Mumbai Name Origin: ముంబా దేవి.. ఈ దేవత పేరు మీదే ముంబై నగరం, ఈ దేవత కథ ఏంటో తెలుసుకోండి
Mumbai Name Origin: ముంబాదేవి పేరును చాలా తక్కువమందే విని ఉంటారు. కొన్ని పౌరాణిక కథల్లో ముంబాదేవి పేరు వినిపిస్తుంది. ముంబాదేవి పేరు మీదే ముంబై నగరం వచ్చిందని చెబుతారు.

ముంబై వెనుక ముంబా దేవి
ముంబై నగరం పేరు చెబితేనే ఆధునికత, బాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈ మహానగరం ఒక పౌరాణిక కథలో భాగమైంది. ఆ నగరానికి పేరు వచ్చింది ముంబాదేవి అనే దేవత వల్ల. ఈ దేవతకు ముంబై సంస్కృతిలో, సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకుంటారు. అనేక పౌరాణిక కథలో గ్రంథాలలో ఈ పేరును ప్రస్తావించారు.
ముంబా దేవి ఎవరు?
ముంబా దేవి ఎవరో కాదు.. ఆమెను దుర్గాదేవి అవతారంగానే భావిస్తారు. ముంబై నగరాన్ని సముద్రపు అలల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, సముద్ర దేవుడి కోపం నుంచి కాపాడేది ముంబాదేవి అని చెప్పుకుంటారు. పురాణాల ప్రకారం ముంబైని కాపాడే పోషక దేవతగా ఈమెకు పేరు ఉంది. ప్రాచీన కాలంలో ముంబై ప్రాంతంలో వ్యవసాయం, చేపలు పట్టడం వంటి పనులు చేసుకుంటూ అందరూ జీవించేవారు. తమను కాపాడమని ముంబా దేవిని కుటుంబ దేవతగా భావించేవారు. ఆమె తుఫానులు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడుతుందని వారి నమ్మకం.
కోరికలు నెరవేర్చే దేవత
ముంబా దేవికి ఆలయాన్ని కూడా నిర్మించి వెండి కిరీటం, బంగారు ఆభరణాలతో అలంకరించేవారు. విగ్రహానికి ఎర్రటి వస్త్రాలను ధరింపచేసేవారు. ముంబాదేవికి ఎనిమిది చేతులు ఉంటాయని.. ఆమె ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో కమలం, విల్లు, బాణాలు, కత్తి ఇలా రకరకాల ఆయుధాలను పట్టుకుని ఉంటుందని చెబుతారు. ఇంకా ఆమె వాహనం సింహమే. ముంబా దేవిని నిజమైన హృదయంతో కొలిస్తే ఏ కోరికైనా నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు.
ఎక్కడుంది?
ముంబైలో ఉన్న అతి పురాతన దేవాలయాల్లో ముంబాదేవి ఆలయం కూడా ఒకటి. ఇది దాదాపు 400 ఏళ్ల నాటిదని చెప్పుకుంటారు. అప్పుడు జీవించిన కోలి అనే తెగ ప్రజలు దీన్ని నిర్మించారని అంటారు. దీనిని మొదట బోరిబందర్ ప్రాంతంలో కట్టారు. అయితే బ్రిటీష్ పాలనలో 1737లో భూలేశ్వర్ ప్రాంతానికి మార్చారు. ఇప్పటికీ ఆలయం అక్కడే ఉంది. ముంబై నగరానికి ముంబా దేవత పేరు మీదే నామకరణం చేశారు. బ్రిటిష్ కాలంలో దీన్ని బాంబే అని పిలిచేవారు. స్థానికులు మాత్రం ముంబై అనే ఉపయోగించేవారు. ఇక 1995లో బాంబే నుంచి ముంబై అని అధికారికంగా పేరు మార్చుకుంది ఈ నగరం.
ముంబైకి ఈమె పేరే..
ముంబైకి ఆ పేరు పెట్టడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. పురాతన కాలంలో ముంబారక అనే భయంకరమైన రాక్షసుడు ఆ ప్రాంతంలో నివసించేవాడు. అతను దేవుళ్లను మానవులను హింసించేవాడు. దేవతలు అతని అణచివేయాలని కోరుతూ ఆదిశక్తిని ప్రార్థించారు. అప్పుడే ఆ ఆదిశక్తి ముంబాదేవిగా అవతారం ఎత్తి ఆ రాక్షసుడితో భీకర యుద్ధం చేసింది. చివరికి అతడిని సంహరించింది. అందుకే ఆ దేవతను గౌరవిస్తూ ఈ నగరానికి ముంబై అనే పేరు పెట్టారు. ఆ దేవత ఎవరో కాదు ముంబా దేవత.