Hyderabad Rains : భారీ వర్షాల వేళ సహాయం కోసం ... ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయండి
హైదరాబాద్ లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో నగరవాసులు ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటే ఈ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు.
- FB
- TW
- Linkdin
Follow Us

వర్షాల వేళ సహాయంకోసం ఫోన్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు
Hyderabad Rains : చివరికి తెలుగు ప్రజలు ఎదురుచూసిన రోజులు వచ్చేసాయి. వర్షాకాలం అన్నమాటేగానీ గత నెలంతా (జూన్) వర్షాలే లేవు... దీంతో తెలుగు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. జులై ఫస్ట్ హాఫ్ లో కూడా వర్షాల జాడ లేదు... కానీ ఇప్పుడు వానలు దంచికొడుతున్నాయి. ఇన్నిరోజులు వర్షాలు లేవని కంగారుపడినవారే ఇప్పుడు కుండపోత వానలతో ఇబ్బంది పడుతున్నారు. రూరల్ ప్రాంతాల ప్రజల ముఖాల్లో ఈ వర్షాలు ఆనందాన్ని నింపగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రం ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
గత రెండ్రోజులు కురుస్తున్న అతిభారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. మరీముఖ్యంగా నిన్న(శుక్రవారం) సాయంత్రం నుండి రాత్రివరకు కురిసిన కుండపోత వాన నగరాన్ని ముంచేసింది. కొన్ని గంటల్లోనే భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపించాయి... వరదనీరు లోతట్టుప్రాంతాల అపార్ట్ మెంట్స్, ఇళ్లలోకి చేరింది. చివరికి రసూల్ పురాలోని ఓ కార్ల షోరూంలోకి పీకల్లోతు వరదనీరు చేరడంతో అందులోనే 30మంది సిబ్బందిని బోట్ల ద్వారా రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నిబట్టే నగరంలో ఏస్థాయిలో వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇవాళ(శనివారం) కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటి అనుభవాల దృష్ట్యా ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు... చెరువులు, నాలాల సమీపంలోని నివాసాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ప్రభుత్వ సహాయాన్ని కోరవచ్చు... ఇందుకోసం జిహెచ్ఎంసి, హైడ్రా కొన్ని టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది... వాటికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.
1. జిహెచ్ఎంపి టోల్ ఫ్రీ నంబర్
ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని... ఎక్కడిక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాలని... ముఖ్యంగా పిల్లలు, ముసలివారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలతో వరదనీరు ఇళ్లలోకి చేరడం, చెట్ల కొమ్మలు విరిగిపడటం, హోర్డింగ్, ప్లెక్సీలు ప్రమాదకరంగా మారడం వంటి అనేక సమస్యలు ప్రజలకు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో సహాయం కోసం వెంటనే జిహెచ్ఎంసి హెల్ప్ లైన్ నంబర్ 040-21111111 నంబర్ కు కాల్ చేయాలని... వెంటనే అధికారుల నుండి సహాయం అందుతుందని మేయర్ విజయలక్ష్మి సూచించారు.
2. హైడ్రా హెల్ప్ లైన్ నంబర్
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) కూడా రంగంలోకి దిగింది. స్వయంగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ నిన్న(శుక్రవారం) భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. అలాగే హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు.
మీ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఏదయనా సమస్య వస్తే జిహెచ్ఎంసి కే కాదు హైడ్రాకు కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఇందుకోసం హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 90001 13667 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
3. పోలీస్, మెడికల్ హెల్ప్ లైన్ నంబర్
ఈ వర్షాలు, వరద నీటి కారణంగా ఏదయినా ప్రమాదం జరిగితే తక్షణసాయం కోసం పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 కు లేదా 112 కు ఫోన్ చేయవచ్చు. ఈ రెండు నంబర్లలో దేనికి సమాచారం అందించినా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వంటి సహాయం అందుతుంది. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో 108 కు ఫోన్ చేసినా చేసి అంబులెన్స్ సహాయం పొందవచ్చు.
4. విద్యుత్ శాఖ హెల్ప్ లైన్ నంబర్
భారీ వర్షాల కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతాయి.. ఒక్కోసారి ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇలాంటి సమయంలో TSNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1800-4252424 కు గానీ TSSPDCL నంబర్ 1800-599-01912 నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదంటే 1912 హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి కస్టమర్ సర్వీస్ ప్రతినిధిని సంప్రదించి సహాయం పొందవచ్చు.
భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షం కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.