Parenting: పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకూడదంటే పేరెంట్స్ ఈ 5 చేస్తే చాలు!
Parenting: ప్రస్తుతం పిల్లలు తినాలన్నా, ఆడుకోవాలన్నా, నిద్రపోవాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. వీడియోలు, రీల్స్ చూడటం, మొబైల్ గేమ్స్ ఆడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. మరి పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు కాకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

పిల్లలకు ఫోన్ అలవాటు కావద్దంటే ఏం చేయాలి?
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు చాలామంది స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడుతున్నారు. తినేటప్పుడు ఫోన్ కావాలని మారాం చేయడం, బయట ఆటలు ఆడకుండా, మొబైల్‌లోనే గేమ్స్ ఆడటం, ఖాళీ టైం దొరికితే వీడియోలు చూడటం వంటి అలవాట్లు చాలా ఇళ్లలో కనిపిస్తున్నాయి. మొదట్లో పిల్లలు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ఫోన్ చేతిలో పెడుతుంటారు. కానీ క్రమంగా అదే అలవాటుగా మారి, ఫోన్ ఇవ్వకపోతే ఏడవడం, కోపం తెచ్చుకోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకుండా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
స్క్రీన్ టైమ్‌కు పరిమితి
పిల్లలు మొబైల్ ఫోన్‌కు అలవాటు పడకుండా ఉండాలంటే ముందుగా స్క్రీన్ టైమ్‌ను నియంత్రించాలి. గంటల తరబడి ఫోన్ చూడకుండా, వారి వయసుకు తగిన టైంకి నియంత్రించాలి. చిన్న పిల్లలకు స్క్రీన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. కాస్త పెద్ద పిల్లలు ఫోన్ ఉపయోగించేటప్పుడు చదువు, ఆటపాటలు, నిద్రకు ఇబ్బంది కలగకుండా సమయాన్ని నిర్ణయించాలి.
ఇతర ఆటలను ప్రోత్సహించడం
సాధారణంగా పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మొబైల్‌ను పక్కన పెట్టమని చెప్పడంతో పాటు, వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అంటే బయట ఆటలు ఆడటం, సైకిల్ తొక్కడం, కథల పుస్తకాలు చదవడం, బొమ్మలు గీయడం వంటి వాటిపై ఆసక్తి కలిగించాలి. పిల్లలకు ఏ ఆటలు ఇష్టమో తెలుసుకుని, వాటిలో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వీలైనంత వరకు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఆడాలి.
పేరెంట్స్ కూడా ఫోన్ వాడకం తగ్గించడం
పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలంటే ముందుగా తల్లిదండ్రులే వాటిని పాటించాలి. పిల్లలు ఫోన్ చూడకూడదని చెబుతూ, పేరెంట్స్ మాత్రం ఎప్పుడూ మొబైల్‌లోనే గడిపితే పిల్లల వారి మాట వినరు. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు, వారితో ఆడేటప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టాలి. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరూ ఫోన్లకు దూరంగా ఉండేలా ఒక నియమం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.
ఫోన్ ఎక్కువగా వాడితే ఏమవుతుందో వివరించడం
పిల్లలు ఫోన్ అడిగిన ప్రతిసారీ కోప్పడటం, గట్టిగా మందలించడం కంటే వారికి ప్రేమగా నచ్చజెప్పడం మంచిది. ఎక్కువసేపు మొబైల్ చూడటం వల్ల కలిగే నష్టాన్ని వారి వయసుకు తగిన విధంగా వివరించాలి. ఫోన్ ఇవ్వనప్పుడు పిల్లలు ఏడ్చినా వెంటనే లొంగిపోకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. పిల్లలు ఎందుకు ఫోన్ కోసం ఎక్కువగా పట్టుబడుతున్నారో కూడా తెలుసుకోవాలి.
ఆ టైంలో ఫోన్లను దూరంగా ఉంచడం
పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్ని విషయాలు కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు వీడియోలు చూపిస్తూ తినిపించే అలవాటును క్రమంగా తగ్గించాలి. అలాగే నిద్రపోయే ముందు మొబైల్ చూడకుండా ఉండేలా ప్రోత్సహించాలి. పడుకునే టైంలో పిల్లలకు కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం లేదా రోజంతా జరిగిన విషయాల గురించి మాట్లాడటం వంటివి చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా పిల్లలు నెమ్మదిగా ఫోన్ వినియోగం తగ్గించే అవకాశం ఉంటుంది.

