- Home
- International
- USA: ఇక ఇండియన్స్ అమెరికా వెళ్లడం కష్టమేనా.? మరి అక్కడున్న వాళ్ల పరిస్థితి ఏంటి.?
USA: ఇక ఇండియన్స్ అమెరికా వెళ్లడం కష్టమేనా.? మరి అక్కడున్న వాళ్ల పరిస్థితి ఏంటి.?
USA: ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచల నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాకు వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు.

ట్రంప్ పాలనలో వలసదారులపై కఠిన వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాస్ డిపోర్టేషన్లు, అనధికారిక ప్రవేశాలపై కఠిన చర్యలు, వీసా పరిమితులు వంటి అంశాలు వరుసగా అమల్లోకి తెచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న వలస కార్మికులపై కూడా ఆయన ప్రభుత్వ చర్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
విద్యార్థి వీసాల జారీ భారీగా తగ్గింది
ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే 19 శాతం తగ్గుదల నమోదైంది. ఇది కరోనా తర్వాత అమెరికాలో నమోదైన అతి పెద్ద క్షీణతగా చెప్పొచ్చు. ఈ ప్రభావం ఎక్కువగా భారతీయ విద్యార్థులపై పడింది.
భారతీయ విద్యార్థులకు 44% తగ్గుదల
భారతీయ విద్యార్థులకు జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య గత సంవత్సరం కంటే 44 శాతం తగ్గింది. సాధారణంగా ఆగస్టు నెలలో యూఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమవుతాయి కాబట్టి, ఆ సమయంలో వీసాల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ ఈసారి అమెరికా మొత్తం 3,13,138 వీసాలు మాత్రమే జారీ చేసింది. వీటిలో చైనా విద్యార్థులు 86,647 వీసాలు పొందగా, భారతీయులకు ఇచ్చిన వీసాల సంఖ్య దాని సగానికి కూడా చేరలేదు.
సోషల్ మీడియా వెట్టింగ్ ప్రభావం
ఈ ఏడాది మేలో అమెరికా రాయబార కార్యాలయాలు విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశాయి. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో కొత్త సాంకేతిక చెకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ యాక్టివిటీని విశ్లేషించి, వారి సోషల్ మీడియా ప్రొఫైళ్లలో అనుమానాస్పద కంటెంట్ ఉంటే వీసా నిరాకరిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల అనేక మంది భారత విద్యార్థులు వీసాల కోసం ఎక్కువకాలం వేచి చూడాల్సి వచ్చింది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో మరో దెబ్బ
ఇప్పటికే ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లే భారతీయులపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచడం వల్ల సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు ఇతర ప్రొఫెషనల్ ఉద్యోగాలకు వెళ్లే అవకాశాలు తగ్గాయి. విద్యార్థుల నుంచి వలస కార్మికుల వరకు ట్రంప్ విధానాలు కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కలిపి అమెరికా వెళ్లాలని కలలు కంటోన్న భారత యువతలో నిరాశను పెంచుతున్నాయి. అయితే హెచ్1 బీ వీసా పెంపుతో అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం ఉండదనేది నిపుణులు అభిప్రాయం. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం కొత్తగా హెచ్1బీ వీసా ఇచ్చే వారికే ఫీజు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ ప్రభావం పెద్దగా పడకపోయినా, కొత్తగా వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.