భగవంతుని ఆరాధనకే కాదు.. బిల్వ ప్రతాన్ని ఇలా కూడా ఉపయోగించొచ్చు..
మహా శివరాత్రి, సిద్ధి వినాయక చవితి పండుగల సందర్భంగా దేవుళ్లకు బిల్వ పత్రాలను సమర్పిస్తారు. ముఖ్యంగా శివ పూజలో బిల్వపత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బిల్వ పత్రం భగవంతుని ఆరాధనకే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట మీకు తెలుసా..

బిల్వ పత్రంలో విటమిన్ ఎ, విటమిన్ బి, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, బీటా కెరోటిన్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నిర్జీవ చర్మం (Dull skin), జుట్టు (Hair)ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పొడి చర్మం (Dry skin), జుట్టు రాలడం (Hair fall) సమస్యను దూరం చేయడానికి మీరు బిల్వపత్రాన్ని ఉపయోగించొచ్చు. ఈ బిల్వపత్రం చర్మానికి, జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసే చర్మం కోసం.. బిల్వం ఆకులో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant), యాంటీ బాక్టీరియల్ (Antibacterial) గుణాలుంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ముఖానికి గ్లో తీసుకురావడానికి దీన్ని గ్రైండ్ చేసి.. అందులో కొన్ని చుక్కల తేనెను కలిపి ముఖానికి అప్లై చేయాలి. బిల్వ పత్రాన్ని నీళ్లలో మరిగించి ఈ నీటితో ముఖం కడిగినా.. ముఖం అందంగా తయారవుతుంది.
వృద్ధాప్యానికి గురికాకుండా కాపాడుతుంది: బిల్వపత్రంలో యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ (Anti aging element)లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ (Free radicals)నుంచి కాపాడుతుంది. ముడతలు, పిగ్మెంటేషన్ మొదలైన వాటి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇందుకోసం బిల్వపత్రాన్ని గ్రైండ్ చేసి దాని ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.
శరీర వాసనను తొలగిస్తుంది: శరీరం నుంచి చెమట వాసన ఎక్కువగా వచ్చేవారు బిల్వపత్రం ఆకును ఉపయోగించొచ్చు. దీనికోసం బిల్వపత్రం ఆకును గ్రైండ్ చేసి దాని రసాన్ని శరీరానికి అప్లై చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో స్నానం చేయాలి. ఇది శరీర దుర్వాసనను తొలగిస్తుంది.
మచ్చలు, దురద నుంచి ఉపశమనం: చర్మంపై మచ్చలు , లేదా దురద సమస్య ఉన్నట్టైతే.. దానిని తొలగించడానికి మీరు బిల్వపత్రాన్ని ఉపయోగించొచ్చు. ఇందుకోసం బిల్వపత్రాన్ని గ్రైండ్ చేసి దాని రసాన్ని జీలకర్ర పొడితో కలపాలి. దీన్ని చర్మంపై అప్లై చేస్తే దురద సమస్య తగ్గుతుంది. అలాగే మచ్చలు కూడా పోతాయి.
జుట్టు రాలడాన్ని ఆపుతుంది: జుట్టు రాలే సమస్యకు బిల్వ పత్రం చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇందుకోసం బిల్వపత్రాన్ని గ్రైండ్ చేసి జుట్టు మూలాలకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ప్రతిరోజూ ఉదయం బిల్వపత్రం ఆకులను కడిగి తినొచ్చు కూడా. దీని వల్ల కూడా జుట్టు రాలే సమస్య పోతుంది.
పేనును తొలగిస్తుంది: జుట్టులో పేళ్లను విపరీతంగా ఉన్నట్టైతే.. వాటిని తొలగించేందుకు ఎండు బిల్వ పత్రాన్నిగ్రైండ్ చేసి.. అందులో నువ్వుల నూనె, కర్పూరం నూనె కలపాలి. దీన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల తలలో పేనులను వదిలించుకోవచ్చు.