Egg Yolk: గుడ్డులోని పచ్చసొన అధికంగా తింటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ?
Egg Yolk: గుడ్డు సంపూర్ణ ఆహారంగా చెప్పుకుంటారు. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు వస్తుందని చాలామంది భయపడతారు. నిజంగానే పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

పచ్చసొనతో నిజంగానే ముప్పు ఉందా?
గుడ్డును సంపూర్ణ ఆహారంగా చెప్పుకుంటాము. దాదాపు అన్ని రకాల పోషకాలను గుడ్డు అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కానీ, పచ్చసొన తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వస్తుందని చాలామంది అనుకుంటారు. నిజంగానే పచ్చసొన కొలెస్ట్రాల్‌ను పెంచుతుందా? ఫరీదాబాద్‌లోని అమృతా హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మహేంద్ర సింగ్ రాజ్‌పుత్ ఏమంటున్నారంటే.. మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుందని చాలామంది పొరబడతారు. నిజానికి ఇది అపోహ మాత్రమే.
గుడ్డు తినేటప్పుడు పచ్చసొన పడేయాలా?
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ గుండె జబ్బుల ముప్పు అనేది మన మొత్తం ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, జీవక్రియల ఆరోగ్యం, ముఖ్యంగా మనం తీసుకునే శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ మీద ఆధారపడి ఉంటుంది.
రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరగదని బీఎంజే (BMJ) జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో తేలింది. అలాగని కొలెస్ట్రాల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొందరిలో ఎక్కువగా గుడ్లు లేదా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తింటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
పచ్చసొనలో విటమిన్ బి9
గుడ్డులోని మొత్తం ప్రోటీన్‌లో 40 శాతం పచ్చసొనలోనే ఉంటుంది. మిగతా 60 శాతం తెల్లసొనలో ఉంటుంది. ఒక పూర్తి గుడ్డులో మన శరీరానికి కావాల్సిన అన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి. పచ్చసొనలో విటమిన్ బి9 సహజ రూపమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణులకు ఇది చాలా అవసరం.
పచ్చసొనను పడేస్తే అందులోని ముఖ్యమైన పోషకాలను మనం కోల్పోతాం. పచ్చసొనలో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. దాన్ని పడేస్తే కొలెస్ట్రాల్‌తో పాటు పోషకాలను కూడా వదులుకున్నట్లే అని డాక్టర్ రాజ్‌పుత్ అంటున్నారు. గుడ్డును కూరగాయలతో కలిపి తినడం చాలా మంచిది. కానీ చీజ్, బటర్, ప్రాసెస్ చేసిన మాంసంతో కలిపి ఎప్పుడూ తినకూడదు.
ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు రోజుకు 1 నుంచి 2 గుడ్లు (పచ్చసొనతో సహా) హాయిగా తినొచ్చు. గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు మాత్రం గుడ్లు తక్కువగా తినాలి. కొవ్వు బాగా తగ్గించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్లు, రోజూ గుడ్డు తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

