True Story: నా భర్తను మోసం చేశాను.. అతడిని క్షమాపణ ఎలా అడగాలో తెలియడం లేదు, సలహా ఇవ్వండి
ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. కొంతమంది తెలిసి చేస్తే, మరికొందరు తెలియక చేస్తారు. ఎలా చేసినా తప్పు తప్పే. ఒక యువతి తన జీవితంలో చేసిన తప్పును మనతో పంచుకుంది. ఇది ఆమె నిజ జీవిత (True Story) కథ.

True story
నా పేరు మణి. అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకున్నాను. ఎంతో మంచి అమ్మాయిగా, తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్నాను. చేతన్ భగత్ రాసిన నవల ‘టు స్టేట్స్’ చదివాను. అది నాకు ఎంతో నచ్చేసింది. నేను కూడా అలా వేరే రాష్ట్రానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. చదువుతున్నప్పుడే ఐఐఎంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఇద్దరం వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారమే. ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టాం. మా కుటుంబాలకు కూడా విషయం చెప్పాము. మేము చాలా పెద్ద యూనివర్సిటీలో చదివాం కాబట్టి ఉద్యోగం రావడం మాకు చాలా సులువు. అంతేకాదు జీతం కూడా అధికంగానే ఉంటుంది. అనుకున్నట్టే మా ఇద్దరికీ వేరు వేరు కంపెనీలలో పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరికీ పెళ్లి చేయడం ఒక్కటే మిగిలింది. దానికి కూడా కుటుంబం ఓకే చెప్పేసింది. మా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. అంతా బాగున్నప్పుడే ఏమైందో తెలియదు. నన్ను ప్రేమించిన వ్యక్తి ఆ పెళ్లిని వద్దని దూరంగా వెళ్ళాడు. దాంతో నా ఇగో చాలా దెబ్బతింది
ప్రైవేటు ఫోటోలు తొలగించి
అతను చేసిన పనికి చాలా ఆందోళనగా అనిపించేది. నిరాశగా కూడా ఫీలయ్యేదాన్ని. అదే సమయంలో నా ఆఫీసులో ఉండే మేనేజర్ నా మీద ఆసక్తి చూపించేవాడు. అతడికి ఒకరోజు నా బాధ అంతా చెప్పుకున్నాను. అప్పటి నుంచి అతను మంచి స్నేహితుడు అయిపోయాడు. నేను అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దానికన్నా ముందు నేను చేయాల్సిన పని నాకు గుర్తొచ్చింది.
నా పాత ప్రియుడు దగ్గర మా ఫోటోలు చాలా ఉన్నాయి. అందులో మా ఇద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో మా అమ్మతో కలిసి ఆ అబ్బాయి ఇంటికి వెళ్లాను. అతనికి ఇంకా నా మీద ప్రేమ ఉన్నట్టే అనిపించింది. అందుకే నా కళ్ళముందే అన్నిఫోటోలు ఫోన్ లోంచి తీసేసాడు. నేను ప్రస్తుతం పెళ్లి చేసుకునే అబ్బాయిని కూడా నాతో పాటు తీసుకెళ్లాను. అతడి దగ్గరకి నా పాత ప్రియుడు తల్లి వచ్చి ‘నా కొడుకు ఏదో తప్పు చేశాడు... అందుకే ఆమె వదిలి వెళ్ళిపోయింది. మనమందరం కూడా ఆమెను అంగీకరించాలి. రేపు తప్పు చేస్తే నిన్ను కూడా ఆమె వదిలి వెళ్ళచ్చు.. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పింది. అప్పుడే నా జీవిత కథ మలుపు తిరుగుతుందని అర్థం చేసుకోలేకపోయాను.
పెద్ద తప్పు చేశాను
మా ఇద్దరికీ అనుకున్నట్టుగానే పెళ్లయింది. నేను గర్భం ధరించాను. ఆరు నెలల వయసులోనే పుట్టిన ఆడపిల్ల చనిపోయింది. దాంతో నాకు గుండె పగిలిపోయింది. కాకపోతే ఇంకా నాకు చిన్న వయసే కాబట్టి మరోసారి తల్లి కావచ్చు అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. నేను ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నాను. నా భర్త మాత్రం ఆఫీస్ కు వెళ్తున్నాడు. అదే సమయంలో పక్కింటి అబ్బాయి నా జీవితంలోకి ప్రవేశించాడు. అతను నాకంటే చాలా చిన్నవాడు. అతనితో నేను ఎందుకు ఆకర్షణకు గురయ్యానో తెలియదు. కానీ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాను. నాకు నా భర్తను మోసం చేస్తున్నానని తెలుసు.. కానీ నాకన్నా చిన్న వాడితో ఉండడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.
ఈ లోపు నా భర్తకు జర్మనీలో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు నేను కూడా జర్మనీ వెళ్లిపోయాను. అక్కడ కొత్త జీవితం ప్రారంభించాను. నాకు కూడా ఉద్యోగం వచ్చింది. నా భర్త స్నేహితులు నాకు కూడా స్నేహితులు అయ్యారు. ఒకసారి ఓ విదేశీ స్నేహితుడు దగ్గర నా పాత వివాహ యాత్ర సంబంధం గురించి చెప్పాను. అతడు చాలా బాధపడ్డాడు. ‘నువ్వు నీ భర్తను మోసం చేస్తున్నావు.. నేను ఆ విషయం అతనికి చెప్పేస్తాను’ అన్నాడు. అతనితో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నేనే నా భర్తకి చెబుతానని అన్నాను.
నాతో కలిసి జీవిస్తాడో లేదో
ఒకరోజు నా భర్తతో నేను చేసిన తప్పు గురించి చెప్పేసాను. అప్పుడే నాకు షాకింగ్ విషయం తెలిసింది. నా భర్తకు అప్పటికే నా మీద అనుమానం వచ్చిందట. అతడిని నేను మోసం చేసినా కూడా నన్ను ఏమీ అనకుండా ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన మొత్తం మారిపోయింది. నాతో కలిసి జీవించేందుకు ఇష్టపడడం లేదు. త్వరలో నా భర్త ఇండియాకు వెళ్లిపోతున్నాడు. నన్ను కూడా తీసుకెళ్తాడా లేదో తెలియదు. ఇండియా వెళ్ళాక నాతో కలిసి ఉంటాడో లేదో కూడా తెలియడం లేదు. కానీ నా మనసు నాకు చెబుతోంది... ఇకపై నేను ఏ తప్పు చేయనని. అది నా భర్తకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. అతను నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరుగుతుందో కూడా లేదో కూడా తెలియదు. నాలాగా ఎవరూ తప్పులు చేయకండి.చెడు ఆకర్షణలకు లోనై సంసారాన్ని నాశనం చేసుకోకండి. ఒంటరిగా అనిపిస్తే వివాహేతర సంబంధాలే పెట్టుకో అక్కర్లేదు. చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుకోవచ్చు లేదా ఏదైనా ఇష్టమైన హాబీని తో బిజీగా మారొచ్చు. నాలా మాత్రం జీవితం నాశనం చేసుకోవద్దు.