Amla Rice: పిల్లల లంచ్ బాక్స్‌కి నిమిషాల్లో రెడీ అయ్యే ఉసిరి అన్నం.. రుచి అదిరిపోతుంది
Amla Rice: ఉసిరికాయ అన్నం చాలా రుచిగా ఉంటుంది. పుల్లపుల్లగా, కారంగా ఉండే ఈ అన్నాన్ని పొడిపొడిగా చేస్తే రుచి అదిరిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్ కు ఇది మంచి ఛాయిస్, ఉసిరి కాయలో పోషకాలు కూడా ఎక్కువ. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

ఉసిరి అన్నం రెసిపీ
వగరు, పులుపు కలగలిసిన ఉసిరికాయతో చేసే ఈ అన్నం చాలా స్పెషల్. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్కూల్‌కి వెళ్లే పిల్లలకు, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లకు లంచ్ బాక్స్‌లో పెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్. పొడిపొడిగా ఉండే అన్నంలో పల్లీలు, పచ్చిమిర్చి, ఉసిరి రుచి కలిస్తే అద్భుతంగా ఉంటుంది. దీన్ని రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము.
ఉసిరి అన్నం కావాల్సిన పదార్థాలు
- వండిన అన్నం: 3 నుంచి 4 కప్పులు (పొడిపొడిగా చల్లార్చుకోవాలి)
- పెద్ద ఉసిరికాయలు: 4 నుంచి 5 (గింజలు తీసి తురుముకోవాలి)
- నువ్వుల నూనె: 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు: 1 టీస్పూన్
- మినప్పప్పు: 1½ టీస్పూన్
- శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
- వేపిన పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి: 2
- పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
- అల్లం: చిన్న ముక్క (సన్నగా తరిగినది)
- పసుపు: ½ టీస్పూన్
- ఇంగువ: ¼ టీస్పూన్
- కరివేపాకు: తగినంత
- ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం ఇలా
ముందుగా చేయాల్సినవి: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత గింజలు తీసేసి సన్నగా తురుముకోవాలి. అన్నాన్ని ముందే వండుకుని, ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి పొడిపొడిగా చల్లార్చుకోవాలి. వేడి అన్నం వాడితే ముద్దగా అయిపోతుంది.
తాలింపు వేసే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
మసాలాలు కలపడం: పప్పులు వేగాక, ఎండుమిర్చి, వేపిన పల్లీలు వేసి ఒకసారి కలపాలి. అందులోనే ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ తర్వాత పసుపు, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి కలపాలి.
ఉసిరి తురుము వేయించడం: ఈ తాలింపులో ముందుగా తురుమి పెట్టుకున్న ఉసిరికాయను వేయాలి. మంటను మీడియంలో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే వేయించాలి. ఎక్కువసేపు వేయిస్తే అందులోని పోషకాలు, రుచి తగ్గిపోతాయి.
అన్నం కలపడం: ఉసిరి తురుము కాస్త వేగాక, చల్లార్చుకున్న అన్నాన్ని కడాయిలో వేయాలి. గరిటెతో అన్నం మెతుకులు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. మసాలా, ఉసిరి తురుము అన్నానికి బాగా పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఉసిరికాయ అన్నం రెడీ అయినట్టే.







