పెళ్లి తర్వాత అమ్మాయిలు ఎందుకు లావవుతారు.? ఆ కారణం మాత్రం కాదంటా..
ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్‌గా చెప్పుకునే పెళ్లి విషయంలో అటు మహిళలతో పాటు ఇటు పురుషుల్లోనూ ఎన్నో భయాలు ఉంటాయి. ఇక వివాహం తర్వాత మనిషి జీవితంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు ఎక్కువగా వస్తాయి. అలాంటి మార్పులు బరువు పెరగడం ఒకటి..
పెళ్లి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. పెళ్లి అనే ఆలోచన రాగానే స్త్రీ, పురుషులు ఇద్దరిలో ఏదో తెలియని భయం, ఆందోళన మొదలవుంది. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకు తెలియని వ్యక్తుల జీవితాల్లోకి వెళ్తున్నామనే ఆలోచనే వారిని గందరగోళానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే వారిలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మహిళలు పెళ్లి తర్వాత బరువు పెరగడం గమనించే ఉంటాం. అయితే దీనికి అసలు కారణం ఏంటి.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లైన కొత్తలో..
పెళ్లి అయిన వెంటనే మహిళల జీవన విధానంలో వచ్చే ప్రధాన మార్పు తీసుకునే ఆహారం. కొత్త ఆహారపు అలవాట్లు పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి జరిగిన కొత్తలో పిండి వంటలు, భోజనాలు ఎక్కువగా చేస్తుంటారు. బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలియకుండా ఎక్కువగా తినేస్తుంటారు. మహిళల్లో బరువు పెరిగేందుకు కారణమవుతుందని నిపుణులు చెబుతుంటారు.
ఒకేచోట ఉండడం..
పెళ్లికి ముందు మహిళలు ఎంతో కొంత స్వేచ్ఛగా ఉంటారు. బయటకు వెళ్తుంటారు. వ్యాయామం, వాకింగ్ వంటి అలవాట్లు ఉంటాయి. అయితే చాలా మంది పెళ్లి తర్వాత ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడుతుంటారు. శారీరక వ్యాయామం తగ్గుతుంది. ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని చేసే పనులు చేస్తుంటారు. ఈ కారణంగా కూడా కొత్తగా పెళ్లి అయిన మహిళలు బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటుంటారు.
ఒత్తిడి..
అప్పటి వరకు ముక్కు మొహం తెలియని వారితో ఉండడం, వారి ఆచారాలను, అలవాట్లను ఫాలో అవ్వడం అనేది కచ్చితంగా మహిళల్లో ఒత్తిడకి కారణమవుతుంది. ముఖ్యంగా భావోద్వేగాల్లో వచ్చే మార్పుల కారణంగా హార్మోన్లలో కూడా మార్పులు వస్తుంటాయి. దీంతో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఇది కూడా కొత్తగా పెళ్లైన వారు లావుగా మారడానికి ఒక కారణంగా చెబుతుంటారు.
అదే కారణం కాదు..
పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య శారీరక కలయిక ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ వల్ల శరీరంలో మార్పులు చేసుకోవడంతో లావుగా అవుతారనే ఓ వాదన కూడా ఉంది. అయితే ఇందులో పూర్తి స్థాయిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ శాతం భావోద్వేగ సంబంధిత మార్పులే బరువు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. వీటిలో ఎంత వరకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదని రీడర్స్ గమనించాలి.