నోరు తెరిచి నిద్రపోవడానికి కారణం ఇదేనా?
కొంత మంది ఎప్పుడూ చూసినా నోరు తెరిచే నిద్రపోతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని అనారోగ్య సమస్య వల్లే వీరు ఇలా నోరు తెరిచి నిద్రపోతారట.

మీరు రోజూ నోరు తెరిచే నిద్రపోతున్నారా? అలాగే నిద్రపోతున్నప్పుడు ముక్కు నుంచి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతోందా? నిజానికి ఇలాంటి సమస్యలను ఎక్కడో ఒక్కరు మాత్రమే కాదు చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది స్లీప్ అప్నియాతో సంబంధం కలిగి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల వీరికి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఎందుకంటే శరీరంలో అవరోధం లేదా నాసికా మార్గం క్లియర్ గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నోరు తెరిచి నిద్రపోవడానికి స్లీప్ అప్నియా చాలా సాధారణ కారణాలలో ఒకటి. అయితే ఈ వ్యాధితో సంబంధం లేకుండా నోరుతెరిచి నిద్రపోయే వారు కూడా ఉన్నారు.
నోరు తెరిచి నిద్రపోయే వారికిక ముక్కు లోపల రక్త నాళాలు రక్తంతో నిండిపోతాయి. ఇది వాపు, సంకోచానికి కారణమవుతుంది. దీనివల్ల ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనివల్లే చాలా మంది శ్వాస తీసుకోవడానికి నోరు తెరుస్తారు. ఇవే కావు నోరు తెరిచి నిద్రపోవానికి ఇంకా ఎన్నో కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి
అధిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రాత్రిపూటే కాదు రోజంతా కూడా నోటి ద్వారే శ్వాస తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు.. అతను వేగంగా శ్వాస తీసుకుంటాడు. వీరిలో రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి వేగంగా శ్వాస తీసుకుంటాడు. అదికూడా నోరు తెరిచి.
అలర్జీలు
నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలెర్జీలు కూడా మరొక సాధారణ కారణమంటున్నారు నిపుణులు. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రక్షించడానికి ఆ పదార్ధంపై దాడి చేసినప్పుడు అలెర్జీ వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి వేగంగా శ్వాస పీల్చుకుంటారు. అలాగే అలెర్జీ కారకాన్ని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల వీరు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఉబ్బసం
ఊపిరితిత్తులలో మంట వల్ల ఉబ్బసం వస్తుంది. వీరికి తరచుగా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వీరికి చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారి శరీరం నోటి ద్వారా శ్వాసించడానికి అలవాటుపడుతుంది.
జలుబు, దగ్గు
చలికారణంగా నాసికా రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో శరీరం ఆక్సిజన్ ను పొందడానికి నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంది. ఇదే కాకుండా జలుబుతో సైనస్ వంటి వ్యాధి ఉన్నవారు కూడా నోటి ద్వారే గాలిని పీల్చుకుంటారు.