Beer: బీరుకు, పొట్టకు మధ్య అసలు సంబంధం ఏంటో తెలుసా.?
ఆల్కాహాల్ ప్రియులు ఎంతో ఇష్టంగా తాగే వాటిలో బీర్ ప్రధానమైంది. విస్కీ అలవాటు లేని వారు కూడా బీర్ సేవిస్తుంటారు. అయితే బీర్ తాగితే పొట్ట వస్తుందని చాలా మంది చెబుతుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది.? నిజంగానే బీరు తాగితే పొట్ట వస్తుందా.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Image Credit: Getty Images
బీరు తాగిన వెంటనే ఆ పానీయం అన్నవాహిక గుండా నేరుగా పొట్టలోకి వెళ్తుంది. ఆ తర్వాత బీర్‌లోని ఆల్కహాల్ నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆల్కహాల్ నూ మిగిలిన దాన్ని పేగులు పీల్చుకుంటాయి. బీర్‌లోని ఆల్కహాల్ రక్తం ద్వారా లివర్‌ను చేరుకుంటుంది. అక్కడ విచ్చిన్నమవుతుంది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో అసిటేట్, అసిటాల్టిహైడ్ అనే వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఈ వ్యర్థపదార్థాలు కొవ్వును కరగడాన్ని అడ్డుకుంటాయి.
ఇదే సమయంలో బీరులో ఉండే మరో పదార్థమైన ఎసిటైల్ CoA నుంచి కొవ్వు ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. రోజూ బీరు తాగేవారిలో పైన చెప్పిన ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కొవ్వు కరగకపోవడంతో, కొవ్వు పేరుకుపోవడం కూడా జరుగుతుంది. బీరు తాగితే పొట్ట పెరగడానికి ప్రధాన కారణం ఇదేనన్నమాట. అంతేకాకుండా బీరులో అధిక కేలరీలు ఉంటాయి. ఈ కేలరీలు కొవ్వుగా మారుతాయి. ఇది కూడా పొట్ట రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.
Image Credit: Getty Images
ఇక బీర్ తాగినప్పుడు శరీరంలో మొదట ఆల్కహాల్‌ను కరిగించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఫలితంగా, మిగతా ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకుండా కొవ్వుగా మారతాయి. బీర్ తాగితే సహజంగానే ఆకలి ఎక్కువ అవుతుంది. దీంతో తెలియకుండానే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్, నూనె వంటలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట పెరుగుతుంది.
Image Credit: Getty Images
పొట్ట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.?
అప్పటికే బరువు, పొట్ట ఎక్కువగా ఉన్న వారు వీలైనంత వరకు బీరుకు దూరంగా ఉండడమే మంచిది. బీరు తాగే సమయంలో నూనె ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లైట్ ఫుడ్‌ను తీసుకోవాలి. తక్కువ కేలరీలు ఉన్న ఫుడ్‌ను తీసుకోవాలి. బీర్ తాగిన వెంటనే పడుకోకూడదు. కనీసం 3 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా బీర్ ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.