Dress Colours: విపరీతమైన ఎండల్లో బయటకు వెళ్తున్నారా? ఈ 3 రంగుల్లో ఉన్న దుస్తులు వేసుకోవద్దు
Dress Colours: తీవ్రమైన వేడి, వడ గాలులు వీసే సమయం ఇది. అందులోనూ రోహిణి కార్తెలు వచ్చేసాయి. ఎర్రటి ఎండల్లో బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని రంగుల్లో ఉన్న దుస్తులు వేసుకోకూడదు. ఇవి వేడిని 95శాతం కంటే ఎక్కువ గ్రహిస్తాయి.

రోహిణి కార్తెలు మొదలు
ఎర్రటి ఎండల్లో బయటకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలే రోహిణి కార్తెలు మొదలైపోయాయి. రోళ్లు కూడా పగిలేంత వేడి వచ్చే రోజులు ఇవి. ప్రస్తుతం మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా నగరాల్లో 45 డిగ్రీల నుంచి 47 విద్యల సెల్సియస్ కు ఎండలు చేరుకున్నాయి. తీవ్రమైన ఎండల్లో బయటకు వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాటిల్లో మీరు వేసుకునే దుస్తుల రంగు కూడా ముఖ్యమే. బయటికి వెళ్తున్నప్పుడు వేడిని అధికంగా గ్రహించే కొన్ని రంగుల దుస్తులు వేసుకోకూడదు. ఏ రంగు దుస్తులు వేడిని అధికంగా గ్రహిస్తాయో తెలుసుకోండి.

కాటన్ దుస్తులు వేయచ్చు.. కానీ
వేసవిలో కాటన్ దుస్తులు వేసుకోవాలనుకుంటారంతా. కానీ కాటన్ లోనే ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిదో మాత్రం చాలా మందికి తెలియదు. ముదురు రంగు దుస్తులు వేసుకుంటే సూర్యరశ్మి, వేడి ఎక్కువగా ఆ దుస్తులు గ్రహిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. దుస్తులు ఎక్కువ వేడిని గ్రహించినప్పుడు ఆ వేడి శరీరానికే బదిలీ అవుతుంది. దీనివల్ల శరీరం వేడెక్కిపోతుంది. అందుకే బయటకు వెళ్ళినప్పుడు లేత రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇవి సూర్యకిరణాలను తిరిగి పరావర్తనం చెందేలా చేస్తుంది. వేడి శరీరానికి చేరడానికి అడ్డుగా ఉంటాయి. అందుకే ఎడారి ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎక్కువగా లేత రంగు దుస్తులు వేసుకుంటూ ఉంటారు.
ఈ మూడు రంగులు వద్దు
నలుపు రంగు అత్యధికంగా వేడిని ఆకర్షిస్తుంది. నలుపు రంగు దుస్తులు వేసుకొని సూర్యకాంతిలో నిలిచి ఉంటే 95 శాతం వరకు వేడిని గ్రహించి శరీరానికే చేరవేస్తుంది. ఎండల్లో ఒక వ్యక్తి నల్లని దుస్తులు వేసుకొని ఉంటే అతని శరీరం కూడా వేడెక్కిపోవడం గమనించవచ్చు. అదేవిధంగా ముదురు నీలం, ముదురు ఎరుపు రంగు దుస్తులు కూడా వేసుకోవడం మంచిది కాదు. ఇవి కూడా శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి కారణమవుతాయి. ఒక వ్యక్తి ఈ మూడు ముదురు రంగు దుస్తులు వేసుకొని ఎక్కువసేపు ఎండలో గడిపితే అతని శరీరం వేడి ప్రభావానికి గురి అవుతుంది.
ఏ రంగులు వేసుకోవాలి?
మండే ఎండల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిది. తెలుపు రంగు సూర్య కిరణాలను ఎక్కువగా పరావర్తనం చెందిస్తుంది. దీనివల్ల శరీరానికి చల్లగా అనిపిస్తుంది. అలాగే పసుపు, లేత నీలం, లేత గులాబీ, లేత ఆకుపచ్చ, ఇతర పాస్టల్ రంగులు వేసవికి అనువైనవి. ఇవి వేడిని తక్కువగా గ్రహించి శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచుతాయి.
