holi 2022: మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘హోలీ’ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా..
holi 2022: చిన్నా.. పెద్దా.. అంటూ తేడా లేకుండా అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే హోళీ పండుగ మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ పండుగను మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం పదండి..

చెడు పై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందనడానికి సూచికగా హోలీ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో దీపావళి తర్వాత వచ్చే పండుగల్లో హోలీనే గ్రాండ్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హోలీ పండుగను సత్య యుగం నుంచీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ‘హోలీ’ అంటే అగ్ని పునీతమైనది లేదా అగ్ని అని అర్థం. ఈ పండుగ ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది.

హోలీ పండుగనే కాముని పున్నమి అని , హోలీ అని, డోలికోత్సవమని, రంగుల పండుగ అనికూడా అంటారు. ఈ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. విష్ణువు నుంచి నరసింహ అవతారం, రాధ కృష్ణుల ప్రేమ కథ, కామదేవుడు, రతీ దేవత యొక్క ఇతిహాసాల వరకు అనేక కథలను హోలీ జరుపుకోవడానికి కారణంగా చెప్పుకుంటారు.
ఈ రంగుల పండుగను ఈ ఏడాది భారతదేశమంతటా మార్చి 18 న సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఇక ఈ పండుగకు ఒక రోజు ముందున హోలికా దహనం పూజను నిర్వహిస్తారు.దీనినే వివిధ ప్రాంతాల్లో ఛోటీ హోలీ అనికూడా అంటారు. దీనిని మార్చి 17న జరుపుకోనున్నారు. దేశ వ్యాప్తంగా ఈ రంగుల పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్: బీహార్ లో హోలీ పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫాల్గున పూర్ణిమ అంటే హోలీకి ముందు రోజు ప్రజలంతా భోగి మంటలు వేస్తారు. అక్కడి ప్రజలంతా సాంప్రదాయకంగా ఆవు పేడ పదార్థాలను, అవసరం లేని కలపను, పంటలను కోసిన తర్వాత ఉండే పొట్టును , అప్పుడే పండిన కొన్ని గోధుమలను భోగి మంటలో వేస్తారు.
ఆ తర్వాతి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో బురదతో కూడా హోలీని ఆడతారు. పట్టణాల్లో అయితే ఒకరికొకరు రంగులను జల్లుకుంటారు.
కర్నాటక: కర్నాటకలో హోలీ పండుగను రెండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. హొలీకి ముందు రోజున ప్రజలంతా కలపను సేకరించి 'కామదహన'లో వేసి కాల్చుతారు. ఆ రోజున ప్రజలు తమ ఇళ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు వండుతారు. వేడుకకు ఐదు రోజుల ముందు, రాష్ట్రంలోని సిర్సి అనే ఒక విభాగంలో నివాసితులు 'బెదర వేష' అనే జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో హోలీ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఇక్కక హోలీని షింగా వలె సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడి యువకులంతా హోలీకి ముందు రోజు కట్టెలను అందరి ఇంటికి తీసుకెళ్లి డబ్బులను పోగేస్తారు. ఇకహోలీ రోజున ఆ కట్టెలనంతా ఒక పెద్ద కుప్పగా వేసి.. సాయంత్రం పూట మంట వెలిగిస్తారు. తిను బండాలను, భోజనాన్ని సమర్పించడం ఇక్కడి ఆచారం.
తెలంగాణ: పురాణాల ప్రకారం.. హోలీ కామదేవునికి సంబంధించింది కాబట్టి ఈ పండుగను కాముని పున్నమి లేదా కామ పూర్ణిమ లేదా జాజిరి అని కూడా పిలుస్తారు. తెలంగాణాలో ఈ పండుగను 10 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ చివరి రోజున మాత్రం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు 9 రోజుల ముందు సాంప్రదాయ పాటలు పాడుతూ, కోలాట కర్రలతో ఆడుతూ, డబ్బు, ఆహారం, కలప సేకరించి సంబరాలు చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్: ఇక్కడ హోలీ వేడుకను 'డోల్ జాత్రా' లేదా 'డోల్ పూర్ణిమ' అని కూడా పిలుస్తారు, పశ్చిమ బెంగాల్‌లో రాధా కృష్ణుల ఫోటోలను పల్లకిపై ఊరేగిస్తూ సంప్రదాయ నృత్యం చేస్తారు.