Hair Color: జుట్టుకు వేసిన రంగు నెలల తరబడి పోకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి
హెయిర్ కలరింగ్ (Hair color) వేసుకునే వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. జుట్టుకు రంగు వేసిన తర్వాత అది ఎక్కువకాలం నిలవాలని కోరుకుంటారు. జుట్టుకు రంగు వేసేటప్పుడు చేసే చిన్న పనులు ఆ రంగును ఎక్కువ కాలం వెలిసిపోకుండా కాపాడతాయి .

తెల్ల జుట్టుకు రంగు
తెల్ల జుట్టును కనిపించకుండా చేసుకునేందుకు ఎంతో మంది నల్ల రంగును వేసుకుంటారు. అలాగే ఫ్యాషన్ కోసం వివిధ రకాల జుట్టు రంగులను ప్రయత్నించేవారు కూడా ఉన్నారు. కొన్ని రకాల జుట్టు రంగులు చాలా ఖరీదైనవి. అవి ఒక్కోసారి త్వరగానే మసకబారి పోతాయి. జుట్టుకు రంగు వేసిన తర్వాత చేసే చిన్న తప్పులు రంగు త్వరగా పోయేలా చేస్తాయి. కాబట్టి ఈసారి జుట్టుకు రంగు వేసిన తర్వాత ఏ పనులు చేయాలో చేయకూడదో తెలుసుకోండి.
షాంపూ పెట్టవచ్చా?
హెయిర్ కలర్ చేసిన తర్వాత అందరూ చేసే తప్పు వెంటనే షాంపూ పెట్టి తలకు స్నానం చేయడం. చాలా మంది కలర్ చేసిన తర్వాత ఇదే పద్ధతిని పాటిస్తారు. నిజానికి హెయిర్ కలర్ వేసుకున్నాక ఒకరోజు తర్వాతే షాంపుతో జుట్టును వాష్ చేసుకోవాలి. లేకుంటే ఆ రంగు త్వరగా పోతుంది. జుట్టుకు వేసిన రంగు ఎక్కువ కాలం పాటు ప్రకాశవంతంగా ముదురు రంగులోనే ఉండాలంటే ఆ రంగు వేసిన తర్వాత రెండు మూడు రోజులు పాటు జుట్టును నీటితో కడగకండి. జుట్టు రంగు బాగా సెట్ అయిన తర్వాత తలకు స్నానం చేయండి. అలాగే సల్ఫేట్ లేని షాంపును మాత్రమే జుట్టును కడిగేందుకు ఉపయోగించండి.
చల్లని నీటితో
జుట్టుకు రంగు వేసిన తర్వాత ఎంతోమంది చేసే పని గోరువెచ్చని నీరు లేదా వేడినీరుతో తలకు స్నానం చేయడం. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. వాతావరణం చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా… జుట్టుకు రంగు వేసాక కచ్చితంగా చల్లని సాధారణ నీటితోనే తలకు స్నానం చేయాలి. లేకుంటే ఇది జుట్టుకు హానికరంగా మారుతుంది. వేడి నీటితో స్నానం చేస్తే జుట్టు వెంట్రుకల క్యూటికల్స్ ఓపెన్ అవుతాయి. దీనివల్ల వెంట్రులకు పట్టిన రంగు త్వరగా పోతుంది. అవి రంగును లాక్ చేయాలంటే జుట్టును చల్లని నీటితోనే శుభ్రం చేసుకోవాలి.
హీట్ స్టైలింగ్ వద్దు
ఇప్పటి యువత హీట్ స్టైలింగ్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి హీట్ స్టెయిలింగ్ రంగు వేసిన జుట్టును త్వరగా దెబ్బతీస్తుంది. హెయిర్ డ్రయర్లు, కర్లింగ్ మెషిన్లు, స్ట్రెయిట్ నర్లు వంటివి ఉపయోగించడం వల్ల జుట్టుకు వేసిన రంగు త్వరగా పోతుంది. ఎందుకంటే ఇవి జుట్టులోని తేమను తొలగిస్తాయి. తేమతో పాటు జుట్టు రంగు కూడా బయటికి పోతుంది. కాబట్టి జుట్టుకు రంగు వేసిన తర్వాత అత్యవసరం అయితే తప్ప హీట్ స్లైయిలింగ్ జోలికి వెళ్ళకండి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
జుట్టుకు రంగు వేసిన తర్వాత ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే మీ తలను టోపీతో కప్పుకోండి. జుట్టుకు రంగు వేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడరు. కానీ షాంపూ చేసిన తర్వాత కండిషనర్ ను కచ్చితంగా వాడాలి. దీని వల్ల జుట్టు పొడిబారడం, బలహీనంగా అవడం వంటివి తగ్గుతాయి. జుట్టుకు రంగు వేసే అలవాటు ఉన్నవారు పైన చెప్పిన పద్ధతులను పాటించడం ద్వారా నెలలు తరబడి ఆ రంగు పోకుండా కాపాడుకోవచ్చు. లేకుంటే ప్రతి నెలా రంగు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జుట్టుకు రంగు వేయడం అనేది ఖరీదైన పనిగా మారిపోయింది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి.