
రుచి కోసం చూసి మైదాతో చేసే వంటలు తింటే ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మార్కెట్లో దొరికే జిలేబీలు, కాజాలు, బొబ్బట్లు, బ్రెడ్లు, పరోటాలు, కేకులు, రస్క్ లు వంటివన్నీ కూడా మైదాతో చేసే ఆహారాలే. ఇలాంటివి తినడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా ఎన్నో రకాల రోగాలు వస్తాయి.