ఐరన్ బాక్స్ కొత్తదానిలా మెరవాలంటే వీటితో క్లీన్ చేస్తే చాలు!
ఐరన్ బాక్స్.. చిన్న వస్తువే అయినప్పటికీ మన రోజువారీ జీవితంలో దాని పాత్ర చాలా పెద్దది. ఐరన్ బాక్స్ ని సరిగ్గా క్లీన్ చేయకపోతే దుస్తులపై మరకలు పడతాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఐరన్ బాక్స్ ని ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

ఐరన్ బాక్స్ క్లీనింగ్ చిట్కాలు
సాధారణంగా ఒకే ఐరన్ బాక్స్‌ను ఎక్కువ కాలం వాడితే, దాని అడుగు భాగంలో నల్లగా లేదా గోధుమ రంగులో మరకలు పడతాయి. దాన్ని అలాగే వాడితే ఆ మరకలు బట్టలకు కూడా అంటుకుంటాయి. కాబట్టి రెగ్యులర్ గా క్లీన్ చేయడం అవసరం. దానివల్ల ఐరన్ బాక్స్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, దుస్తులకు నష్టం జరగకుండా ఉంటుంది. ఇక్కడ కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఐరన్ బాక్స్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి. తెలుసుకోండి.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా అద్భుతమైన సహజ క్లీనర్. రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ఐరన్ బాక్స్ బేస్ ప్లేట్ పై మెల్లగా రుద్దాలి. ఇది కాలిపోయిన మచ్చలను ఈజీగా తొలగిస్తుంది. ఆ తర్వాత మృదువైన తడి క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది.
వెనిగర్:
వెనిగర్ కూడా క్లీనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ వెనిగర్‌ను స్వల్పంగా వేడి చేసి, కాటన్ బట్టను దానిలో ముంచి ఐరన్ ప్లేట్‌పై రుద్దాలి. ఇది జిడ్డు, కాలిపోయిన మచ్చలను సులభంగా తొలగిస్తుంది. చివరగా శుభ్రమైన తడి క్లాత్ తో తుడిచి ఆరనివ్వాలి. వెనిగర్ వాడేటప్పుడు ఎప్పుడూ ప్లాస్టిక్ లేదా రబ్బరు భాగాలకు తగలకుండా జాగ్రత్త పడాలి.
టూత్‌పేస్ట్:
చిన్న చిన్న బ్లాక్ స్పాట్‌లకు టూత్‌పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్లేట్‌పై టూత్‌పేస్ట్ రాసి, మృదువైన క్లాత్ తో రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో క్లాత్ ని ముంచి తుడవాలి. ఇది ఐరన్ బాక్స్‌కు మళ్లీ కొత్త మెరుపు తెస్తుంది.
ఉప్పు:
ఐరన్ ప్లేట్‌పై అంటుకున్న జిడ్డును ఉప్పు సులభంగా తొలగిస్తుంది. అందుకోసం ఒక పేపర్‌పై ఉప్పు చల్లాలి. ఆ తర్వాత ఐరన్ బాక్స్ ను కాస్త వేడి చేసి.. దానిపై మెల్లగా ఇస్త్రీ చేయాలి. ఉప్పు మురికిని సులభంగా తీసేస్తుంది. ప్లేట్‌ను స్మూత్ గా చేస్తుంది.
ఐస్ క్యూబ్స్:
ఐరన్ బాక్స్‌ను గోరువెచ్చగా వేడి చేసి, దానిపై ఐస్ క్యూబ్స్ పెట్టి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఐస్ కరిగేటప్పుడు దానితో పాటు మరక కూడా పోతుంది. అలాగే ఐరన్ బాక్స్‌కు అంటుకున్న మరకలను శుభ్రం చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ని కూడా ఉపయోగించవచ్చు.
ఇవి గుర్తుంచుకోండి
- ఐరన్ బాక్స్ పూర్తిగా చల్లబడిన తర్వాతే శుభ్రం చేయాలి. వేడిగా ఉన్నప్పుడు క్లీనింగ్ చేయడం ప్రమాదకరం. చల్లబడిన తర్వాత పవర్ కేబుల్ తీసి, మృదువైన క్లాత్ తో తుడవాలి.
- శుభ్రం చేసిన తర్వాత ఐరన్ బాక్స్ పూర్తిగా ఆరిపోయే వరకు వేడి చేయవద్దు. డ్రై క్లాత్‌తో చక్కగా తుడవాలి. నీరు లేదా వెనిగర్ లోపల మిగిలి ఉంటే అది మళ్లీ మచ్చలు లేదా రస్ట్‌ను సృష్టించే ప్రమాదం ఉంది.