అరటి పండు నుంచి నారింజ వరకు.. మీ కంటిచూపును పెంచే ఈ పండ్లను తప్పక తినండి.
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మీ వయసు పెరిగినా..కంటి చూపు తగ్గే ప్రమాదం ఉండదు. అయితే కొన్ని రకాల పండ్లు కళ్లను ఆరోగ్యంగా ఉంచి.. కంటిచూపును పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అవేంటంటే..

eye health
ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇందుకోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలి. ఆరోగ్యకరమైన పోషణ దృష్టిని మెరుగుపరుస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయడం, వాతావరణ మార్పులు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు లేదా సెల్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. కళ్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇవి మీ కళ్ళపై ఒత్తిడిని తెస్తాయి. దీంతో కంటిచూపు మసకబారుతుంది. కంటిచూపు తగ్గడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, మెడ, వీపు, భుజంలో నొప్పిని కూడా కలుగుతుంది. అయితే క్రమం తప్పకుండా కొన్ని పండ్లను తింటే ఈ సమస్యలను నివారించొచ్చు. ఈ పండ్లు కంటి చూపును మెరుగుపర్చడంలో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. వయస్సు-సంబంధిత వచ్చే దృష్టి సమస్యలు, మాక్యులర్ క్షీణత, కంటిశుక్లంతో సహా ఎన్నో సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
బెర్రీలు
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీలు, బ్లాక్బెర్రీలు కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ పండ్లు అద్భుతంగా ఉపయోగపడతాయి. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, కళ్లు పొడిబారడాన్ని, దృష్టి లోపాలను, మాక్యులర్ క్షీణతను నివారించడానికి సహాయపడతాయి.
అరటిపండ్లు
పొటాషియం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇది కళ్ళు పొడిబారకుండా ఆపడానికి సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పోషకం ఎంతో సహాయపడుతుంది. ఈ పొటాషియం అరటిపండులో పుష్కలంగా ఉంటుంది.
మామిడి, బొప్పాయి
లుటిన్, జియాక్సంతిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే ముఖ్య పోషకాలు. ఇవి సహజమైన సన్ బ్లాక్ గా పనిచేస్తాయి. ఇది రెటీనాలోకి వచ్చే అదనపు కాంతిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇవి నీలిరంగు కాంతి నుంచి కళ్లను రక్షించడానికి కూడా సహాయపడతాయి. ఈ పోషకాలు మామిడి, బొప్పాయిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
Dried Apricots
ఆప్రికాట్స్
ఆప్రికాట్ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రాత్రి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే నీలి, అతినీలలోహిత కాంతి నుంచి కళ్లు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇది రెటీనాను రక్షించడానికి కూడా సహాయపడుతుంది.
ఆరోగ్యంగా ఉండటానికి.. కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలని ఎన్నో ఆరోగ్య పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విటమిన్లలను, ఖనిజాలను యాంటీఆక్సిడెంట్లు అంటారు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మీ కణాలు, కణజాలాలను ఆరోగ్యంగా చేస్తాయి.