Kidney Failure: మూత్రపిండాల వ్యాధిని తగ్గించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. !
Kidney Failure: మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే రక్తంలోని మలినాలు త్వరగా ఫిల్టర్ కావు. అందుకే మూత్రపిండాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే రక్తంలోని మలినాలు బయటకు పోతాయి. కానీ చాలా మంది మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలు రక్తంలోని మలినాలను త్వరగా ఫిల్టర్ చేయవు. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ సమస్యను గుర్తించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
మూత్రపిండాల వైఫల్యం జరిగితే కాళ్లలో వాపు, మూత్ర పరిమాణం తగ్గడం, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రపిండాలకు రక్త ప్రవాహంలో అడ్డంకులు, మూత్రాన్ని విసర్జించే గొట్టాలలో అడ్డంకుల కారణంగా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది.
దెబ్బతిన్న మూత్రపిండాలను రక్షించడానికి, ఇవి త్వరగా కోలుకోవడానికి తాత్కాలికంగా డయాలసిస్ అవసరం కావచ్చు. ఈ డయాలసిస్ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి, జీవ రసాయన సమతుల్యతను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
మూత్రపిండాల వైఫల్యానికి గురై దీనికి చికిత్స తీసుకుంటున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, నారింజ పండ్లు, బంగాళాదుంపలను తినకూడదని చెబుతున్నారు.
ఈ రోగులు పొటాషియం తక్కువగా ఉండే పండ్లైన బొప్పాయి, యాపిల్స్, జామ, స్ట్రాబెర్రీలను పుష్కలంగా తినొచ్చని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వీళ్లు ఉప్పును ఐదు గ్రాములకు మించి అసలే తీసుకోకూడదు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, తియ్యటి పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ధూమపానం
మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి వీరి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి.