వర్షంలో ఫోన్ తడిసిపోయిందా? అయితే వెెంటనే చేయాల్సిన పనులు ఇవే
వర్షంలో ఫోన్ తడిసిపోవడం చాలా మందికి జరిగే ఉంటుంది. అప్పుడు వెంటనే ఫోన్ పాడవ్వకుండా ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఫోన్ నీటిలో తడిసినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేస్తే మొబైల్ డ్యామేజ్ కాదు.

వానలో ఫోన్ తడిస్తే ఏం చేయాలి?
వానాకాలంలో అకస్మాత్తుగా వచ్చే వర్షాలకు ఫోన్ తడిసిపోవడం చాలా కామన్. ఒక్కోసారి ఫోన్లోకి నీళ్లు వెళ్లి ఛార్జింగ్ ఎక్కకపోవచ్చు. స్పీకర్, టచ్ స్క్రీన్ కూడా పనిచేయకపోవచ్చు. ఇలాంటప్పుడు కంగారుపడకండి. వానలో తడిసిన ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.
తడిసిన ఫోన్ కు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టకండి. షార్ట్ సర్య్వూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ తడిగా ఉన్నప్పుడు దాన్ని వాడకండి. వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, మెత్తటి పొడి క్లాత్ తో స్క్రీన్, వెనుక భాగం, అంచులపై ఉన్న నీటిని సున్నితంగా తుడవండి.
ఛార్జింగ్ పోర్ట్ కింది వైపు ఉండేలా ఫోన్‌ను పట్టుకుంటే లోపల ఉన్న నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అంతేగానీ ఫోన్‌ను గట్టిగా ఊపకండి. పిన్నీసులు, పుల్లలు, కాగితం లేదా దూది లాంటివి ఛార్జింగ్ పోర్ట్‌లోకి అస్సలు దూర్చకండి.
పొడి గుడ్డ మీద ఫోన్‌ను పెట్టి, గాలి బాగా ఆడే చోట ఉంచండి. బయట ఉన్న తడి ఆరడానికి కొన్ని గంటలు పట్టొచ్చు. ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉంటే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది.
ఫోన్ తడిగా ఉన్నప్పుడు చేయకూడని తప్పులు!
1. బియ్యంలో ఫోన్‌ను వేయకండి
బియ్యంలో వేస్తే ఫోన్లోని తడి పోతుందనేది కేవలం అపోహ మాత్రమే. బియ్యం గింజలు ఛార్జింగ్ పోర్ట్‌లోకి వెళ్లి ఫోన్ మరింత పాడయ్యే ప్రమాదం ఉంది.
2. హెయిర్ డ్రయ్యర్‌తో వేడి చేయకండి
ఎక్కువ వేడి తగిలితే ఫోన్ లోపలి భాగాలు, స్క్రీన్ దెబ్బతింటాయి. వేడి గాలికి బదులుగా సాధారణ గాలి తగిలేలా చూసుకోండి.
3. వెంటనే ఛార్జింగ్ పెట్టకండి
ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉన్నప్పుడు కరెంట్ సప్లై జరిగితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. తడి పూర్తిగా ఆరేవరకు ఆగండి.
4. పిన్నీసు లేదా పుల్లతో శుభ్రం చేయకండి
ఇలా చేస్తే ఛార్జింగ్ పోర్ట్ లోపలి కనెక్షన్లు దెబ్బతింటాయి. రంధ్రంలోకి ఏమీ దూర్చకుండా గాలికి ఆరనివ్వడమే సురక్షితం.
5. పనిచేస్తుందని వాడేయకండి
స్క్రీన్ ఆన్ అవ్వగానే ఫోన్లోకి నీళ్లు వెళ్లలేదని అనుకోవద్దు. ఎక్కువగా తడిస్తే స్విచ్ ఆఫ్ చేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి.
ఛార్జింగ్ పోర్ట్‌లో మాయిశ్చర్ వార్నింగ్ వస్తే?
కొన్ని స్మార్ట్ఫోన్లలో ఛార్జింగ్ పోర్ట్‌లో నీళ్లు లేదా తడి ఉంటే, స్క్రీన్ మీద వార్నింగ్ వస్తుంది. ఇది ఫోన్‌ను కాపాడే ఫీచర్. వెంటనే ఛార్జర్ తీసేయండి. ఛార్జింగ్ పోర్ట్‌లో తడి ఉందో లేదో పైపైన మాత్రమే చూడండి. ఫోన్‌ను పొడిగా, గాలి ఆడే చోట ఉంచండి. వార్నింగ్ పోయేవరకు కేబుల్ ద్వారా ఛార్జింగ్ చేయకండి. ఫోన్ పూర్తిగా ఆరిన తర్వాత కూడా వార్నింగ్ వస్తుంటే, సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.
యాపిల్ సంస్థ సూచనల ప్రకారం, కొన్నిసార్లు పూర్తిగా ఆరడానికి 24 గంటల వరకు సమయం పట్టొచ్చు. కాబట్టి, అన్ని ఫోన్లకు ఒకే సమయం పడుతుందని చెప్పలేం. వార్నింగ్ పోకపోతే తొందరపడి ఛార్జింగ్ పెట్టకండి.

