Natukodi Curry: నాటుకోడి కూర వండడం కష్టం అనుకుంటున్నారా? కుక్కర్లో ఇలా సులువుగా వండేయండి
సాధారణంగా నాటుకోడి కూర వండడం కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని కుక్కర్లో చాలా సులువుగా వండేయచ్చు. సింపుల్ టిప్స్ తో నాటుకోడి కూర ఎలా వండాలో రెసిపీ తెలుసుకోండి.

అదిరిపోయేలా నాటుకోడి కూర
బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి కూర అద్భుతంగా ఉంటుంది. కేవలం నాటుకోడి కూర కోసమే గ్రామాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. పట్టణాల్లో దొరికేవి పూర్తిగా బ్రాయిలర్ కోళ్లే. నాటుకోడి పేరుతో అమ్మే వాటికి కూడా దాదాపు కొన్ని రకాల ఇంజక్షన్లను ఇస్తూ ఉంటారు. అదే గ్రామాల్లో అయితే అసలు సిసలైన నాటు కోళ్లు దొరుకుతాయి. వాటితో కంట్రీ చికెన్ కర్రీ వండితే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నాటుకోడి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
నాటుకోడి మాంసం ఒక కిలో తెచ్చుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత, కారం రెండున్నర స్పూన్లు, ధనియాల పొడి రెండు స్పూన్లు, పసుపు ఒక స్పూను, నిమ్మరసం అర స్పూను, కొబ్బరిపొడి ఒక స్పూను, గసగసాలు ఒక స్పూను, దాల్చిన చెక్క రెండు, లవంగాలు అయిదు, ధనియాలు ఒక స్పూను తీసి పక్కన పెట్టుకోండి. ఇగురు కోసం ఉల్లిపాయల తరుగు అరకప్పు రెడీ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు, మూడు పచ్చిమిర్చి, నూనె తగినంత రెడీ చేసుకోండి. గుప్పెడు కరివేపాకులు, కొత్తిమీర తరుగును కూడా సిద్ధంగా పెట్టుకోండి.
నాటుకోడి కూర మసాలా ఇలా
నాటుకోడి కూర వండేందుకు ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి మ్యారినేషన్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలో చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు, కారం నిమ్మరసం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. రెండు గంటలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు నాటుకోడి కూరలో వేసే మసాలాను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం మీరు కళాయిలోనే దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసి వేయించండి. తర్వాత కొబ్బరి పొడి గసగసాలు కూడా వేసి వేయించి మిక్సీలో పొడి చేసి పెట్టుకోండి.
ఇలా వండండి
ఇప్పుడు స్టవ్ మీద కూర వండేందుకు పెద్ద కుక్కర్ ను పెట్టండి. కుక్కర్లో తగినంత నూనె వేసి ఉల్లి తరుగును, పచ్చిమిర్చిని వేసి రంగు మారేవరకు వేయించండి. ఉల్లిపాయల రంగు మారాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. తర్వాత పసుపు కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ ముక్కలను, కరివేపాకులను వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించండి. అది బాగా ఉడికాక ముందుగా పొడిచేసి పెట్టుకున్న నాటుకోడి మసాలా పొడిని వేసి బాగా కలపండి. ఆ తర్వాత కారం ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి.
అయిదు విజిల్స్ వచ్చేదాకా
ఒక పది నిమిషాలు చిన్న మంట మీద అలాగే ఉడికించండి. ఆ తర్వాత రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. కనీసం మూడు నుంచి ఐదు విజల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి చూడండి. అది ఇగురులాగా కాకుండా పులుసు లాగా వస్తే మళ్లీ దాన్ని ఇగురులాగా అయ్యేవరకు బాగా మరిగించండి. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే నాటుకోడి కూర రెడీ అయినట్టే. సాధారణ కొరత పోలిస్తే ఈ నాటుకోడి కూర వాసన కూడా కమ్మగా ఉంటుంది. బగారా రైస్, పులావ్ తో తింటే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం నాటుకోడి కూరను ఒకసారి తెచ్చుకొని ఇలా కుక్కర్లో వండేయండి అద్భుతంగా ఉంటుంది.