ఇందుకే కళ్ల చుట్టు నల్లగా అవుతుందా
ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అయితే ఒత్తిడి, స్క్రీన్ ను ఎక్కువ సేపు చూడటం, నిద్రలేమి వల్లే ఇలా అవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి వేరే కారణాలు కూడా ఉన్నాయి.

డార్క్ సర్కిల్స్
డార్క్ సర్కిల్స్ సర్వ సాధారణ సమస్య. మగవారికి , ఆడవారికి ఈ సమస్య వస్తుంది. అయితే ఇలా కావడానికి రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడమేనని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే నిద్రలేమితో పాటుగా వేరే కారణాల వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జెనెటిక్స్
జెనిటిక్స్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ అవుతాయి. అంటే మీ ఇంట్లో మీ తాత లేదంటే మీ నాన్నకు, మీ కుటుంబంలో ఏ ఒక్కరికి ఈ సమస్య ఉన్నా అది మీకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యను రాకుండా ఆపలేం. కాకపోతే కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు.
హైపర్ పిగ్మెంటేషన్
మెలనిన్ ఉత్పత్తి ఎక్కువయ్యే వారికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. తామర, సూర్యరశ్మి వంటి వివిధ కారణాల వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన కిరణాల వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరిగి డార్క్ సర్కిల్స్ సమస్య మరింత పెరుగుతుంది.
అలెర్జీ, కళ్లను రుద్దడం
దుమ్ముకు అలెర్జీ ఉన్నా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఏ రకమైన స్కిన్ అలెర్జీ ఉన్నా కళ్లలో దురద, చికాకు కలుగుతుంది. అలాగే కళ్లను ఎప్పుడూ రుద్దడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం కింది రక్తనాళాలు దెబ్బతిని డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అలాగే వాపు కూడా వస్తుంది.
డీహైడ్రేషన్
డీహైడ్రేషన్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు దీనివల్ల డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి. డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రై అయ్యి సమస్య వస్తుంది. దీనివల్ల కళ్ల కింది రక్త నాళాలు క్లియర్ గా కనిపిస్తాయి. దీనివల్ల కళ్ల చుట్టూ నల్లగా కనిపిస్తుంది.
వయసు
వయసు పెరుగుతున్న కొద్ది చర్మ స్థితిస్థాపత తగ్గుతుంది. అలాగే కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. అలాగే వయసు మీదపడిన వారి కళ్ల చుట్టూ ఉన్న చర్మం పలుచగా అవుతుంది. దీనివల్ల కళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలు క్లియర్ గా కనిపిస్తాయి. దీనివల్ల కళ్ల చుట్టూ నల్లగా కనిపిస్తుంది.
ఐరన్ లోపం
ఐరన్ లోపం ఉన్నవారికి కూడా కళ్ల చుట్టూ నల్లగా అవుతుంది. ఎవరి శరీరంలో అయితే ఇనుము తక్కువగా ఉంటుందో వారి చర్మం పసుపు పచ్చగా కనిపిస్తుంది. అలాగే కళ్ల చుట్టూ ఉన్న చర్మం ముదురు రంగులోకి మారుతుంది. ఎందుకంటే చర్మం కింది కణజాలలాకు అవసరమైన ఆక్సిజన్ అందదు.
ఒత్తిడి
ఒత్తిడి వల్ల ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ అవుతాయి. అలాగే ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా చూడటం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.