Divorce: ఈ కారణాలే విడాకులకు దారితీస్తాయి.. ఈ విషయాల్లో సర్దుకోకపోతే అంతే ఇక..
Divorce: ప్రస్తుత కాలంలో వివాహం బంధం ఎక్కువ రోజులు నిలబడలేకపోతోంది. పెళ్లైన రెండు మూడేండ్లకే విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అసలు ఈ విడాకులకు దారి తీసే కారణాలేంటో తెలుసుకుంటే.. ఆ బంధం అలాగే నిలుస్తుంది కదా..
Divorce: పెళ్లి ఓ అందమైన జర్నీ. ఒకరి కోసం ఒకరు అనే విధంగా జీవితాన్ని అల్లుకునే మధురమైన బంధం. కానీ ప్రస్తుతం కాలంలో వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడటం లేదు. ఎంతో మంది భార్యాభర్తలు ఇక వీరితో మేం జీవించలేమంటూ.. విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే రేటు బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. సాధారణ జనాల నుంచి మొదలు పెడితే.. సెలబ్రిటీలు కూడా ఈ విడాకుల బాటే పడుతున్నారు. అయితే విడాకులు తీసుకోవాడానికి ఎక్కడ పొరపాటు జరుగుతోంది. లోపం ఎక్కడుందో తెలుసుకుంటే వైవాహక బంధం అలాగే స్థిరంగా ఉంటుంది కదా.. ఓ సర్వే ప్రకారం.. విడాకులకు దారి తీసే కారణాలు ఇలా ఉన్నాయి..
గృహహింస: విడాకులకు దారి తీసే ప్రధాన కారణాల్లో గృహహింసే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అవును.. ఎక్కువ మంది మహిళలు గృహహింసను తట్టుకోలేకే వారి భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. శారీరకంగా, మానసికంగా మహిళలపై హింస పెరుగడంతోనే వారు పూర్తిగా విరక్తి చెంది.. ఆ బంధం నుంచి విముక్తి లభిస్తే చాలు అనే స్థితికి చేరుకుంటున్నారు. ఆ కారణంగానే వారు విడాకుల వరకు వెళ్తున్నారు.
మిస్ కమ్యూనికేషన్: కమ్యూనికేషన్ బాగుంటేనే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడేది. ముఖ్యంగా భార్య భర్తల మధ్యన ప్రధానంగా ఉండాల్సింది కమ్యూనికేషనే. ఇది లేకపోతేనే వారి వైవాహిక బంధం బీటలువారేలా చేస్తుంది. అందుకే ఆర్థిక సమస్యలైనా.. కుటుంబ వ్యవహారమైనా ఇద్దరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటేనే బంధం బలంగా ఉంటుంది. లేదంటే ఈ మిస్ కమ్యూనికేషన్ మీ బంధాన్ని శాస్వతంగా దూరం చేస్తుంది.
చెడు అలవాట్లు: చెడు అలవాట్లున్న వారు తమ జీవితాల్లోకి రావాలని ఎవరూ కోరుకోరు. అందులోనూ చెడు వ్యసనాలున్న వ్యక్తులు తమ జీవితంలోకి వస్తే ఎంతో Uncomfort గా ఫీలవుతుంటారు. ముఖ్యంగా ఇలాంటి వారితో వారి జీవిత ప్రయాణాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేరు. అందుకే మద్యం, డ్రగ్స్ అలవాటు ఉన్న భాగస్వాములను విడిచిడిపెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు. ఇలాంటి అలవాట్లుంటే కుటుంబంలో ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి వ్యసనాలు విడాకులకు దారి తీస్తాయి.
నమ్మకం: ఏ బంధమైనా కలకాలం నిలబడాలంటే దానికి ప్రధానంగా కావాల్సింది నమ్మకం. ఈ నమ్మకం కేవలం స్నేహ బంధానికే కాదు.. వివాహ బంధానికి కూడా ఎంతో అవసరం. ఈ నమ్మకం వివాహ బంధంలో లేకపోతే భార్యా భర్తల బంధం మధ్య అనుమానం అనే భీజం మొలుస్తుంది. దానితో వారిద్దరి మధ్యన తరచుగా కొట్లాటలు, గొడవలు, మనస్పర్తలకు వస్తాయి. అటువంటి సమయంలో వారి బంధం కడవరకు అస్సలు నిలబడదు. భార్యా భర్తలన్నాకా ఒకరిపై ఒకరికి స్వచ్ఛమైన నమ్మకం ఉండాలి. ఎలాంటి విషయాన్నైనా ఒకరికొకరు పంచుకుంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. అంతేకానీ విషయాలను దాయాలని చూస్తే.. ఆ బంధం మధ్యలోనే విడిపోతుంది.
కుటుంబ సమస్యలు: భార్యా భర్తల మధ్య గొడవలు, మనస్పర్తలు రావడానికి వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా ఒక కారణమే. ఆలుమగల మధ్యన వచ్చే ప్రతి చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం, వారి విషయాల్లో ఎక్కువగా కల్పించుకోవడం వంటివి చేస్తే భార్యా భర్తల మధ్యన దూరం మరింత పెరుగుతుంది తప్పా తగ్గదు. కాబట్టి కుటుంబ సభ్యులు అవసరానికి మించి వారి విషయాల్లో తొంగి చూస్తే కూడా ప్రమాదమే.