Tips and Tricks: గోడల మీద మొండి మరకలు వదలడం లేదా? బేకింగ్ సోడా చాలు..!
ఇంట్లో చాలా రకాల మరకలను సులభంగా వదిలించుకోవడానికి మీరు కేవలం బేకింగ్ సోడా వాడితే చాలు. అంతేకాదు.. కొత్తవాటిలా మెరిసేలా కూడా చేయవచ్చు.

tips and tricks
ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుందామని అనుకున్నా కూడా గోడల మీద మరకలు పడుతూనే ఉంటాయి. ఆ మరకలు అంత తొందరగా వదలవు. అందుకే... చాలా మంది మార్కెట్లో లభించే కెమికల్ ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. కానీ... వాటిలో ఉండే రసాయనాలు మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. చర్మ సంబంధిత సమస్యలు, శ్వాస సమస్యలు, అలెర్జీలు రావచ్చు. అంతేకాదు... గోడలు కూడా పాడైపోతాయి. అందుకే వాటితో పని లేకుండా.. కేవలం బేకింగ్ సోడా వాడి.. గోడలమీద మరకలను తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
కిచెన్ లో నూనె మరకలను తొలగించే బేకింగ్ సోడా....
వంట చేస్తున్నప్పుడు స్టవ్ లేదా కౌంటర్ టాప్, గోడల పై నూనె మరకలు పడటం సహజం. వాటిని తొలగించడానికి మీరు ఒక గిన్నెలో బేకింగ్ సోడా, నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు నూనె మరకలపై పూసి రుద్దితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఆ మరకలపై రుద్ది.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
బాత్రూమ్ టైల్స్, గోడలపై పసుపు మరకలను తొలగించడానికి...
బాత్రూమ్ లో గోడలు, టైల్స్ కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు డైరెక్ట్ గా బేకింగ్ సోడా చల్లాలి. కాసేపటి తర్వాత రుద్దితే చాలా సులభంగా ఆ మరకలు వదులుతాయి. మెరుగైన ఫలితాల కోసం బేకింగ్ సోడాతో పాటు నిమ్మకాయ రసం, వెనిగర్ కూడా వాడొచ్చు.
వాటర్ ట్యాప్స్ ఎలా శుభ్రం చేయాలంటే....
బాత్రూమ్ లో, కిచెన్ లో వాటర్ ట్యాప్స్ తుప్పు పట్టినట్లుగా కనిపిస్తున్నాయా? అయితే... మీరు మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాకి కొద్దిగా నీరు కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ఆ వాటర్ ట్యాప్ లపై రుద్దాలి. అరగంట తర్వాత బ్రష్ తో రుద్దితో చాలు. కొత్త వాటిలా కనపడతాయి.
గోడలపై పెన్సిల్, క్రేయాన్స్ మరకలు....
చాలా మంది పిల్లలు ఇంట్లో గోడలమీద పెన్సిల్, క్రేయాన్స్ తో గీతలు గీసేస్తూ ఉంటారు. అవి కూడా అంత తొందరగా వదలవు. అలాంటి మరకలను కూడా బేకింగ్ సోడాతో శుభ్రం చేయవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని గీతలపై రాసి కొద్దిసేపు ఉంచండి. తర్వాత ఒక క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. ఆ మరకలన్నీ సులభంగా వదులుతాయి.