గ్రామీణ స్థాయి యువతకు అదిరిపోయే అవకాశం...10 లక్షల మందికి ఏఐ శిక్షణ!
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. 10 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది.

ఏఐ శిక్షణ
రోజులు మారుతున్న కొద్ది టెక్నాలజీ కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తుంది.దీంతో నగర, పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గ్రామాల నుంచి యువత, వ్యవస్థాపకులు, ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారు ఈ శిక్షణ ద్వారా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం పొందనున్నారు.
AI for India 2.0
ఈ శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ ఇండియా మిషన్ భాగంగా చేపడుతున్నారు. ‘AI for India 2.0’ పేరుతో ఈ మిషన్‌కు రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నారు.
గ్రామస్థాయి డిజిటల్ సెంటర్లు
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థాపకులు, స్టార్టప్ ఆరంభించాలనుకునే యువత, స్వయం ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న మహిళలు, చిన్న వ్యాపార దారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. దేశ వ్యాప్తంగా పంచాయితీలు, CSC (Common Service Centers), గ్రామస్థాయి డిజిటల్ సెంటర్ల ద్వారా ఈ శిక్షణను అందించనున్నారు.
వినియోగదారుల డేటా
ఈ శిక్షణలో భాగంగా ఆధునిక AI టూల్స్, డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, చాట్‌బాట్ డెవలప్మెంట్, వినియోగదారుల డేటా నిర్వహణ వంటి విషయాలను బోధిస్తారు. ఇప్పటికే ఈ కోర్సు కంటెంట్‌ను భారతీయ భాషల్లో రూపొందించి, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా రూపొందిస్తున్నారు. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ తదితర ప్రాంతీయ భాషల్లో శిక్షణ అందించనున్నారు.
ఏఐ స్టార్టప్‌లు
ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా మైక్రోసాఫ్ట్, నాస్కాం, టెక్ మహీంద్రా, ఏఐ స్టార్టప్‌లు సహకరిస్తున్నాయి. వీరు తమ టెక్నాలజీ సామర్థ్యం, టూల్స్, ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు ముందుకొచ్చారు. AI విద్యను ప్రామాణికంగా, యాక్టివ్ ప్రాక్టికల్ మోడ్యూల్స్‌తో నేర్పించేందుకు యూనివర్సిటీలు కూడా సహకరిస్తున్నాయి.
ఈ శిక్షణ పూర్తయ్యాక, సర్టిఫికేట్ ఇస్తారు. దీంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం అప్లై చేయవచ్చు. స్వయం ఉపాధి కోసం తమ ఆలోచనలను డిజిటల్‌గా అమలు చేయవచ్చు. ఈ కోర్సు పూర్తిగా ఉచితం కావడంతో పాటు, ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామాల్లో CSC కేంద్రాల ద్వారా విద్యా సదుపాయాలను అందించనున్నారు.
AI ఆధారిత ఉపాధి అవకాశాలు
ఈ కార్యచరణ లక్ష్యం ఒకటి కాదు. ఒకవైపు డిజిటల్ పరిజ్ఞానం కలిగిన పౌరులను తయారు చేయడం, మరోవైపు AI ఆధారిత ఉపాధి అవకాశాలను గ్రామస్థాయికీ తీసుకురావడం. గ్రామీణ యువతను ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానించేందుకు ఇది కీలక అడుగు కానుంది.
ఇంతకుముందు AI, డేటా సైన్స్ వంటి విద్యలు కేవలం పట్టణాలలో, ప్రయివేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా గ్రామాల్లోని ప్రజలే లక్ష్యంగా ఉచిత శిక్షణను అందించడంతో విద్యలో సమానత్వానికి దారి తప్పకుండా చూపిస్తోంది. డిజిటల్ ఇండియా మిషన్ కింద ప్రభుత్వం చేపడుతున్న ఈ శిక్షణ విధానం, గ్రామీణ యువతకు భవిష్యత్ మార్గం వేస్తోంది.
డిజిటల్ ఇండియా పోర్టల్
వాస్తవానికి గ్రామీణ భారతదేశంలో విద్య, టెక్నాలజీ అవకాశాలు ఇంకా అసమానంగా ఉన్నాయి. దీనిని అధిగమించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు అవసరం. ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ మార్గదర్శి తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
ఈ శిక్షణలో పాల్గొనాలనుకునే వారు డిజిటల్ ఇండియా పోర్టల్ లేదా CSC కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవచ్చు. అర్హత పరంగా కనీసం పదో తరగతి చదివిన వారు ఉండాలి. ఏ వయసు వారైనా ఈ కోర్సులో పాల్గొనవచ్చు. విద్యార్హతతో పాటు డిజిటల్ పట్ల ఆసక్తి ఉండటం సరిపోతుంది.
గ్రామీణ స్థాయిలో డిజిటల్ పరిజ్ఞానం
ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో డిజిటల్ పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యం, ప్రతి గ్రామంలో కనీసం 100 మందికి డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
భవిష్యత్‌లో గ్రామీణ యువత AI టెక్నాలజీపై ఆధారపడి, స్టార్టప్‌లు ప్రారంభించి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలి. అదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలైన ఆలోచన. జ్ఞానమే శక్తి అన్న నినాదాన్ని నిజం చేసే దిశగా ఇది కీలకమైన పథం.

