AC Side Effects: ఏసీలో ఎక్కువ సేపు ఉండటం ఎంత ప్రమాదకరమో తెలుసా?
AC Side Effects : ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, మైగ్రేన్ , కళ్లు పొడిబారడం, చర్మం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.

AC Side Effects: పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందేందుకు కొంతమంది కూలర్లను, ఫ్యాన్లను ఆశ్రయిస్తుంటే ఇంకొంతమంది ఎయిర్ కండీషనర్లను (ఏసీ)లను వాడుతున్నారు. ఈ ఏసీలను ఆఫీసుల్లోనే కాదు, ఇల్లు, కారులో కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు.
ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఇవి బాగానే ఉన్నా.. వీటికి బానిసలుగా మారితే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోకతప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఎక్కువ సేపు ఏసీ రూముల్లో ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
World Asthma Day
ఆస్తమా, అలర్జీలు.. అలర్జీ, ఆస్తమా సమస్యను ఎదుర్కొంటున్నవారికి ఏసీలో ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా ఏసీలను తరచుగా క్లీన్ చేయకపోతే మాత్రం అస్తమా , అలర్జీ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
శ్వాస సంబంధ సమస్యలు.. ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం వల్ల గొంతు, ముక్కు కు సంబంధించిన శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే గొంతు పొడిబారుతుంది కూడా. దీంతో పాటుగా రినిటిస్ వంటి సమస్యలు కూడా రావొచ్చు.
డీహైడ్రేషన్.. గదుల్లో ఉండే వారితో పోల్చితే ఏసీల కింద ఉండేవారే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల తేమ ఎక్కువగా గ్రహించబడుతుంది. దీంతో మీరు డీహైడ్రేషన్ బారిన పడతారు.
తలనొప్పి.. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడి ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాగా ఏసీలో గంటల తరబడి ఉన్న తర్వాత ఎండలోకి వెళితే తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటుంది. ముఖ్యంగా ఏసీ ఉన్న గదిని సరిగ్గా ఉంచుకోకపోయినా మైగ్రేన్, తలనొప్పి సమస్యలు వస్తాయి.
కళ్లు పొడిబారడం.. కళ్లు పొడిబారడం వంటి సమస్యలతో బాధపడేవారు ఏసీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సమస్య ఉన్న వారు ఏసీలో ఉంటే కళ్లు పొడిబారడంతో పాటుగా కళ్లు దురద పెట్టడం, అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి డ్రై ఐ సిండ్రోమ్ సమస్య ఉన్నవారు గంటల తరబడి ఏసీలో ఉండటం మంచిది కాదు.
పొడి చర్మం.. ఏసీలో ఎక్కువ సేపు ఉంటే చర్మం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఏసీల్లో ఎక్కువ సేపు ఉండకూడదు.