ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయను తింటే ఏమౌతుందో తెలుసా?
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో బిడ్డ బలంగా ఎదిగేందుకు.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది.
బెండకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ బెండకాయను తింటే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయట. అందుకే చాలా మంది బెండకాయను ఇష్టంగా తింటుంటారు. ప్రతిరోజూ బెండకాయను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు మాత్రం బెండకాయలను మిస్ చేయకుండా తినాలని సలహానిస్తున్నారు.
బెండకాయలో విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాపర్, జింక్, సిలీనియం, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. బెండకాయలో కరగని ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయను మరువకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బెండకాయ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతుుది. ఇక బెండకాయలో పుష్కలంగా ఉండే ఫోలేట్ మీ బిడ్డ బ్రెయిన్ నిర్మాణం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బెండకాయ నుంచి గర్భిణులకు కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. దీంతో తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లికే కాదు.. బిడ్డ రోగనిరోధక వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ బిడ్డ కండరాలను, ఎముకలను బలంగా చేస్తుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మీ బిడ్డను, మిమ్మల్ని రక్షిస్తాయి.
బెండకాయలో ఫినాలిక్ , కెరోటినాయిడ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెండకాయలను తినడం వల్ల దంత క్షయం తగ్గుతుంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
మీకు తెలుసా.. బెండకాయ ఓవర్ వెయిట్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఈ బెండకాయ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బెండకాయ ఎముకలను బలంగా చేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేందుకు సహాయపడుతుంది. అయితే బెండకాయను కడగడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో పోషకాలు తగ్గకూడదంటే.. తక్కువ మంటపై బెండకాయ కూరను వండాలి.