Indoor Plants: ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో
Indoor Plants: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటి బయటే కాకుండా ఇంటి లోపల కూడా రకరకాల మొక్కలను పెంచుతున్నారు. ఇవి కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి.

ఇండోర్ ప్లాంట్స్
ఇంట్లో పెంచే మొక్కలు మన ఇల్లు అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఇండోర్ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో గాలి శుద్ధి అవుతుంది. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు
మానసిక స్థితి మెరుగుపడుతుంది
ఇంట్లో మొక్కలను పెంచితే ఇల్లు పచ్చగా, అందంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇవి మన మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మొక్కల వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆఫీసులో లేదా ఇంట్లోని ఆఫీసు టేబుల్, స్టడీ టేబుల్ పై మొక్కలను పెంచితే పని చేయడానికి, చదవడానికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. ఎందుకంటే మొక్కలు మన ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఒత్తిడి తగ్గడంతో మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం తగ్గుతుంది.
స్పైడర్ ప్లాంట్ ను పెంచడం వల్ల కలిగే ప్రయోజనం
స్పైడర్ ప్లాంట్ చూడటానికి అందంగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో తేమను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. స్పైడర్ ప్లాంట్ వల్ల ఇంట్లో తేమ 20% నుంచి 30% వరకు పెరిగిందని ఒక అధ్యయనం లో తేలింది. ఈ స్పైడర్ ప్లాంట్ ను రూం హీటర్ లేదా ఏసీ ఉన్న గదిలో పెంచితే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ రూముల్లో ఈ మొక్క తగ్గిన తేమను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీకు జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గాలిని శుద్ధి చేస్తుంది
పెయింట్, కార్పెట్లు, హోమ్ క్లీనర్లు వంటి ఇండోర్ వస్తువుల నుంచి రిలీజ్ అయ్యే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల ఇంట్లోని గాలి కలుషితం అయ్యి చర్మం, కళ్లు దెబ్బతింటాయి. అంతేకాదు ఉబ్బసం సమస్య కూడా ఎక్కువ అవుతుంది. అయితే మీరు ఇంట్లో మొక్కలను పెంచితే ఈ కెమికల్స్ ప్రభావం తగ్గుతుంది. మొక్కలు గాలిని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. దీంతో మీ ఆరోగ్యం బాగుంటుంది.
జీర్ణక్రియకు మేలు చేసే మొక్కలు
ఇంట్లో పుదీనా,తులసి వంటి మూలికా మొక్కలను పెంచడం చాలా మంచిది. ఎందుకంటే ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి ఎన్నో కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా సహాయపడతాయి. కాబట్టి ఈ మొక్కలను మీ ఇంటి దగ్గర కచ్చితంగా పెంచండి. వీటిలో ఉండే ఔషదగుణాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
కలబంద మొక్కను ఇంట్లో పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు
కలబంద మొక్కలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. దీనిని ఉపయోగించి మనం ఎన్నో చర్మ, జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని గుజ్జు వడదెబ్బ, కాలిన గాయాలను తొందరగా మాన్పడానికి సహాయపడుతుంది. కలబంద రసాన్ని తాగడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ గుజ్జును జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తగ్గి జుట్టు హెల్తీగా పెరుగుతుంది.
స్నేక్ ప్లాంట్ వల్ల కలిగే లాభాలు
ఒత్తిడి చిన్న సమస్య కాదు. దీనివల్ల కేవలం మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే స్నేక్ ప్లాంట్ ఈ ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. స్నేక్ ప్లాంట్ ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి తీసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని పెంచే కార్డిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ ను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.