ముఖానికి హెయిర్ డై మచ్చలు.. తొలగించడానికి నేచురల్ టిప్స్ పాటించండి
ప్రస్తుతం చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా తెల్ల వెంట్రుకల సమస్య వేధిస్తోంది. దీంతో హెయిర్ డై వేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే నెత్తికి రంగు వేసుకునే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలాంటి వాటిలో చర్మానికి రంగు అంటుకోవడం ఒకటి. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలంటే..
అందంగా కనిపించాలనే కోరిక అందరిలో పెరుగుతోంది. ముఖ్యంగా కేశాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెల్ల వెంట్రుకలు కనిపించకుడా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం చాలా మంది హెయిర్ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే వెంట్రుకలకు కలర్ వేసే సమయంలో చర్మానికి రంగు అంటుకుంటుంది. ఈ రంగు అంత సులభంగా వదలదు. అయితే ఈ మచ్చలను తొలగించడానికి కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెనిగర్, బేబీ ఆయిల్..
హెయిర్ డైతో ఏర్పడే మచ్చలకు చెక్ పెట్టడంలో వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం వెనిగర్‌లో ముంచిన దూదిని మచ్చ పడిన చోట రుద్దాలి. ఇలా చేయడం వల్ల రంగు తొలగిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు.
చిన్నపిల్లకు ఉపయోగించే బేబీ ఆయిల్ కూడా ఇందుకు ఉపయోగపడుతుంది. బేబీ ఆయిల్‌ను తీసుకొని మచ్చలు ఉన్న చోట కొద్దిగా వేసి మునివేళ్లతో రుద్దాలి. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ, నెయిల్ పాలిష్ రిమూవర్..
నిమ్మకాయ రసం కూడా హెయిర్ డై రంగును తొలగిస్తుంది. చిన్న నిమ్మకాయ ముక్కను తీసుకొని మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్దాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా హెయిర్ డై మచ్చలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. కాటన్ బాల్‌పై కొంత నెయిల్ రిమూవర్‌ను తీసుకొని మచ్చ ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగితే మచ్చ తొలగిపోతుంది. అయితే నెయిల్ పాలిష్ చర్మంపై కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది.
hair dyer
వీటితోపాటు..
నేచురల్ టిప్స్‌తో పాటు హెయిర్ డైలు తొలగించే ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మానికి అంటిన రంగులను తొలగించుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.