- Home
- Life
- Twin Village: ఇది ‘కవలల గ్రామం’...ఇంటికో ఇద్దరు కవలలు గ్యారెంటీ, ఈ విలేజ్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Twin Village: ఇది ‘కవలల గ్రామం’...ఇంటికో ఇద్దరు కవలలు గ్యారెంటీ, ఈ విలేజ్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Twin Village: ఎవరి కుటుంబంలో అయినా ఒకరికి కవలలు పుడితేనే వాళ్లని అందరూ చాలా స్పెషల్ గా చూస్తారు. అలాంటిది ఒక గ్రామం మొత్తం కవలలతో నిండి ఉంటే..? ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు కవలలు ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి గ్రామం ఒకటి మన దేశంలోనే ఉంది.

కవలల గ్రామం
ఎవరికైనా కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. అందుకే, అలా ఎవరైనా కవల పిల్లలు కనిపిస్తే.. అందరూ వారిని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. ఒకరిద్దరు కవలలు కనిపిస్తూనే.. అందరి కళ్లు వారిపైనే ఉంటాయి. అలాంటిది.. ఒక ఊరు ఊరంతా కవల పిలల్లే ఉంటే ఇంకెలా ఉంటుంది? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కొడిన్హి అనే చిన్న గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ‘ ట్విన్ విలేజ్’ ( కవలల గ్రామం) గా గుర్తింపు పొందింది. భారత దేశ సగటు ప్రకారం వెయ్యి మంది మహిళలు డెలివరీ అయితే.. వారిలో 9 మందికి మాత్రమే కవలలు జన్మిస్తున్నారు. కానీ, ఈ గ్రామంలో మాత్రం.. ఏకంగా 42 కంటే ఎక్కువ ఉండటం విశేషం.
ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటి?
ఈ కొడిన్హి గ్రామంలో దాదాపు 2వేల కుటుంబాలు మాత్రమే నివసించే చిన్న గ్రామం అది. అంత చిన్న గ్రామంలో 400 నుంచి 500 మంది కవల పిల్లలు ఉండటం విశేషం. ఎవరు ఏంటి అనే విషయం కొత్తగా చూసే వాళ్లకు మాత్రమే కాదు.. వాళ్లకు చదువు చెప్పే టీచర్లకు కూడా తలనొప్పిగా మారింది. ఒక్కో క్లాసులో కనీసం ఐదు నుంచి ఆరు జంటల కవల పిల్లలు చదువుతున్నారు. దీంతో.. ఎవరికి మార్కులు వేయాలి? ఎవరిని ప్రశ్నలు అడగాలి అని వాళ్ల టీచర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ గ్రామంలో ఈ వింత దాదాపు 60 నుంచి 70 ఏళ్ల క్రితం ప్రారంభమవ్వగా, ఈ వింత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరో విచిత్రం ఏమిటంటే.. ఈ ఊరి అమ్మాయిలు వేర ఊరికి కోడలిగా అడుగుపెట్టినా, లేదా వేరే ఊరి అమ్మాయిలు ఇక్కడికి కోడలిగా వచ్చినా.. వారికి కవల పిల్లలు జన్మించడం విశేషం.
సైన్స్ సైతం తేల్చలేని మిస్టరీ..
కొడిన్హి వింతను ఛేదించడానికి జర్మనీ, బ్రిటన్లతో పాటు అనేక అంతర్జాతీయ పరిశోధక బృందాలు ఈ గ్రామాన్ని సందర్శించి రీసెర్చ్ చేశాయి. వీరికి కవలలు ఎలా జన్మిస్తున్నారు అని చాలా పరిశోధనలు చేశారు. ఇక్కడి ప్రజలు తాగే నీటిలో గానీ, తినే ఆహారంలో గానీ ఎలాంటి ప్రత్యేక రసాయనాలు లేవని తేలింది. పరిశోధకులు డీఎన్‌ఏ శ్యాంపిల్స్ సేకరించి పరిశీలించినా, జన్యుపరంగా దీనికి కచ్చితమైన కారణాన్ని సైన్స్ ఇప్పటివరకు కనుగొనలేకపోయింది.
‘ట్విన్స్ అసోసియేషన్’ (TAKA)..
కవలల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ఇక్కడి ప్రయాణికులు, గ్రామస్తులు కలిసి TAKA (Twins and Kins Association) అనే ప్రత్యేకమైన ఒక సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ కవల పిల్లల విద్య, వైద్యం, ఆర్థిక సంక్షేమానికి ఈ సంఘం సహాయం చేస్తుంది. అందరికీ మిస్టరీగానే మిగిలిపోయిన ఈ గ్రామాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది పర్యాటకులు రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు.

